budget 2018-19
-
రాష్ట్ర బడ్జెట్‌పై కోటి ఆశల ‘గ్రేటర్’
అసెంబ్లీలో ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టనున్న (2018–19) రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై ‘గ్రేటర్’ ఎన్నో ఆశలు పెట్టుకుంది. నగరాభివృద్ధికి ఈ బడ్జెట్లో ఎంతమేరకు నిధులు కేటాయిస్తారోనని వివిధ శాఖలు ఎదురు చూస్తున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సైతం ప్రభుత్వానికి నివేదించారు. భారీ లక్ష్యాలు విధించుకున్న జీహెచ్ఎంసీ ఈసారి బడ్జెట్లో రూ.1669 కోట్లు కేటాయించాలని కోరింది. ఇక నగరంలో నిరంతరం నీటిని సరఫరా చేసేందుకు జలమండలి భారీ ప్రణాళికలు రూపొందించింది. వీటి అమలుకు బడ్జెట్లో రూ.2915 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సాక్షి, సిటీబ్యూరో: రానున్న ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయించనున్నదనేది ఆసక్తికరంగా మారింది. ఎస్సార్డీపీ(వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా చేపట్టిన ఫ్లై ఓవర్లు తదితర పనులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లేనప్పటికీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రహదారుల అభివృద్ధి తదితర పనులపై మాత్రం అధికారులు ఆశలు పెట్టుకున్నారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రేటర్లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీపై ఎలాంటి ఆర్థికభారం మోపబోమని మునిసిపల్ మంత్రి ప్రకటించడంతో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన దాదాప రూ.1500 కోట్లు ప్రభుత్వం కేటాయించనుందనే ఆశలున్నాయి. ఎస్సార్డీ పనులతో పాటు ఇతరత్రా పనుల కోసం మొత్తం రూ.3500 కోట్లు బాండ్లు, రుణాలుగా తీసుకునేందుకు సిద్ధమైన జీహెచ్ఎంసీ ఇప్పటికే బాండ్ల ద్వారా రూ.200 కోట్లు సేకరించింది. రహదారుల అభివృద్ధి పనులు, వరదకాలువల పనులతోపాటు ఆయా అంశాల్లో జీహెచ్ఎంసీకి రావాల్సిన వాటా నిధులపైనే ఆశలున్నాయి. ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలిలా ఉన్నాయి. సాక్షి, సిటీబ్యూరో: నేడు ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2018–19 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై జలమండలి కోటి ఆశలు పెట్టుకుంది. ఈ సారైనా సర్కారు వాటర్‌బోర్డుకు నిధుల వరదపారిస్తే కీలక మంచినీరు, మురుగునీటి పథకాలను సాకారం చేయాలని సంకల్పించింది.ఈసారి రూ.2915 కోట్ల భారీ అంచనాలతో బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధంచేసి ఆర్థిక శాఖకు సమర్పించింది. గతేడాది వార్షిక బడ్జెట్లో పేరుకు రూ.1450 కోట్లు కేటాయించినప్పటికీ.. విడతలవారీగా విదిల్చింది కేవలం రూ.1050 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. కాగా రూకల్లోతు ఆర్థిక నష్టాల్లో ఉన్న బోర్డుకు ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు వివిధ ఆర్థిక సంస్థల నుంచి సేకరించిన రూ.5200 కోట్ల రుణాలు భారంగా పరిణమించాయి. మరోవైపు ప్రతీనెలా రూ.95 కోట్ల రెవెన్యూ ఆదాయం ఆర్జిస్తున్నప్పటికీ..విద్యుత్‌బిల్లులు, ఉద్యోగుల జీత,భత్యాలు, నిర్వహణ వ్యయాలు వెరసి ప్రతీనెలా ఖర్చు రూ.130 కోట్లుగా ఉంది. దీంతో ప్రతీనెలా రూ.35 కోట్ల లోటుతో బోర్డు నెట్టుకొస్తుంది. కాగా మరో వందేళ్లపాటు గ్రేటర్ తాగునీటి అవసరాలకు ఢోకా లేకుండా చూసేందుకు ప్రభుత్వం శామీర్పేట్మండలం కేశవాపూర్‌లో 10 టీఎంసీల గోదావరి జలాల నిల్వ సామర్థ్యంతో భారీ స్టోరేజి రిజర్వాయర్‌ను నిర్మించాలని తలపెట్టింది. ఈప్రాజెక్టుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. యాన్యుటీ విధానంలో పనులు దక్కిన సంస్థ ఈ ప్రాజెక్టు నిర్మాణానికయ్యే రూ.4300 కోట్ల వ్యయాన్ని భరించనుంది. అయితే భూసేకరణ,పరిహారం చెల్లింపు ఇతర వసతుల కల్పనకు రూ.700 కోట్ల నిధులు కేటాయించాలని కోరుతూ జలమండలి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రూ.103 కోట్లు కేటాయించండి: టూరిజం శాఖ సాక్షి, సిటీబ్యూరో: బడ్జెట్లో సాంస్కృతిక – టూరిజం శాఖలకు కేటాయింపులు చాలా తక్కువగా ఉంటున్నాయి. గత మూడేళ్లుగా బడ్జెట్ నిధుల విషయంలో ఈ శాఖకు నిరాశే మిగులుతోంది. గతేడాది కేవలం రూ.46 కోట్లు కేటాయించారు. ఈసారైన బడ్జెట్లో రూ.103 కోట్లు కేటాయించాలని భాషా సాంస్కృతిక శాఖ ప్రతిపాదనలు పంపింది. టూరిజం శాఖ బడ్జెట్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. దాదాపు రూ.8 కోట్లు టూరిజం బడ్జెట్ ఎంతమాత్రం సరిపోవటం లేదు. ఈసారి రూ. 63 కోట్లు ప్రభుత్వం కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. -
బంద్ సంపూర్ణం
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ వామపక్షాల పిలుపు మేరకు గురువారం చేపట్టిన రాష్ట్ర బంద్ సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. టీడీపీ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా, అవాంతరాలు సృష్టించినా జనం ఖాతరు చేయకుండా రాష్ట్రానికి న్యాయం చేయాలని నినదించారు. బంద్‌కు మద్దతు పలికిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, లోక్‌సత్తా, జనసేన, కార్మిక, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు నిరసన గళాలు వినిపించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును దుయ్యబట్టాయి. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాటం విశ్రమించబోమని ప్రకటించాయి. అత్యవసర సేవలు మినహా బంద్‌తో రవాణా స్తంభించింది. సుమారు 13 వేల బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. విద్యా, వాణిజ్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఇంటర్ ప్రాక్టికల్స్‌ను, యూనివర్సిటీలు పరీక్షలను వాయిదా వేశాయి. సినిమా థియేటర్లలో ఉదయం, మధ్యాహ్నం ఆటలు రద్దయ్యాయి. పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. రహదారులు జనం లేక బోసిపోయాయి. కిటకిటలాడే హోటళ్లలో నిశ్శబ్దం తాండవించింది. బంద్‌కు ససేమిరా సహకరించేది లేదన్న అధికార తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజాభీష్టానికి తలొగ్గారు. ర్యాలీలు నిర్వహించండని దుబాయి నుంచి తమ పార్టీ కార్యకర్తలకు పిలుపిచ్చారు. ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నట్టు ప్రకటించి ధర్మాగ్రహానికి తలొంచారు. శాంతియుత బంద్‌కు సహకరించాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తెల్లవారుజాము నుంచే బైఠాయింపులు వామపక్షాల కార్యకర్తలు, వైఎస్సార్సీపీ నేతలు తెల్లవారు జాము నుంచే బస్ డిపోల ఎదుట ఆందోళన ప్రారంభించారు. బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా గేట్ల ముందు బైఠాయించారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ ఎదుట సీపీఐ, సీపీఎం కార్యకర్తలు గేట్లకు అడ్డంగా నిలబడి బస్సులను కదలనీయలేదు. 144వ సెక్షన్ అమల్లో ఉన్నా ఉద్యమ కారులు ఖాతరు చేయలేదు. కార్మిక సంఘాలు మద్దతు పలకడంతో ఆటోలు, రిక్షాలు సైతం రోడ్లపై తిరగలేదు. ద్విచక్ర వాహనాల రాకపోకలు సైతం గణనీయంగా తగ్గాయి. వామపక్షాల ముందస్తు హెచ్చరికతో ప్రయాణీకులు సైతం ప్రయాణాలకు దూరంగా ఉన్నారు. దూర ప్రాంతాల నుంచే వచ్చే బస్సులను గమ్యస్థానాలు చేరేందుకు అనుమతించారు. కొన్ని జాతీయ రహదారులపై లారీలు బారులు తీరి నిలిచాయి. హోరెత్తిన నిరసనలు.. బంద్ సందర్భంగా ఆందోళనకారులు రాష్ట్రంలో వినూత్న ప్రదర్శనలు, నిరసనలు చేపట్టారు. రోడ్లపై కబడ్డీ ఆడిన వారు కొందరైతే.. కర్రా బిళ్లా, క్రికెట్ ఆడిన వారు మరికొందరు. ఇంకొందరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేయాల్సిందంతా చేస్తుందన్న హామీని ఎగతాళి చేస్తూ చెవుల్లో గులాబీ పూలు, చేతుల్లో క్యాబేజీ, కాలిఫ్లవర్‌తో వినూత్న నిరసనలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. విజయవాడలో కొందరు యువతీ యువకులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలుపగా కర్నూలులో బంగి అనంతయ్య తదితరులు భిక్షాటన చేశారు. ఏలూరు, తిరుపతిలో అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. విశాఖలో న్యాయవాదులు మూతికి నల్లగుడ్డలు కట్టుకుని నిరసన తెలిపారు. విశాఖకు రైల్వే జోన్ ఎక్కడని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన నరేంద్ర మోదీ డౌన్ డౌన్, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, బాబు, మోదీ జోడితో అన్యాయం అంటూ నినాదాలు చేశారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటూ వైఎస్సార్సీపీ, వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. విజయవాడలో వైఎస్సార్ సీపీ నాయకుడు పార్థసారధి, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు తదితర వైఎస్సార్సీపీ నేతల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బంద్‌లో పాల్గొని నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లో రాస్తారోకోలో సిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బైక్ ర్యాలీని నిర్వహించారు. విజయనగరం జిల్లా సాలూరులో ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, కురుపాంలో ఎమ్మెల్యే పాముల పుష్ఫశ్రీవాణి పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విరుచుకుపడ్డారు. కదంతొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు కడపలో వామపక్ష, అఖిలపక్ష నేతలతోపాటు వైఎస్సార్సీపీ శ్రేణులు కదంతొక్కాయి. పులివెందులలో వైఎస్సార్సీపీ జిల్లా సమన్వయకర్త వైఎస్ వివేకానందరెడ్డి, పార్టీ నేత వైఎస్ భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి పూల అంగళ్ల వద్ద నిరసన చేపట్టారు. కడప పార్లమెంటరీ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు, రాజంపేట పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డిల ఆ«ధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, రైల్వేకోడూరులో కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో, బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్లలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సారథ్యంలో ఆందోళనలు కొనసాగాయి. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో కల్లూరు పరిధిలోని నంద్యాల చెక్ పోస్టు నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ఆలూరులో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య, పత్తికొండలో సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, ఎమ్మిగనూరులో సమన్వయకర్త ఎర్రకోట జగన్మోహన్రెడ్డి పాల్గొని బంద్‌కు మద్దతు ప్రకటించారు. గుంటూరు జిల్లాలో గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్లమెంటు ఇన్చార్జి శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్య, ఆతుకూరి ఆంజనేయులు బస్టాండ్ ఎదుట బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. గుంటూరులో ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, లేళ్ల అప్పిరెడ్డి, నరసరావుపేటలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బంద్ నిర్వహించారు. విశాఖలో మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు, చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీలు బైటాయించి రాస్తారోకో చేశారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి బంద్‌లో పాల్గొన్నారు. తిరుపతిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. మూతపడిన సంక్షేమ శాఖలు.. రాష్ట్ర బంద్ సందర్భంగా రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లోని సంక్షేమ శాఖలు మూతపడ్డాయి. బంద్ నిర్వాహకులు సంక్షేమ శాఖల కార్యాలయాల వద్దకు వెళ్లి ఉద్యోగులను బయటకు వెళ్లాల్సిందిగా కోరారు. సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ రామారావుతో సహా ఉద్యోగులందరూ బయటకు వెళ్లారు. మైనార్టీ సంక్షేమ శాఖ, క్రిష్టియన్ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కార్యాలయం, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలు మూతపడ్డాయి. కార్యాలయాలు ఉదయం ప్రారంభమైనా ఆందోళన కారులు అక్కడికి వెళ్లగానే తాళాలు వేసి బయటకు వచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, బడ్జెట్లో నిధులు కేటాయించాలనే డిమాండ్లకు ఉద్యోగులు మద్దతు పలికారు. కొన్ని ఉద్యోగ సంఘాలు బహిరంగంగానే మద్దతు నిచ్చాయి. చాలా ప్రాంతాల్లో జర్నలిస్టులు బంద్‌కు మద్దతు పలుకుతూ ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి నేతృత్వంలో కేవీపీఎస్, తుడుందెబ్బ కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. గృహ నిర్బంధాలు, చిత్రీకరణలు.. బంద్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ కాండను ప్రయోగించింది. పలు చోట్ల వైఎస్సార్సీపీ, వామపక్షాల నాయకుల్ని ముందస్తు అరెస్టులు చేసింది. పలువుర్ని గృహ నిర్బంధంలో ఉంచింది. రాజధాని ప్రాంతమైన అమరావతిలో సెక్షన్ 144ను, విశాఖ, తిరుపతి, అనంతపురం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ తదితర ప్రాంతాలలో సెక్షన్ 30ను విధించింది. ర్యాలీలు జరక్కుండా నిరోధించే ప్రయత్నం చేసింది. బలవంతంగా బస్సులు నడపాలని చూసిన అనంతపురం జిల్లాలో వామపక్షాల కార్యకర్తలు తిరగబడి బస్సు అద్దాలను పగులగొట్టారు. ఏలూరులో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త మధ్యాహ్నపు ఈశ్వరిని, పలువురు వైఎస్సార్సీపీ, సీపీఐ నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. శ్రీకాకుళం జిల్లాలో అరెస్టయిన వారిలో రాజాం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, ఎచ్చెర్ల, టెక్కలి నియోజకవర్గాల సమన్వయకర్తలు గొర్లె కిరణ్‌కుమార్, పేరాడ తిలక్ ఉన్నారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతిలను శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. మరోపక్క పోలీసులు తమ బాడీ కెమెరాలతో ర్యాలీలను చిత్రీకరించారు. ధర్మాగ్రహానికి తలొంచిన ప్రభుత్వం ఆంక్షలు, నిర్బంధాలతో బంద్‌ను ఆపాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ధర్మాగ్రహానికి తలొగ్గాల్సి వచ్చింది. రాష్ట్రానికి జరిగిన తీవ్ర అన్యాయాన్ని నిరసిస్తూ బంద్ జరుగుతుంటే జనం మధ్య ఉండాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుబాయ్ పర్యటనకు వెళ్లడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అదే సందర్భంలో బంద్ జయప్రదం కావడం, అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు రావడంతో ముఖ్యమంత్రి ఫ్లేట్ ఫిరాయించి బంద్‌కు సంఘీభావం ప్రకటించారు. ఆత్మగౌరవ పోరాటానికి ఆటంకాలు కల్పించవద్దంటూ పోలీసులకు హుకుం జారీ చేశారు. జనం సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నామన్నారు. ఎంపీలు పార్లమెంటులో చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ర్యాలీలు జరపాలని తమ శ్రేణులకు పిలుపునిచ్చారు. అయితే చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలను విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. అంబేడ్కర్ విగ్రహాల ఎదుట ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ప్రదర్శనలు చేశాయి. కాగా, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బంద్ జయప్రదమైందని, ప్రజావాణి ఢిల్లీకి చేరిందని, ఇందుకు సహకరించిన రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు, ప్రజలకు లెఫ్ట్ పార్టీలు కృతజ్ఞతలు తెలిపాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాయి. రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు, రాజధానికి నిధులు వంటి అంశాల సాధనకు మున్ముందు కూడా కలిసి కట్టుగా పోరాటాలు చేద్దామని, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పని చేద్దామని పిలుపిచ్చాయి. ఆర్టీసీకి రూ.12.32 కోట్ల నష్టం బంద్ కారణంగా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ముందు జాగ్రత్తగా ఆర్టీసీ అధికారులు బస్సులు నిలిపివేశారు. సుమారు రూ.12.32 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. సరిహద్దు రాష్ట్రాల ప్రధాన నగరాలైన చెన్నై, బెంగుళూరుకు వెళ్లే బస్సులను ఆర్టీసీ నిలిపేసింది. భద్రతను దృష్టిలో ఉంచుకుని సరిహద్దు రాష్ట్రాల నుంచి వస్తున్న బస్సులను పోలీసులు ఆపివేశారు. కాగా, బంద్‌కు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. దీంతో అన్ని జిల్లాల్లో లారీల ద్వారా సరుకు ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. అత్యవసర సరుకుల రవాణా మాత్రం కొనసాగింది. 693 మంది అరెస్ట్ బంద్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 693 మందిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసినట్టు డీజీపీ ఎం.మాలకొండయ్య గురువారం రాత్రి మీడియాకు వెల్లడించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. అక్కడక్కడ చిన్నపాటి ఇబ్బందులు తప్ప పెద్ద ఘటనలు నమోదు కాలేదన్నారు. అమరావతి ప్రాంతం అంతా పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. వెలగపూడి చెక్‌పోస్ట్ వద్ద నుంచి సచివాలయం రెండో ప్రవేశ ద్వారం వరకు ప్రత్యేక బలగాలు మోహరించాయి. హోదా పోరులో అందరినీ కలుపుకుపోతాం: జగన్ బంద్‌కు మద్దతుగా తన ప్రజా సంకల్ప యాత్రకు విరామం ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలగుంటపల్లి సమీపంలోని తన శిబిరం వద్ద విద్యార్థులతో కలిసి ప్లకార్డులు పట్టుకుని ప్రత్యేక హోదా కావాలంటూ నినదించారు. హోదా పోరులో అందరినీ కలుపుకుపోతామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడంలో సీఎం విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సీపీఎం నాయకుడు పి.మధు విజయవాడలో, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కర్నూలులో ప్రదర్శన నిర్వహించారు. కడపలో.. -
బీజేపీతోనే 12 స్థానాల్లో గెలుపు..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉత్తర భారతదేశంలో హవా నడిపిస్తూ.. దక్షిణాదిన బలపడాలని చూస్తున్న బీజేపీ అనంతలో ఉనికి కోల్పోతోంది. గతంలో బీజేపీ తరపున కదిరి ఎమ్మెల్యేగా పార్థసారధి ప్రాతినిధ్యం వహించగా.. ఇప్పుడు ఆ ప్రాభవం కాస్తా చరిత్రలో కలిసిపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తరచూ టీడీపీతో దోస్తీ కట్టడం.. ఒంటరిగా పోటీ చేయలేకపోవడం.. పొత్తులో భాగంగా అనంతలో టిక్కెట్లు దక్కించుకోలేకపోవడం పార్టీ పరిస్థితి దిగజారేందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలోని బీజేపీ.. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలోనూ బలపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ బీజేపీ పరిస్థితి ఏంటని పరిశీలిస్తే.. టీడీపీతో దోస్తీ కారణంగా మరింత బలహీనపడిన విషయం ఆ పార్టీ శ్రేణులే అంగీకరిస్తున్నారు. అయితే టీడీపీతో పొత్తు కారణంగా ఆ విషయాన్ని బాహాటంగా వెల్లడించలేకపోతున్నారు. భారతీయ జనతాపార్టీ నుంచి పార్థసారధి కదిరి ఎమ్మెల్యేగా 1999లో గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా కదిరి స్థానం బీజేపీకి దక్కింది. ఆ ఐదేళ్లు కదిరితో పాటు జిల్లాలోనూ ఆ పార్టీ కాస్త హడావుడి చేసింది. స్వతంత్రంగా గెలిచే శక్తి, ఆ స్థాయి అభ్యర్థులు పార్టీకి లేకపోయినప్పటికీ కొంత ఓటు బ్యాంకును పోగు చేసుకోగలిగింది. 