ప్రభుత్వం త్వరలో నియమించనున్న ఎంపీఈఓల నియామకాల్లో తమకు ప్రాధాన్యమివ్వాలని పట్టుపరిశ్రమ శాఖ కోర్సు చదివి నిరు ద్యోగులుగా
విజయనగరం కంటోన్మెంట్: ప్రభుత్వం త్వరలో నియమించనున్న ఎంపీఈఓల నియామకాల్లో తమకు ప్రాధాన్యమివ్వాలని పట్టుపరిశ్రమ శాఖ కోర్సు చదివి నిరు ద్యోగులుగా ఉన్న అభ్యర్థులు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళినిని కోరారు. మంగళవారం వారంతా ఏపీ మహిళా సమాఖ్య పట్టణ కార్యదర్శి ఎల్ పుణ్యవతి ఆధ్వర్యంలో మంత్రిని కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదర్శ రైతులను తొలగించి కొత్తగా ఎంపీఈఓలను నియమిం చనున్న నేపథ్యంలో తమకు అవకాశం కల్పించాలని కోరారు. తమకు వయసు మీరిపోతున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు.
గతంలో ఈ శాఖ కోర్సు చదువుకున్న వారిని ఇంటర్వ్యూలకు పిలిచి రద్దు చేశారని, తరువాత ఇంటర్వ్యూలకు పిలవలేదన్నారు. అప్పటినుంచి తాము నిరుద్యోగులుగా ఉంటున్నామని వాపోయారు. బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వారిని అర్హులుగా ప్రకటించినప్పటికీ జిల్లాలో తక్కువ మంది ఉన్న తమకు ఎంపీఈఓలుగా అవకాశం కల్పించాలన్నారు. దీనికి మంత్రి స్పందించి తప్పకుండా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెడతానని హామీ ఇచ్చారు. అంతే కాకుండా కలెక్టర్ ఎంఎం నాయక్‌ను పిలిపించి వీరి గురించి ఒకసారి పరిశీలించాలని సూచించారు. అభ్యర్థులు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తానని తెలిపారు. వినతిపత్రాన్ని అందించిన వారిలో కె గౌరునాయుడు, జి స్వామినాయుడు, ఎస్ పరమేశు, ఎంపి నాయుడు, ఎం శ్రీనివాసరావు తదితరులున్నారు.