BSc Agriculture
-
ఒకే వ్యక్తికి మూడు ఉద్యోగాలు
దండేపల్లి: దండేపల్లి మండల కేంద్రానికి చెందిన పెండ్యాల సత్యనారాయణ–శకుంతల కుమారుడు పెండ్యాల సాయికిరణ్ మూడు ఉద్యోగాలు సాధించాడు. సాయికిరణ్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్, మహారాష్ట్రలోని దపోలీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశాడు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ, గ్రూప్–4, ఇండియన్బ్యాంక్, మండల వ్యవసాయ అధికారి ఉద్యోగాల కోసం పరీక్షలు రాశాడు.. ఇందులో గ్రూ ప్–4లో జిల్లా 14వ ర్యాంకు సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇండియన్ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగం సాధించాడు. ఇటీవల విడుదలైన మండ ల వ్యవసాయ అధికారి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 42వ ర్యాంకు సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యా డు. సాయికిరణ్ మూడు ఉద్యోగాలకు ఎంపికవ్వడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏవో ఉద్యోగానికి ఎంపిక..జన్నారం: మండలంలోని పొనకల్ గ్రామానికి చెందిన జాడి రాజలింగం–రేణుక దంపతుల కూతురు స్పందన మండల వ్యవసాయ అధికారి ఉద్యోగానికి ఎంపికైంది. ఆమెను జగిత్యాల డిప్యూటీ కలెక్టర్ చిత్రుపటేల్ ఆదివారం పొనకల్లో అభినందించా రు. 2022లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తిచేసిన స్పందన, 2023 జనవరిలో భారత ఆహార సంస్థ నిర్వహించిన ఉద్యోగ పరీక్షలో టెక్నికల్ అసెస్టింట్ ఉద్యోగం సాధించి మంచిర్యాలలో ఉద్యోగం చేస్తున్నారు. 2023 మేలో నిర్వహించిన మండల వ్యవసాయ అధికారిగా ఉద్యోగ పరీక్షల ఫలితాలు తాజా గా విడుదల కాగా ఏవో ఉద్యోగం సాధించింది. తమ కూతురు ప్రభుత్వ కొలువులు సాధించినందుకు సంతోషంగా ఉందని స్పందన తల్లిదండ్రులు తెలిపారు. -
హన్మకొండ జిల్లా హసన్‌పర్తి SR యూనివర్సిటీలో సూసైడ్ కలకలం
-
తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ స్వీప్
సాక్షి, నెట్వర్క్: తెలంగాణలో బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టీకల్చర్, బీవీఎస్సీ, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫార్మ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఆ రాష్ట్ర ఎంసెట్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు దుమ్ములేపారు. అటు ఇంజనీరింగ్ విభాగంలోనూ, ఇటు మెడికల్ అండ్ అగ్రికల్చర్ విభాగంలోనూ టాప్ ర్యాంకులు కొల్లగొట్టి సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో సనపల అనిరుధ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో బూరుగుపల్లి సత్యరాజ్ జశ్వంత్ తెలంగాణ స్థాయిలో ఫస్ట్ ర్యాంకులతో భళా అనిపించారు. ఇంజనీరింగ్ విభాగంలో 2, 3, 5, 6, 8, 9, 10 ర్యాంకులు మన రాష్ట్ర విద్యార్థులకే దక్కాయి. అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలోనూ 2, 4, 5, 7, 8 ర్యాంకులు ఎగరేసుకుపోయారు. తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. కాగా ఇంజనీరింగ్ ర్యాంకర్లందరూ ఐఐటీల్లో చేరతామని, మెడికల్ విభాగం ర్యాంకర్లంతా వైద్య వృత్తిలో స్థిరపడతామని వెల్లడించారు. విజేతల అభిప్రాయాలు వైద్య రంగంలో ఉన్నతవిద్యనభ్యసిస్తా.. మాది చీరాల. నాన్న నాసిక సుధాకర్‌బాబు, అమ్మ శ్రీదేవి మగ్గం నేస్తారు. విజయవాడలోని ప్రైవేటు కాలేజీలో ఇంటర్మిడియెట్ చదివాను. వైద్య రంగంలో ఉన్నత విద్యనభ్యసించడమే నా లక్ష్యం. – నాసిక వెంకటతేజ, సెకండ్ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) కార్డియాలజిస్ట్ లేదా న్యూరాలజిస్టునవుతా.. మాది తెనాలి. నాకు ఇంటర్ బైపీసీలో 983 మార్కులు వచ్చాయి. వైద్య రంగంలో స్థిరపడాలనేది నా ఆకాంక్ష. ఇప్పటికే నీట్ రాశాను. ఎంబీబీఎస్ చేసి ఆ తర్వాత కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ లేదా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌గా స్థిరపడాలనేదే నా కోరిక. – దుర్గెంపూడి కార్తికేయరెడ్డి, నాలుగో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) వైద్య రంగంలో స్థిరపడతా.. మాది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. నాకు నీట్‌లోనూ మంచి ర్యాంకు వస్తుందనే నమ్మకం ఉంది. వైద్య రంగంలో స్థిరపడాలనేది నా కోరిక. – బోర వరుణ్ చక్రవర్తి, ఐదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) మంచి వైద్య కళాశాలలో మెడిసిన్ చేస్తా.. మాది నెల్లూరు. అమ్మానాన్న హారతి, శంకర్ వైద్యులుగా పనిచేస్తున్నారు. మంచి మెడికల్ కళాశాలలో మెడిసిన్ చదవడమే నా లక్ష్యం. – హర్షల్సాయి, ఏడో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) కష్టపడి చదివా.. మాది గుంటూరులోని ఏటీ అగ్రహారం. అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. కష్టపడి చదవడంతో తెలంగాణ ఎంసెట్‌లో ఎనిమిదో ర్యాంక్ సాధించాను. – సాయి చిది్వలాస్రెడ్డి, 8వ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) కంప్యూటర్స్ సైన్స్ చదువుతా.. మాది గుంటూరు. నాన్న శ్రీనివాసరెడ్డి రైతు. ఇంటర్ ఎంపీసీలో 971 మార్కులు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌లో ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబేలో సీటు సాధించడమే లక్ష్యం. – యక్కంటి ఫణి వెంకట మణిందర్‌రెడ్డి, సెకండ్ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించడమే లక్ష్యం మాది ఎన్టీఆర్ జిల్లా నందిగామ. ఇంటర్మిడియెట్ ఎంపీసీలో 983 మార్కులు సాధించాను. ఇటీవల జేఈఈ మెయిన్‌లో ఓపెన్ కేటగిరీలో 263వ ర్యాంక్ వచ్చింది. వచ్చే నెలలో జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నా. ఇందులో మంచి ర్యాంక్ సాధించడమే నా లక్ష్యం. – చల్లా ఉమేష్ వరుణ్, థర్డ్ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) సివిల్స్ సాధించి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం మాది అనంతపురం జిల్లా తాడిపత్రి. ఇటీవల జేఈఈ మెయిన్‌లో ఆలిండియాలో 97వ ర్యాంకు సాధించాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో చేరతా. తర్వాత సివిల్స్ రాసి ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. – పొన్నతోట ప్రమోద్ కుమార్‌రెడ్డి, ఐదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) ఐఐటీ బాంబేలో చేరతా.. మాది విశాఖపట్నం జిల్లా గాజువాక. నాన్న బిజినెస్‌లో ఉండగా అమ్మ ఫార్మసిస్టుగా పనిచేస్తున్నారు. ఇంటర్ ఎంపీసీలో 987 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో ఆలిండియాలో 110వ ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ మంచి ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. – మరడాన ధీరజ్ కుమార్, ఆరో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చదువుతా.. మాది శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి. నాన్న గణేష్ వ్యాపారి, అమ్మ జ్యోతి గృహిణి. జేఈఈ మెయిన్‌లో 729వ ర్యాంక్ సాధించాను. వచ్చే నెలలో నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నా. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్‌లో చేరాలనేదే నా లక్ష్యం. – బోయిన సంజన, 8వ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) కంప్యూటర్ ఇంజనీర్‌నవుతా.. మాది నంద్యాల. ఇంటర్ ఎంపీసీలో 956 మార్కులు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌లో ర్యాంకు సాధించి మంచి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. కంప్యూటర్ ఇంజనీర్‌ను కావడమే లక్ష్యం. – ప్రిన్స్ బ్రన్హంరెడ్డి, తొమ్మిదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) అడ్వాన్స్‌లోనూ ర్యాంక్ సాధిస్తా.. మాది విజయనగరం జిల్లా గుర్ల. నాన్న అప్పలనాయుడు రైల్వే కానిస్టేబుల్, అమ్మ ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల జేఈఈ మెయిన్‌లో 99 శాతం పర్సంటైల్ సాధించాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబేలో చేరతా. – మీసాల ప్రణతి శ్రీజ, పదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) -
బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థిని వినూత్న ఆలోచన
సాక్షి, మంచిర్యాల: రైతులకు లాభం చేకూర్చేవిధంగా తక్కువ ఖర్చుతో కలుపు తీసే యంత్రాన్ని బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని శర్వాని తయారు చేసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీ కాలనీలో నివాసం ఉంటున్న కాసం శర్వాని మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో గల శ్రీ సంతు శంకర్ మహారాజ్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్లో బీఎస్సీ అగ్రికల్చర్ నాలుగో సంవత్సరం చదువుతోంది. లాక్డౌన్ నేపథ్యంలో కళాశాలలు తెరవక పోవడం, ఆమె ప్రాజెక్టులో భాగంగా, రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం చేకూర్చాలని, కళాశాలలో చెప్పిన పాఠ్యాంశాలు, ఆన్లైన్లో కలుపు యంత్రాలను తయారు చేసే విధానం చూసి, అందుబాటులో ఉన్న వాటితో కేవలం రూ. 500లను ఖర్చు చేసి కలుపు యంత్రాన్ని తయారు చేసింది. ఒక పెద్ద ఇనుప రాడ్డు, షార్పుగా ఉన్న మేకులు, పాత సైకిల్ రీమ్‌లను యంత్రంలా వెల్డింగ్‌తో తయారు చేయించింది. డీజిల్, పెట్రోల్ ఉపయోగించకుండానే కలుపును త్వరగా, సులభంగా తీయడం వల్ల, సమయం ఆదా కావడంతో పాటు, రైతులకు కష్టం కలగకుండా ఉండేలా దానిని తయారు చేసింది. ఆమె తయరు చేసిన యంత్రంతో మంచిర్యాలలోని వారి పొలంలోనే కలుపు మొక్కలను విజయవంతంగా తొలగించింది. కలుపు యంత్రం వినియోగం, పూల మొక్కలు, పండ్ల మొక్కలు వృద్ధి కోసం మందార మొక్కల గట్టి చెక్క వినియోగం, కలబంద, కంపోస్టు, కోకోపీట్, ఎర్రమట్టి వినియోగం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించింది. -
నిబంధనలకు విరుద్ధంగా స్టడీ సెంటర్లు
- ‘బీఎస్సీ అగ్రికల్చర్’ కోర్సును నిర్వహిస్తున్న 3 వర్సిటీలు - చర్యలు చేపట్టాలని యూజీసీకి ఉన్నత విద్యామండలి లేఖ సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన 3 వర్సిటీలు రాష్ట్రంలో పలు స్టడీ సెంటర్ల ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సును నిర్వహిస్తున్నాయని, వాటిపై చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి యూజీసీ కి లేఖ రాసింది. బీఎస్సీ అగ్రికల్చర్ వంటి వృత్తి విద్యా కోర్సులను నిర్వహిస్తున్నాయని, వాటిపై కఠిన చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఉత్తరప్రదేశ్, ఆగ్రాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ, ఫిరోజాబాద్‌లోని జేఎస్ వర్సిటీ, రాజస్థాన్‌లోని సింఘానియా వర్సిటీలు రాష్ట్రంలోని 8 స్టడీ సెంటర్ల ద్వారా ఈ కోర్సును నిర్వహిస్తున్నాయని పేర్కొంది. యాప్రాల్‌లోని ట్రినిటీ అగ్రికల్చర్ కాలేజీ, తూముకుంటలోని ట్రినిటీ అగ్రికల్చర్ అకాడమీ, గ్రీన్‌ల్యాండ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, గ్రీన్‌ఫీల్డ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, తెలంగాణ అగ్రికల్చర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, మాగ్జిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, గ్రీన్ప్లాంట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ రీసర్చ్‌లు ఆ కోర్సును నిర్వహిస్తున్నాయని వివరించింది. -
ఈ యూనివర్సిటీలు, కాలేజీలు నకిలీవే
ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలు, రాష్ట్రానికి చెందిన పలు కాలేజీలు తెలంగాణలో స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసి అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు నిర్వహిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని, అవి నకిలీ యూనివర్సిటీలు, కాలేజీలేనని రాష్ర్ట ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. వాటిల్లో చదివి మోసపోవద్దని పేర్కొన్నారు. ఈ కోర్సును నిర్వహించే 3 యూనివర్సిటీలు, 8 కాలేజీలకు, వాటి స్టడీసెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం కాని, వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ గుర్తింపునివ్వలేదని, యూజీసీ కూడా వాటికి గుర్తింపు ఇవ్వలేదని వెల్లడించారు. యూనివర్సిటీలు/ప్రభుత్వం/ యూజీసీ గుర్తింపు లేని కాలేజీల్లో చదివితే నష్టపోవాల్సి వస్తుందని సూచించారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, ఇతర వివరాలను యూజీసీ వెబ్సైట్లో (ugc.ac.in) పొందవచ్చని వివరించారు. ఇవీ నకిలీ యూనివర్సిటీలు, కాలేజీలు ⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, ఆగ్రా, ఉత్తరప్రదేశ్ ⇒ సంఘానియా యూనివర్సిటీ, ఝుంఝును రాజస్తాన్ ⇒ జేఎస్ యూనివర్సిటీ, ఫిరోజాబాద్, ఉత్తరప్రదేశ్ ⇒ ట్రినిటీ అగ్రికల్చర్ కాలేజీ, అంబేడ్కర్ విగ్రహం ఎదురుగా యాప్రాల్, హైదరాబాద్ ⇒ ట్రినిటీ అగ్రికల్చర్ అకాడమీ, తూముకుంట, సమ్మర్ గ్రీన్ రిసార్ట్స్ ఎదురుగా, శామీర్‌పేట్, రంగారెడ్డి ⇒ గ్రీన్లాండ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, సుందర్‌నగర్ కాలనీ, మెయిన్‌రోడ్ సంజీవరెడ్డి నగర్, హైదరాబాద్ ⇒ గ్రీన్‌ఫీల్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ , సాయినగర్ రోడ్, రాజధాని హోటల్ లేన్ ఎదురుగా, హైదరాబాద్ ⇒ తెలంగాణ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్ట్రీట్ నెంబర్-2 బిగ్ బజార్ దగ్గర తార్నాక, హైదరాబాద్ ⇒ మాగ్జిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, నంజిని ఎన్క్లేవ్, ప్రశాంత్‌నగర్, ఉప్పల్ పోలీసుస్టేషన్ పక్కన, ఉప్పల్ ⇒ గ్రీన్ ప్లాంట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, వివేకానందనగర్, కెనరా బ్యాంకు ఎదురుగా, కూకట్పల్లి, హైదరాబాద్ ⇒ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్, హిల్ కాలనీ, రిలయన్స్ డిజిటల్ ఎదురుగా వనస్థలిపురం, హైదరాబాద్ -
ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అర్హులే
సాక్షి, హైదరాబాద్: వ్యవ సాయ శాఖలో ఖాళీగా ఉన్న 1000 గ్రేడ్-2 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అర్హులేనని టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ అగ్రికల్చర్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పోస్టుల కోసం ఈనెల 19వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ మినహాయింపు ఇచ్చినందున వారు దరఖాస్తు చేసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను తమ వెబ్సైట్లో (www.tspsc.gov.in) పొందవచ్చని వివరించారు. -
చల్లగ ఉన్నడనుకున్నం
► ఇప్పుడిలా దూరమయ్యిండు ► ఎన్కౌంటర్లో మృతి చెందిన రమేష్ ► మాతృమూర్తుల ఆవేదన ► మృతి వార్త విని ఉలిక్కిపడిన అందుకూరు ‘వాడు అన్నింటిలో పొష్టే, వాడు చాలా తెలివైనోడు, యూడికిపోయూడో..ఎటు పోయూడో తెలియదు.. 20 ఏళ్ల తర్వాత పోలీసోళ్లొచ్చి.. చచ్చిపోయూడని చెబితే గుండె పగిలిపోరుుంది..వాడెక్కడున్నా చల్లగ ఉంటడనుకున్నం..ఇప్పుడిలా దూరమైపోయుండ‘య్యూ అంటూ గొట్టిముక్కల రమేష్(48) కన్నతల్లి, పెంచిన తల్లి ఉబికివస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ..కొడుకు మిగిల్చిన జ్ఞాపకాలను తలుచుకుంటూ ఘెుల్లుమన్నారు. క్రోసూరు: ఛత్తీస్‌ఘడ్ అడవుల్లో మంగళవారం వేకువజామున జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన గొట్టిముక్కల రమేష్ స్వగ్రామం గుంటూరు జిల్లా క్రోసూరు మండలం అందుకూరు. రమేష్ కన్నతల్లి అనసూర్యమ్మ, తండ్రి వీరబ్రహ్మాచారి. వీరి ఐదురుగు సంతానంలో రమేష్ చివరి వాడు. అనసూర్యమ్మ అక్క గొట్టిముక్కల మాణిక్యమ్మ, జానకిమయ్యలకు సంతానం లేకపోవడంతో రమేష్‌ను పెంచుకున్నారు. ఇతను అందుకూరులోనే ఉంటూ క్రోసూరు జెడ్పీ పాఠశాల్లో పది, అమరావతిలో ఇంటర్మీడియెట్ పూర్తి చేశాడు. బీఎస్సీ అగ్రికల్చర్ చదివేందుకు హైదరాబాద్‌లోని ఆచార్య రంగా యూనివర్సిటీలో చేరాడు. రెండేళ్లు చదివాక..అందుకూరుకు చెందిన ఒక వ్యక్తి తన పిల్లలకు ట్యూషన్లు చెప్పాలని గుంటూరు తీసుకెళ్లాడు. అప్పటి నుంచి ఇంటికి రావడం మానేశాడు. ఎక్కడున్నాడో కూడా తల్లిదండ్రులకు ఆచూకీ తెలియలేదు. అప్పటి నుంచి బిడ్డ కోసం వేచి చూస్తూనే ఉన్నారు. అనసూయమ్మ, మాణిక్యమ్మల భర్తలు చనిపోవడంతో ఇద్దరూ ఒకే ఇంటిలో కాలం వెళ్లదీస్తున్నారు..ఇప్పుడు బిడ్డ కడసారి చూపు కోసం.. రోదన నిండిన గుండెలతో..ఆశలు నిండిన కళ్లతో ఎదురుచూస్తున్నారు ఈ మాతృమూర్తులు. -
మా గురించి ‘పట్టు’ంచుకోండి
విజయనగరం కంటోన్మెంట్: ప్రభుత్వం త్వరలో నియమించనున్న ఎంపీఈఓల నియామకాల్లో తమకు ప్రాధాన్యమివ్వాలని పట్టుపరిశ్రమ శాఖ కోర్సు చదివి నిరు ద్యోగులుగా ఉన్న అభ్యర్థులు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళినిని కోరారు. మంగళవారం వారంతా ఏపీ మహిళా సమాఖ్య పట్టణ కార్యదర్శి ఎల్ పుణ్యవతి ఆధ్వర్యంలో మంత్రిని కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదర్శ రైతులను తొలగించి కొత్తగా ఎంపీఈఓలను నియమిం చనున్న నేపథ్యంలో తమకు అవకాశం కల్పించాలని కోరారు. తమకు వయసు మీరిపోతున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. గతంలో ఈ శాఖ కోర్సు చదువుకున్న వారిని ఇంటర్వ్యూలకు పిలిచి రద్దు చేశారని, తరువాత ఇంటర్వ్యూలకు పిలవలేదన్నారు. అప్పటినుంచి తాము నిరుద్యోగులుగా ఉంటున్నామని వాపోయారు. బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వారిని అర్హులుగా ప్రకటించినప్పటికీ జిల్లాలో తక్కువ మంది ఉన్న తమకు ఎంపీఈఓలుగా అవకాశం కల్పించాలన్నారు. దీనికి మంత్రి స్పందించి తప్పకుండా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెడతానని హామీ ఇచ్చారు. అంతే కాకుండా కలెక్టర్ ఎంఎం నాయక్‌ను పిలిపించి వీరి గురించి ఒకసారి పరిశీలించాలని సూచించారు. అభ్యర్థులు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తానని తెలిపారు. వినతిపత్రాన్ని అందించిన వారిలో కె గౌరునాయుడు, జి స్వామినాయుడు, ఎస్ పరమేశు, ఎంపి నాయుడు, ఎం శ్రీనివాసరావు తదితరులున్నారు.