బీటెక్ విద్యార్థి బలవన్మరణం
ఆంగ్ల మాధ్యమం చదవలేక అఘాయిత్యం
ముస్తాబాద్(కరీంనగర్): ఇంగ్లిష్ మీడియం చదువు ఆ విద్యార్థిపాలిట శాపమైంది. తల్లిదండ్రుల కోరిక కాదనలేక.. ఇటు చదవలేక తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైనా ఓ బీటెక్ విద్యార్థి చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కళాశాలలో ఇమడలేక అందులో చేరిన నాలుగు రోజులకే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఎస్సై ప్రవీణ్, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ముస్తాబాద్‌కు చెందిన సూర నరేశ్(18) శుక్రవారం ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించగా అప్పటికే నరేశ్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. సూర కనుకవ్వ, సాయిలు దంపతులకు ఇద్దరు కుమారులు రాజశేఖర్, నరేశ్. రాజశేఖర్ ఉపాధి నిమిత్తం దుబాయ్‌కు వెళ్లొచ్చాడు. చిన్న కుమారుడు నరేశ్‌ను ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులు భావించారు. గత నెల 27న హైదరాబాద్‌లోని సెయింట్ మేరీ ఇంజనీరింగ్ కళాశాలలో చేర్పించారు. అక్కడే ఓ హాస్టల్‌ను ఉంచారు.
క్లాసులు అర్థం కావడంలేదురా..
నరేశ్ హైదరాబాద్‌లో హాస్టల్లో ఉండగా.. అక్కడ తనకు ఇంగ్లిష్‌లో చెప్పే పాఠాలు అర్థం కావడం లేదని, జైలులో ఉన్నట్లు అనిపిస్తోంది అని తన స్నేహితులకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. కాలేజీకి వెళ్లబుద్ధికావడం పేర్కొన్నాడు. వినాయక చవితి పండుగ కోసమని సెలవు పెట్టి గురువారం స్వగ్రామానికి వచ్చాడు. రాత్రి బాగానే ఉన్న నరేశ్‌ను కాలేజీలో ఎలా ఉందని తల్లి కనుకవ్వ వాకబు చేసింది. అంతా బాగుందని నరేశ్ చెప్పాడు. శుక్రవారం ఉదయం పనులపై తల్లిదండ్రులు, సోదరుడు బయటకు వెళ్లారు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న నరేశ్ ఉరేసుకున్నాడు. తమ ఇంట్లో ఎవరూ చదవలేదని, బాగా చదివి ప్రయోజకుడవుతాడని తమ కొడుకును హైదరాబాద్‌లో బీటెక్‌లో చేర్పించామని, కొడుకు మనసు అర్థం చేసుకోలేక పోయామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, నరేశ్ కాలేజీకి కూడా ఒక్క రోజే వెళ్లాడని, హాస్టల్లో తనతోపాటు ఉంటున్న నలుగురు స్నేహితులు పేర్కొన్నారు. తనకు క్లాసులు అర్థం కావడం లేదని చెప్పాడని, ఇంతలో ఆత్మహత్య చేసుకోవడం బాధగా ఉందన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.