ఆంధ్రా బౌద్ధ శిల్పాలకు అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, అమరావతి: ప్రాచీన కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు నెలవైన ఆంధ్రప్రదేశ్‌కు మరో అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. రాష్ట్రానికి చెందిన ఆరు బౌద్ధ శిల్పాలు అమెరికా, దక్షిణ కొరియాల్లో అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికయ్యాయి. ఇందులో భాగంగా క్రీ.పూ. 200 ఏళ్ల నుంచి క్రీ.శ. 400 ఏళ్ల మధ్య కాలం నాటి రాష్ట్ర ప్రాచీన శిల్ప కళాసంపద ఖండాంతర ప్రజలకు కనువిందు చేయనుంది.
ఈ మేరకు న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్.. ‘టీ అండ్ సర్పెంట్: ది ఎవల్యూషన్’ అనే పేరుతో అంతర్జాతీయ ప్రదర్శనను నిర్వహించనుంది. ఇందులో భాగంగా భారతదేశంలో బౌద్ధానికి పూర్వం నాటి సంస్కృతిని చాటే శిల్పాలు, బౌద్ధం తొలినాళ్లలోని అలంకారిక కళలు, చిత్రాలను ప్రపంచానికి పరిచయం చేయనుంది. ఈ క్రమంలో మన దేశం నుంచి సున్నపురాయి, బంగారం, వెండి, కాంస్యం, రాక్ క్రిస్టల్, ఐవరీ వంటి 140 రకాల శిల్పాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించనున్నారు.
అంతర్జాతీయంగా రెండు వేదికలపై..
భారతీయ బౌద్ధ శిల్పకళా రూపాల ప్రదర్శనను ముందు అమెరికాలోని న్యూయార్క్‌లో మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో జూలై 17 నుంచి నవంబర్ 13 వరకు నిర్వహించనున్నారు. ఈ మ్యూజియాన్ని ‘ది మెట్’ అని పిలుస్తారు. ఇది అమెరికాలో అతిపెద్ద ఆర్ట్ మ్యూజియం. 2022లో 32,08,832 మంది దీన్ని సందర్శించారు. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే ఆర్ట్ మ్యూజియంల జాబితాలో ఇది ఎనిమిదో స్థానంలో ఉంది. యూఎస్‌లో అయితే రెండో స్థానంలో నిలుస్తోంది.
అమెరికాలో ప్రదర్శన ముగిశాక తర్వాత దక్షిణ కొరియాలో నేషనల్ మ్యూజియం ఆఫ్ కొరియాలో డిసెంబర్ 22 నుంచి 2024 ఏప్రిల్ 14 వరకు శిల్పాలను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం మెట్రోపాలిటన్ మ్యూజియం ‘స్టార్ వరల్డ్ వైడ్’ సంస్థకు పురాతన కళా రూపాలను తరలించే బాధ్యతను అప్పగించింది. దీనికి మనదేశంలో నేషనల్ మ్యూజియం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది.
ఏపీ విగ్రహాల్లో విశిష్టతలు
తొలి బౌద్ధ కళల్లో అలంకరణ ముఖ్యంగా కనిపిస్తోంది. అందమైన పువ్వులు, తీగల అల్లికలు, పూర్ణకుంభం, విజ్ఞాన, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా కొలిచే గుర్రం వంటి చిత్రాలు వంటివి శిల్పాల్లో ఉన్నాయి. ముఖ్యంగా శిల్పాలపై చెక్కిన ఆరాధకుల ముఖకవళికల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. మహాపురుషుని రూపం, యక్షుల చిత్రాలు, బౌద్ధంలోని వివిధ సంఘటనలను తెలిపే స్థూపం, ఒకే శిలపై సింహం తల, మొసలి, చేప, ఏనుగు తొండం రూపంలోని వాహనంపై సవారీని ప్రతిబింబించే దృశ్యాలున్నాయి.
రాష్ట్రం నుంచి ఆరు విగ్రహాలు
అంతర్జాతీయ ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ నుంచి వేల సంవత్సరాల క్రితం నాటి ఆరు తెల్లటి పాలరాతి విగ్రహాలను ఎంపిక చేశారు. ఇందులో ఐదింటిని అమరావతి హెరిటేజ్ మ్యూజియం నుంచి, ఒకదాన్ని గుంటూరులోని బౌద్ధశ్రీ పురావస్తు మ్యూజియం నుంచి తరలించనున్నారు. ఇందుకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనుమతులు సైతం మంజూరు చేసింది.
మన రాష్ట్రంలో అమరావతి ప్రాంతానికి అంతర్జాతీయ బుద్ధిజం కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. బుద్ధుడు తన శిష్యులకు ఇక్కడే 10 ధరణిలు (మంత్రాలు) బోధించారని.. అందుకే అమరావతి ప్రాంతం ధరణికోటగా పేరొందినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. కాలచక్ర యానం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైందని బౌద్ధులు దృఢంగా విశ్వసిస్తున్నారు. కాగా ప్రదర్శనకు తెలంగాణ నుంచి తొమ్మిది శిల్పాలను ఎంపిక చేశారు.
గొప్ప కళా సంపదకు నిలయం..
బుద్ధుడి ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా ఉన్నాయి. అమరావతి, నాగార్జునకొండ ప్రాంతాలు గొప్ప శిల్ప కళా సంపదను నిక్షిప్తం చేసుకున్నాయి. ఇలాంటి ఎన్నో గొప్ప, అరుదైన శిల్పాలను ఏపీ మ్యూజియాల్లో భద్రపరిచాం. వీటిని అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేయడం ఎంతో గర్వకారణం. – జి.వాణీమోహన్, కమిషనర్, ఏపీ పురావస్తు, ప్రదర్శనశాలలు