రాజ్‌భవన్ ప్రైవేట్ ఆస్తి కాదు
సాక్షి, బెంగళూరు : ‘రాజ్‌భవన్ ప్రైవేట్ వ్యక్తుల ఆస్తేమీ కాదు. ప్రభుత్వ పనితీరు సరిగా లేకపోయినా, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా మేం చూస్తూ ఊరుకోము. గవర్నర్‌కు ఫిర్యాదు చేసి తీరతాం’ అని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప పేర్కొన్నారు. బీజేపీ నేతలకు తన వద్దకు వచ్చి మాట్లాడే ధైర్యం లేదంటూ గవర్నర్ హంసరాజ్ భరద్వాజ్ వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పు పట్టారు.
తుమకూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రభుత్వ పనితీరుగాడితప్పిన సందర్భాల్లో గవర్నర్‌కు కాక మరెవరికి ఫిర్యాదు చేస్తామంటూ అసహనం వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ పనితీరుపై గవర్నర్ భరద్వాజ్ ప్రశంసలు కురిపించారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినందువల్ల ఆ పార్టీ అగ్ర నేతల మెప్పు పొందేందుకు తమను తక్కువ చేసి మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటిగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ వెళుతోందని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తం కాగానే ఆ నిర్ణయాన్ని, పథకాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించేస్తోందని అన్నారు. అందుకే ప్రభుత్వ విధానాలపై సమీక్ష జరపాల్సిందిగా కోరుతూ గవర్నర్‌ను కలవనున్నామని తెలిపారు. అయితే ఎప్పుడు గవర్నర్‌ను కలుస్తారంటూ విలేకరులు ప్రశ్నించగా... పార్టీ సీనియర్ నేతలందరితో చర్చించి తేదీని ఖరారు చేస్తామని చెప్పారు.