ఆశలు ఆవిరి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నవ్యాంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి బడ్జెట్ జిల్లా ప్రజలకు నిరాశను మిగిల్చింది. బడ్జెట్లో జిల్లాకు ఎటువంటి ప్రత్యేక కేటాయింపులు చేయలేదు. సాగునీటి ప్రాజెక్టులను చిన్నచూపు చూశారు. చెరకు రైతులకు చేదును మిగిల్చింది. అత్తెసరు నిధులతో పల్లెలు.. పట్టణాలు.. రోడ్ల అభివృద్ధి కలగా మారనుంది. మొత్తంగా చూస్తే అసెంబ్లీలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఊరించి.. ఉసూరుమనిపించింది. రాష్ట్ర విభజన అనంతరం ప్రవేశపెట్టబోయే మొదటి బడ్జెట్‌పై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల ముందు.. ఆ తర్వాత చంద్రబాబు ఇచ్చిన హామీలపై బడ్జెట్లో ప్రాధాన్యమిస్తారని ఆశపడ్డారు. అయితే చివరకు బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి చూపారు.
సాగునీటి ప్రాజెక్టులపై ‘చిన్న’చూపు
వ్యవసాయానికి ప్రధానవనరులైన సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం చిన్నచూపు చూపింది. జిల్లాలో సోమశిల ప్రాజెక్టు, సంగం, నెల్లూరు బ్యారేజీలు, తెలుగుగంగ కాలువలు, సోమశిల-స్వర్ణముఖి లింకుకాలువతో పాటు పెన్నా, కండలేరు, ఉత్తరకాలువతో పాటు అనేక పనులు పెండింగ్‌లో ఉన్నాయి. అసంపూర్తి పనులతో ఈ ఏడాది చివరి ఆయకట్టుకు నీరందక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. పలుచోట్ల నీటి కోసం రైతులు ఘర్షణలకు దిగిన ఘటనలు ఉన్నాయి.
సాగునీటి సమస్యల పరిష్కారం కోసం జిల్లా అధికారయంత్రాంగం రూ.వెయ్యి కోట్లకుపైనే అవసరమని నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి పంపింది. అదేవిధంగా కావలి కాలువను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి సాగునీరు అందిస్తామని కూడా మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం హామీ కూడా ఇచ్చారు. అయితే బడ్జెట్లో నిధులు కేటాయింపును చూస్తే జిల్లాకు ఒనగూరిందేమీ లేదని తేలిపోయిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్లో నిధులు కేటాయింపును పరిశీలిస్తే జిల్లాలో సాగు ముందుకు సాగటం కష్టమేనని నీటిపారుదలశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
రుణాల మాఫీ ఊసేలేదు
ఏ హామీతో చంద్రబాబు సీఎం పీఠం దక్కించుకున్నారో.. బడ్జెట్లో ఆ హామీల ఊసెత్తలేదు. రైతు, డ్వాక్రా, చేనేతలు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామన్నారు. అందులోభాగంగా రైతు రుణమాఫీకి సంబంధించి మూడు విడతలుగా అర్హుల జాబితాను ప్రకటించారు. అందులో అర్హులకు సంబంధించి ఇప్పటివరకు ఒక్కరూపాయికూడా జమచేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా డ్వాక్రా రుణాలు, బ్యాంకుల్లో తాకట్టుపెట్టిన బంగారం రుణాలు, చేనేతలు తీసుకున్న రుణాల ప్రస్తావన కూడా చేయకపోవటం గమనార్హం.
అదేవిధంగా కోవూరు చక్కెర ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తానని సీఎం హామీ ఇచ్చి ఉన్నారు. అది తెరుచుకోవాలంటే రూ.15 కోట్లు అవసరం. అయితే బడ్జెట్లో ఆ ప్రస్తావనే రాలేదు. దీంతో నాలుగు వేలమంది చెరకు రైతులకు చంద్రబాబు చేదుని మిగిల్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హార్బర్లు.. పోర్టులకు నిధులేవీ బాబూ?
