బుద్ధుని అవశేషాలపై ఏం చేస్తారు: విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: ప్రకాశం జిల్లా వెనంపల్లిలో ఇటీవల బయటపడ్డ పురాతన బుద్ధుని అవశేషాల ప్రాముఖ్యతపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. రాష్ట్రంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఒకటి, రెండో శతాబ్దానికి చెందిన బుద్ధుని అవశేషాలు కోసం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) వారు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని విజయసాయిరెడ్డి కోరారు. ప్రకాశం జిల్లా వెనంపల్లిలో రెండు బుద్దుని విగ్రహాలు లభించాయని, ఈ ప్రాంతం చంద్రవరం బుద్దిస్ట్ ప్రాంతంలో ఉందని సాంస్కృతిక, పర్యాటకశాఖ సహాయమంత్రి మహేశ్ చంద్ర రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. గతంలోనూ ఏఎస్ఐ వారు ఎన్నో సర్వేలు చేసి తవ్వకాలు జరిపి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అవశేషాలు వెలికితీశారని.. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు.
గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ ఆలయం నుంచి పురాతన నంది విగ్రహం చోరీ అయిందని, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఇప్పటివరకూ ఏమైనా చర్యలు తీసుకుంటే ఆ వివరాలు తెలపాలని కోరారు. చోరికి గురైన నంది విగ్రహం గురించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) వారికి ఎలాంటి రిపోర్ట్ రాలేదన్నారు. విగ్రహం చోరీపై ఏదైనా సమాచారం అందితే యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజరీస్ యాక్ట్-1972 ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి మహేశ్ చంద్ర సమాధానమిచ్చారు.