బడ్జెట్‌కు, ఆ బ్రీఫ్‌కేస్‌కు ఉన్న లింకేంటి?
న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆర్థికమంత్రి పార్లమెంట్‌లోకి... మనకు కనిపించే ఫస్ట్ సీన్. ఆర్థికమంత్రి ఓ లెదర్ బ్రీఫ్ కేస్‌ను పట్టుకుని ఫోటోలో కనిపించడం. ఈ బ్రీఫ్‌కేస్‌ను అలానే భద్రంగా పార్లమెంట్‌లోకి తీసుకెళ్లి బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థికమంత్రి ప్రారంభిస్తారు. కానీ బడ్జెట్ పత్రాలను ఆనవాయితీగా ఆ బ్రీఫ్‌కేస్‌లోనే ఎందుకు తీసుకొస్తారు. ఆ లెదర్ బ్రీఫ్కేస్కున్న ప్రాధాన్యమేమిటి, ఎప్పటినుంచి ఈ సంప్రదాయం కొనసాగుతుందో ఓ సారి తెలుసుకుందాం....
ప్రపంచవ్యాప్తంగా బడ్జెట్ అనే పదం బొగెట్టీ అనే ప్రెంచి పదం నుంచి వచ్చింది. బొగెట్టీ అంటే ప్రెంచిలో లెదర్ బ్యాగ్ అని అర్థం. ప్రాచీన కాలంలో సంపదను తీసుకురావడానికి బ్రీఫ్‌కేస్‌ను సరియైనదిగా భావించేవారు. ఆ తర్వాత అదే ప్రపంచ బడ్జెట్‌ను తీసుకురావడానికి ఎంపికచేశారు. 1860 నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టేముందు రెడ్ బ్రీఫ్‌కేస్‌ను లేదా బడ్జెట్ బాక్స్‌ను తీసుకొచ్చే సంప్రదాయం బ్రిటీష్ వారి కాలంలోనే ప్రారంభమైంది. ఈ డిజైన్డ్ లెదర్ బాక్స్(బ్రీఫ్‌కేస్)నే తర్వాతి కాలంలో బడ్జెట్ బాక్స్‌గా పిలవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆర్థికమంత్రి విలియం ఎవర్ట్ గ్లాడ్‌స్టోన్ మొదట బ్రీఫ్‌కేస్ ద్వారా బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాదాపు 5, 6 గంటలపాటు జరిగిన ఆయన బడ్జెట్ ప్రసంగంలో అప్పట్లో అదే అతిపెద్ద బడ్జెట్‌గా పేరుగాంచింది. ఈ లాంగ్ బడ్జెట్‌కు అవసరమయ్యే పేపర్లను పట్టుకెళ్లడానికి కచ్చితంగా బాక్స్ అవసరమవుతుందని ఆయన భావించారు. ఆ తర్వాత నుంచి అందరు మంత్రులు అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. దీంతో ఆ చిన్న లెదర్ బ్యాగే దేశాలను ముందుకు నడిపించే స్థాయికి వెళ్లింది.
బడ్జెట్ బ్యాగ్ సంప్రదాయం స్వాతంత్య్ర భారత్‌లో మొదట 1947 నవంబర్ 26న ఆర్కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టి, బడ్జెట్ బ్యాగ్ ట్రేడ్ మార్కును కొట్టేశారు. బడ్జెట్ ఫోటోగ్రాఫ్ కూడా శెట్టినే ప్రారంభించారు. ఆయన ప్రవేశపెట్టిన ఆ సంప్రదాయాన్ని అలానే కొనసాగిస్తూ నవ్వుతూ, ఎంతో నమ్మకంగా బడ్జెట్ ఫోటోగ్రాఫ్‌కు ఫోజులిస్తారు ఆర్థికమంత్రి. ఒకవేళ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టేముందు ఫోటోగ్రాఫర్ల ముందుకు రాకపోతే ఆ బడ్జెట్‌ను అసంపూర్తిగా వారు భావిస్తారు. మనదేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేముందు ఫోటోగ్రాఫర్ల ముందుకు రావడం కొనసాగుతోంది. ఉగండ, జింబాబ్వే, మలేసియాలు వంటి దేశాలు కూడా ఈ ఫోటోగ్రాఫ్ ఆనవాయితీని కొనసాగిస్తున్నాయి.
బడ్జెట్ బ్యాగ్ రంగులు:
పదేళ్ల తర్వాత టీటీ కృష్ణమాచారి బడ్జెట్ బాక్స్‌కు బదులు స్లెండర్ ఫైల్లో బడ్జెట్ పత్రాలను తీసుకొచ్చారు. అనంతరం 1998-99 బడ్జెట్ సమయంలో ఫైనాన్స్ మినిస్టర్ యశ్వంత్ సిన్హా బ్లాక్ రంగుల్లో లెదర్ బ్యాగ్ తీసుకొచ్చారు. అదేసంప్రదాయాన్ని ఎంతో కీలకమైన ఆర్థికసంస్కరణల సమయం 1991లో బడ్జెట్ ప్రవేశపెట్టిన మన్మోహన్ సింగ్ సైతం కొనసాగించారు. అయితే యూపీఏ కాలంలో ఆర్థికమంత్రిగా ఉన్న ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాత్రం బ్రిటీష్ వారిలాగా బ్లాక్ రంగు బ్యాగ్‌కు బదులు రెడ్ కలర్ బాక్స్‌లో బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చారు. అనంతరం కాలంలో ప్రతేడాది ఆర్థికమంత్రి బడ్జెట్ పేపర్లు తీసుకొచ్చే ఈ బ్యాగ్ రంగుల్లోనూ, రూపురేఖల్లోనూ తేడా కనిపిస్తూ వస్తోంది. ఆర్థికమంత్రిగా అరుణ్ జైట్లీ బాధ్యతలు స్వీకరించినప్పుడు మొదటిరెండు కాలంలో బ్లాక్, ట్యాన్ రంగుల్లో బ్యాగ్‌ను వాడారు. అయితే బడ్జెట్ బాక్స్‌ను ఆర్థికమంత్రిత్వ శాఖ సేకరిస్తోంది. అనంతరం మూడు లేదా నాలుగు రంగుల్లో బ్యాగ్‌లను ఆర్థికమంత్రి ముందు ఉంచుతుంది. వాటిలో తనకు నచ్చిన రంగును ఆర్థికమంత్రి ఎంచుకుంటారు. అయితే ఈ సారి అరుణ్ జైట్లీ ఏ రంగు బ్యాగును బడ్జెట్ పత్రాలు తీసుకురావడానికి ఎంచుకుంటారో చూడాలి.