జిల్లాలో మత్స్యకార హార్బర్ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. అదేవిధంగా కృష్ణపట్నం, దుగ్గరాజపట్నం పోర్టుల అభివృద్ధి కోసం ప్రయత్నిస్తానని ప్రకటించారు. ఇంకా పులికాట్ సరస్సు ముఖద్వారాలు తెరిచి మత్స్య కారులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. పులికాట్, నేలపట్టు, మైపాడ్ బీచ్, పెంచలకోనలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. మైపాడుకు నాలుగు వరుసల రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే వీటికేమీ నిధులు కేటాయించకపోగా.. తమ్మలపెంట తీరాన్ని విహారకేంద్రంగా మారుస్తామని ప్రకటించారు. అయితే ఈ తీరం ఇప్పటికే అనధికారికంగా ప్రారంభించారు. అక్కడ అన్ని నిర్మాణాలు చేపట్టి ఉన్నారు.
పనులు పూర్తిచేసి ఉన్నచోటే మరలా విహారకేంద్రంగా మారుస్తామని ప్రకటించటం గమనార్హం. ఇక పరిశ్రమల విషయానికి వస్తే జిల్లాలో ఎరువుల పరిశ్రమ, చేనేత కార్మికులను ఆదుకునేందుకు జిల్లాలో టెక్స్టైల్ పార్కు, జాతీయ విద్యాసంస్థలు, కిసాన్‌సెజ్‌లో రైతులకు ఉపయోగపడే పరిశ్రమలు తెస్తానని సీఎం హామీలు గుప్పించారు. అయితే ఏ ఒక్కదానికి నిధులు కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో పేర్కొనకపోవటం గమనార్హం.
అంగన్వాడీలను పట్టించుకోలా..
అంగన్వాడీ కార్యకర్తలు గత కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. కనీస వేతనం పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం వీరి ఆందోళనలను పెడచెవినపెట్టింది.
అన్నింటా కోతలే...
ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేయాల్సి ఉంది. అయితే టీడీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికొదిలేసిందని ఆర్థిక నిపుణులు మండిపడుతున్నారు. తమ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీల పక్షపాతి అని చెప్పుకుంటున్న చంద్రబాబు బడ్జెట్లో వారిని చిన్నచూపు చూశారు. వారి సంక్షేమానికి అత్తెసరు నిధులు కేటాయించి చేతులు దులుపుకొన్నారని ఆ వర్గం వారు మండిపడుతున్నారు. ఇకపోతే పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, అర్బన్ డెవలప్మెంట్ను ప్రభుత్వం విస్మరించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని పట్టించుకోలేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్మార్ట్‌సిటీ వైపు చూడలేదు
నెల్లూరు నగరాన్ని స్మార్టుసిటీగా తీర్చిదిద్దుతామని, దేశంలో ఉన్న స్మార్ట్‌సిటీల సరసన చేరుస్తామని సీఎం ప్రకటించారు. అదేవిధంగా నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేదు. అందుకోసం రూ.575 కోట్ల హడ్కో రుణం, మంచినీటి పథకానికి రూ.500 కోట్లు మంజూరుచేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా ‘రే’ కింద నెల్లూరుకు రూ.16 కోట్లు, సూళ్లూరుపేటకు రూ.25 కోట్లు మంజూరుచేస్తున్నామని తెలిపారు. ఇంకా నెల్లూరులో రింగురోడ్డును మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. అయితే బడ్జెట్లో అర్బన్ డెవలప్మెంట్ను విస్మరించారు.
వేసవికి గొంతెండాల్సిందేనా?
వేసవి రాకముందే పల్లెలు, పట్టణాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వేసవి తరుముకొస్తున్న తరుణంలో మంచినీటి సరఫరా కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సి ఉంది. అయితే బడ్జెట్లో తాగునీటి రంగానికి నిధులు అంతంతమాత్రంగా కేటాయించటంతో పల్లెలు, పట్టణాల్లో ప్రజలకు తాగునీటి తిప్పలు తప్పవని అధికార వర్గాలు చెబుతున్నారు. సమస్యలతో సతమతవుతున్న ప్రజలను ఆదుకునేందుకు నిధులను కేటాయించాల్సిన ప్రభుత్వం వాటిన్నింటినీ పక్కనపెట్టి దగదర్తి వద్ద ‘విమనాశ్రయ’ నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. అయితే అక్కడ సేకరించిన భూములు ప్రైవేటువని స్థానికులు కోర్టును ఆశ్రయించి ఉండటం గమనార్హం.