2004లోనూ బీజేపీ–టీడీపీ కలిసి బరిలోకి దిగాయి. ఆ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా పార్థసారధి బరిలో నిలిచినప్పటికీ టీడీపీ రెబల్ అభ్యర్థి కారణంగా ఓటమిపాలయ్యారు. అయితే ఆ సందర్భంగా బీజేపీ శ్రేణులు మాత్రం టీడీపీ విజయం కోసం కృషి చేశాయి. 2004లో టీడీపీ ఓటమిపాలైంది. ఆ తర్వాత బీజేపీ–టీడీపీ మధ్య దూరం పెరిగింది. చంద్రబాబునాయుడు కూడా బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. చివరకు ‘అనంత’లో పాదయాత్ర సమయంలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని పొరపాటు చేశామని, భవిష్యత్‌లో మళ్లీ పునరావృతం కానివ్వబోమని కూడా పలు వేదికలపై స్పష్టం చేశారు. దీనిపై అప్పట్లో బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తిరిగి 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ తిరిగి మైత్రీబంధం కొనాసాగించి కలిసి పోటీ చేశాయి. పొత్తులో భాగంగా గుంతకల్లు సీటు బీజేపీకి కేటాయించినా.. పొత్తు ధర్మాన్ని విస్మరించి టీడీపీ తమ అభ్యర్థి కూడా బరిలో నిలపడం గమనార్హం. అయినప్పటికీ బీజేపీ మిగతా స్థానాల్లో టీడీపీకే మద్దతివ్వడం గమనార్హం. అవినీతిపై కూడా పెగలని గొంతు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో కొందరు టీడీపీ నేతలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. హంద్రీనీవా పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల్లో కూడా అవినీతి చోటు చేసుకుంది. అనంతపురం కార్పొరేషన్లో కూడా భారీగా అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే ఏ ఒక్క అవినీతి ఘటనపై బీజేపీ నేతలు నోరు మెదపలేదు. ‘అనంత’ అభివృద్ధి కోసం చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా ప్రశ్నించలేదు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ విషయంలో అన్యాయం జరుగుతున్న క్రమంలో, హంద్రీనీవా ఆయకట్టుకు నీరివ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితుల్లోనూ నిర్లిప్తత ప్రదర్శించారు. వీటన్నింటికీ కారణం పొత్తే. అయితే ‘అనంత’కు తీవ్ర అన్యాయం జరుగుతున్నా బీజేపీ నేతలు స్పందించకపోవడంపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. రాజకీయ లాభం కోసం నిమ్మకుండిపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇద్దరినీ ఒకే తీరుగా భావించారు. ఇది బీజేపీకి మరింత నష్టం చేకూర్చింది. ఈ విషయం బీజేపీ నేతలకూ స్పష్టంగా తెలుసు. దీనిపై ‘సాక్షి’ ఆరా తీస్తే టీడీపీ తీరు దారుణంగా ఉందని, దీనిపై స్పందించాలంటే మాకు పొత్తు అడ్డొస్తుందని.. టీడీపీతోనే తాము తీవ్రంగా నష్టపోతున్నామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా విష్ణువర్దన్‌రెడ్డి ఉన్నారు. అయినప్పటికీ జిల్లాలో పార్టీ పరిస్థితి ఏమాత్రం బలపడని పరిస్థితి. ఈ క్రమంలో కనీసం రానున్న ఎన్నికల్లోనైనా గెలుపోటములను పక్కనపెట్టి బరిలో నిలవాలని బీజేపీ యోచిస్తోంది. బీజేపీతోనే 12 స్థానాల్లో గెలుపు.. ప్రతి నియోజకవర్గంలో బీజేపీకి 4–5 శాతం తక్కువ లేకుండా ఓటు బ్యాంకు ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం. 2014 ఎన్నికల్లో 14 అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాలతో పాటు 2 ఎంపీ స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. చాలా చోట్ల వైఎస్సార్సీపీ నేతలు తక్కువ మెజార్టీతో ఓటమిపాలయ్యారు. ఇలాంటి స్థానాల్లో కచ్చితంగా బీజేపీ ప్రభావం ఉంటుందనేది రాజకీయపరిశీలకు వాదన. అయితే ఎన్నికల తర్వాత బీజేపీని టీడీపీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. కనీసం నియోజకవర్గాల్లో బీజేపీ నేతలకు ఏవైనా పనులున్నా టీడీపీ ఎమ్మెల్యేలు పట్టించుకోని పరిస్థితి. దీంతో బీజేపీ నేతలు టీడీపీ నేతల వైఖరిపై అంతర్గతంగా తీవ్రస్థాయిలో రగలిపోతున్నారు. ఈ సారి పోటీలో ఉంటాం.. 2009 ఎన్నికల్లో ఉరవకొండ మినహా అన్ని అసెంబ్లీ, ఎంపీ స్థానాల్లో పోటీ చేశాం. 2014లో టీడీపీ పొత్తులో భాగంగా గుంతకల్లు నుంచి బీజేపీ అభ్యర్థిని బరిలోకి దించి, తక్కిన స్థానాల్లో టీడీపీ గెలుపునకు కృషి చేశాం. కానీ టీడీపీ పొత్తు ధర్మాన్ని విస్మరించి జితేంద్రగౌడ్‌కు బీఫారం ఇచ్చింది. దీంతో మా అభ్యర్థి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉన్నా రెండు పార్లమెంట్ పరిధిలో ఒక్కో అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానం అడుగుతాం. పొత్తులో భాగంగా మూడున్నరేళ్లలో మేం నష్టపోయింది లేదు. మా వ్యూహం ప్రకారం బలపడ్డాం. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వచ్చినపుడు మేం ఎక్కడా రాజీపడలేదు. అంశాల వారీగా అవినీతిపై ప్రశ్నించాం. – విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ యువజన విభాగం -
పార్లమెంటు చట్టాన్ని గౌరవించండి: కొణతాల
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రం రెండుగా చీలిపోయాక ఆంధ్రప్రదేశ్‌కి ఇస్తామన్న రైల్వే జోన్, ప్రత్యేక హోదా హామీలను బీజేపీ నెరవేర్చాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్, మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ శుక్రవారం రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్‌ను కోరారు. ఆయన రైల్వే మంత్రికి రాసిన సుదీర్ఘ లేఖలో ప్రస్తుత బడ్జెట్లోనైనా విశాఖరైల్వే జోన్‌ను ప్రకటించాలని విన్నవించారు. పార్లమెంటులో చట్టం చేసిన తర్వాత కూడా విశాఖ రైల్వే జోన్ అంశం కాగితాలకే పరిమితం కావడం బాధాకరమన్నారు. ఈ విషయమై మాజీ రైల్వే మంత్రి సురేష్ ప్రభుకి రెండు సార్లు అర్జీ పెట్టుకున్నా.. ఫలితం లేకుంగా పోయిందని తెలిపారు. ‘ఏపీ రీ-ఆర్గనైజేషన్ బిల్లు, 2014 లోని షెడ్యూల్ 3 అవశేష ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతులను కల్సిస్తామని తెలిపింది. దాంట్లో భాగంగానే ఆరు నెలల్లోగా కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న దక్షిణమధ్య రైల్వే జోన్ తెలంగాణకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలకు రైల్వే జోన్ ఏర్పాటు అనివార్యం అయినందున వెంటనే స్పందించండి’ అని లేఖలో రామకృష్ణ పేర్కొన్నారు. హామీల అమలుకు దిక్కు లేదు.. రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరమైన అన్ని మౌలికాంశాలు విశాఖపట్నం కలిగివుందని కొణతాల అన్నారు. 1052 కి.మీ. రైల్వే లైన్ వున్న ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన రైల్వేజోన్ ఏర్పాటు కొన్ని రాజకీయ కారణాలతోనే జాప్యం అవుతోందని ఆయన విమర్శించారు. ఆదాయార్జనలో దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్న వాల్తేర్ డివిజన్ ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం మరో విశేషమని అన్నారు. ఆర్థికాభివృద్ధి దిశగా సాగుతున్న దేశంలో న్యాయమైన తమ వంతు వాటాకోసం ఉత్తరాంధ్ర ప్రజానీకం కోరుకుంటోందని.. విశాఖ పట్నం హెడ్ క్వార్టర్స్‌గా రైల్వే జోన్ ఏర్పాటుతో వారి కలలను నిజం చేయాలని విఙ్ఞప్తి చేశారు. ఏపీ రీ-ఆర్గనైజేషన్ బిల్లులో రాష్ట్రం విడిపోయాక ఆరు నెలల కాలంలోనే రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తామన్న కేంద్రం ఆ దిశగా అడుగులేయక పోవడం శోచనీయమన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేజీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రైల్వే జోన్‌ను చేర్చారని గుర్తు చేశారు. పార్లమెంటు హామీలు కూడా అమలుకు నోచుకోకుంటే ప్రజాస్వామ్యంపై మాకు నమ్మకం పోతుందని నిరసన వెళ్లగక్కారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో చివరి ఈ బడ్జెట్లో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించాలని కోరారు. ఇంకా ఆలస్యం చేసి ప్రజల్లో ఉన్న అసహనాన్ని పెంచొద్దని హెచ్చరించారు. -
ఏపీకు కేంద్ర సంస్ధలను రప్పిస్తారా?