అసెంబ్లీలో ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టనున్న (2018–19) రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై ‘గ్రేటర్’ ఎన్నో ఆశలు పెట్టుకుంది. నగరాభివృద్ధికి ఈ బడ్జెట్‌లో ఎంతమేరకు నిధులు కేటాయిస్తారోనని వివిధ శాఖలు ఎదురు చూస్తున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సైతం ప్రభుత్వానికి నివేదించారు. భారీ లక్ష్యాలు విధించుకున్న జీహెచ్‌ఎంసీ ఈసారి బడ్జెట్‌లో రూ.1669 కోట్లు కేటాయించాలని కోరింది. ఇక నగరంలో నిరంతరం నీటిని సరఫరా చేసేందుకు జలమండలి భారీ ప్రణాళికలు రూపొందించింది. వీటి అమలుకు బడ్జెట్‌లో రూ.2915 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
సాక్షి, సిటీబ్యూరో: రానున్న ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయించనున్నదనేది ఆసక్తికరంగా మారింది. ఎస్సార్‌డీపీ(వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా చేపట్టిన ఫ్లై ఓవర్లు తదితర పనులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లేనప్పటికీ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, రహదారుల అభివృద్ధి తదితర పనులపై మాత్రం అధికారులు ఆశలు పెట్టుకున్నారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రేటర్‌లో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీపై ఎలాంటి ఆర్థికభారం మోపబోమని మునిసిపల్ మంత్రి ప్రకటించడంతో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన దాదాప రూ.1500 కోట్లు ప్రభుత్వం కేటాయించనుందనే ఆశలున్నాయి. ఎస్సార్‌డీ పనులతో పాటు ఇతరత్రా పనుల కోసం మొత్తం రూ.3500 కోట్లు బాండ్లు, రుణాలుగా తీసుకునేందుకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ ఇప్పటికే బాండ్ల ద్వారా రూ.200 కోట్లు సేకరించింది. రహదారుల అభివృద్ధి పనులు, వరదకాలువల పనులతోపాటు ఆయా అంశాల్లో జీహెచ్‌ఎంసీకి రావాల్సిన వాటా నిధులపైనే ఆశలున్నాయి. ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలిలా ఉన్నాయి.
సాక్షి, సిటీబ్యూరో: నేడు ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2018–19 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై జలమండలి కోటి ఆశలు పెట్టుకుంది. ఈ సారైనా సర్కారు వాటర్‌బోర్డుకు నిధుల వరదపారిస్తే కీలక మంచినీరు, మురుగునీటి పథకాలను సాకారం చేయాలని సంకల్పించింది.ఈసారి రూ.2915 కోట్ల భారీ అంచనాలతో బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధంచేసి ఆర్థిక శాఖకు సమర్పించింది. గతేడాది వార్షిక బడ్జెట్‌లో పేరుకు రూ.1450 కోట్లు కేటాయించినప్పటికీ.. విడతలవారీగా విదిల్చింది కేవలం రూ.1050 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. కాగా రూకల్లోతు ఆర్థిక నష్టాల్లో ఉన్న బోర్డుకు ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు వివిధ ఆర్థిక సంస్థల నుంచి సేకరించిన రూ.5200 కోట్ల రుణాలు భారంగా పరిణమించాయి. మరోవైపు ప్రతీనెలా రూ.95 కోట్ల రెవెన్యూ ఆదాయం ఆర్జిస్తున్నప్పటికీ..విద్యుత్‌బిల్లులు, ఉద్యోగుల జీత,భత్యాలు, నిర్వహణ వ్యయాలు వెరసి ప్రతీనెలా ఖర్చు రూ.130 కోట్లుగా ఉంది. దీంతో ప్రతీనెలా రూ.35 కోట్ల లోటుతో బోర్డు నెట్టుకొస్తుంది. కాగా మరో వందేళ్లపాటు గ్రేటర్ తాగునీటి అవసరాలకు ఢోకా లేకుండా చూసేందుకు ప్రభుత్వం శామీర్‌పేట్‌మండలం కేశవాపూర్‌లో 10 టీఎంసీల గోదావరి జలాల నిల్వ సామర్థ్యంతో భారీ స్టోరేజి రిజర్వాయర్‌ను నిర్మించాలని తలపెట్టింది. ఈప్రాజెక్టుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. యాన్యుటీ విధానంలో పనులు దక్కిన సంస్థ ఈ ప్రాజెక్టు నిర్మాణానికయ్యే రూ.4300 కోట్ల వ్యయాన్ని భరించనుంది. అయితే భూసేకరణ,పరిహారం చెల్లింపు ఇతర వసతుల కల్పనకు రూ.700 కోట్ల నిధులు కేటాయించాలని కోరుతూ జలమండలి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
రూ.103 కోట్లు కేటాయించండి: టూరిజం శాఖ
సాక్షి, సిటీబ్యూరో: బడ్జెట్‌లో సాంస్కృతిక – టూరిజం శాఖలకు కేటాయింపులు చాలా తక్కువగా ఉంటున్నాయి. గత మూడేళ్లుగా బడ్జెట్ నిధుల విషయంలో ఈ శాఖకు నిరాశే మిగులుతోంది. గతేడాది కేవలం రూ.46 కోట్లు కేటాయించారు. ఈసారైన బడ్జెట్‌లో రూ.103 కోట్లు కేటాయించాలని భాషా సాంస్కృతిక శాఖ ప్రతిపాదనలు పంపింది. టూరిజం శాఖ బడ్జెట్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. దాదాపు రూ.8 కోట్లు టూరిజం బడ్జెట్ ఎంతమాత్రం సరిపోవటం లేదు. ఈసారి రూ. 63 కోట్లు ప్రభుత్వం కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment