కేసీఆర్ వాడిన భాషపై చర్చిద్దామా? సీఎం రేవంత్ ఫైర్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దూషణల పర్వంపై వాడీ వేడి చర్చ జరిగింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ అనే పాము మొన్నటి ఎన్నికల్లోనే చచ్చిపోయిందని.. చచ్చిన పామును చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని ఆయన అన్నారు. బుధవారం ఇరిగేషన్పై చర్చ సందర్భంగా.. ఆయన మాజీ సీఎం కేసీఆర్ వాడిన భాషపైనా తీవ్రంగా స్పందించారు.
సీఎం భాషకు అభ్యంతరం చెబుతున్నారు కదా( అసెంబ్లీలో కడియం అభ్యంతరాన్ని ప్రస్తావిస్తూ..). మరి మాజీ సీఎం కేసీఆర్ వాడిన భాషపై చర్చ చేద్ధామా?. కేసీఆర్ భాష కూడా సభ్యుల్ని అవమానించేలా ఉంది. ఓ మాజీ సీఎం అయ్యి ఉండి ఓ సీఎంను పట్టుకుని ఏం పీకడానికి పోయాడని అనొచ్చా?(నల్గొండ సభలో కేసీఆర్ ప్రసంగాన్ని ఉద్దేశించి). ఇది పద్ధతా? ఇదేనా తెలంగాణ సంప్రదాయం? అని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. బొక్కబోర్లా పడ్డా బీఆర్ఎస్ నేతల బుద్ధి మారలేదని.. చర్చలకు రమ్మంటే ప్రతిపక్ష నాయకుడు పారిపోయారని ఎద్దేవా చేశారాయన.
.. కేసీఆర్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది. కేసీఆర్ అనే పాము మొన్నటి ఎన్నికల్లోనే చచ్చిపోయింది. ఇప్పటికే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్యాంట్ ఊడదీశారు. ఇప్పుడు చొక్కా లాగుతారు. మేడిగడ్డ, కాళేశ్వరంపై చర్చకు సిద్ధంగా ఉన్నాం. మేడిగడ్డలో కూలింది రెండు ఫిలర్లే అయితే.. వాటి మీదైనా మాట్లాడేందుకు కేసీఆర్ సభకు రావాలి. రేపు సాయంత్రం వరకైనా కేసీఆర్ సభకు వస్తే చర్చిద్దాం.
.. ప్రాజెక్టులపై చర్చిద్దాం. అవసరమైతే సాగునీటి ప్రాజెక్టులపైనా శ్వేత పత్రం విడుదల చేస్తాం. ప్రతిపక్ష నాయకుడిని సభకు రమ్మనండి. అవినీతి బయటపడుతుందనే సభకు రాకుండా పారిపోయారు. కాళేశ్వరం చర్చకైనా మేం సిద్ధంగా ఉన్నాం. కుంగిన మేడిగడ్డలో నీళ్లు నింపే పరిస్థితి ఉందా? అని బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీలో సీఎం రేవంత్ నిలదీశారు. ఈ క్రమంలో సభ్యుల మధ్య పరస్పర వాగ్వాదం చోటు చేసుకోవడంతో.. బీఆర్ఎస్ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు.