సంగడిగుంట(గుంటూరు): లోక్‌సభలో గురువారం రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా ప్రజలను నిరాశ పరచింది. ఎన్నో వడ్డిస్తారని గంపెడు ఆశలతో ఎదురు చూసిన గుంటూరు డివిజన్ పరిధిలోని రైల్వే ప్రయాణికులకు మళ్లీ మొండి చేయ్యే చూపించారు. పైగా, బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేలోగా నూతన రైళ్లను ప్రకటిస్తామంటూ రైల్వే మంత్రి చేసిన ప్రకటనపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైల్వే నూతన బడ్జెట్‌కు సంబంధించి 20 వేల సూచనలు అందాయన్న మంత్రి వాటిని పరిగణలోకి తీసుకున్నట్టు కనిపించలేదు. స్వచ్ఛ భారత్, పరిశుభ్రంగా రైళ్లు అం టూ చిల్లర వరాలతో బడ్జెట్ ప్రసంగం ముగించడంతో ఈ ఏడాది కూడా నిధుల కేటాయింపులు లేనట్టేనని అర్థమైంది.
కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం నవ్యాంధ్ర రాజధాని గుంటూరు జిల్లాకు సాధించిందీ ఏమీ లేదు. డివిజన్‌కు సౌకర్యాలు, నూతన రైలు మార్గాలు, ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇలా ఏదీ లేనట్టేనని తేటతెల్లమైంది.
ఎలాంటి నిధులు మంజూరు చేయకుండానే రైల్వేస్టేషన్లనే ఆదాయ వనరుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందంటూ చెప్పి చేతులు దులుపుకోవడం పట్ల జిల్లా వాసులు విస్మయం వెలిబుచ్చుతున్నారు.
ఇక ప్రకటించిన వైఫై సేవలు, తక్కువ ధరకు రక్షిత మంచినీరు, లిఫ్ట్‌లు, ఎస్క్‌లేటర్లు డివిజన్ పరిధిలోని ఎన్ని స్టేషన్లకు అందనున్నాయో వివరాలు ప్రకటించలేదు.
శాటిలైట్ స్టేషన్లు, నూతన రైల్వే స్టేషన్ల నిర్మాణం అటుంచి న్యూ గుంటూరు రైల్వే స్టేషన్‌కు ఏ విధమైన హంగులు ఏర్పాటు చేయనున్నారనేది తెలియరాలేదు.ఎంత మొత్తంలో నిధులు అందనున్నాయో అగమ్యగోచరంగా ఉంది. ఇప్పటివరకు లేని ఆనవాయితీ ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు తీసుకోవాలని చేసిన ప్రకటనతో ఎంపీలు ఎంత శాతం నిధులు కేటాయిస్తారనే దానిపై స్పష్టత లేదు.
ఐదు నిమిషాల్లో టికెట్ కొనుగోలు చేసే వెసులుబాటు, రైల్వేకు ప్రత్యేక యాప్, బోగీలో అప్పర్ బెర్త్‌కు చేరుకునేందుకు ప్రత్యేక నిచ్చెన తదితర తాయిలాల వల్ల పెద్దగా ఒరిగిందేమీలేదు.
కాపలా లేని రైల్వే గేటుల వద్ద కేవలం హెచ్చరిక బోర్డులు మాత్రమే ఏర్పాటును ప్రకటించిన రైల్వే మంత్రికి ప్రయాణికుల భద్రతపై శ్రద్ధలేనట్టు తెలుస్తోంది.
ప్రకటించిన రైల్వే అండర్ బ్రిడ్జిల్లో గుంటూరు డివిజన్‌కు ఎన్ని మంజూరు కానున్నాయనేది తెలియాల్సి ఉంది. మహిళలకు భద్రత కల్పించే విధంగా కెమెరాల ఏర్పాటు చర్యలు కొంతమేర హర్షించదగినవిగా కనిపిస్తున్నాయి.
ఇక 120 రోజులకు ముందే రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు, వృద్ధులు, ప్రత్యేక అవసరాలు ఉన్నవారు చక్రాల కుర్చీని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం వంటి ప్రకటనలు చప్పగా ఉన్నాయి.
ఏది ఏమైనా గుంటూరు డివిజన్ పరిధిలో స్టేషన్లు, రైలు మార్గాలు, ప్రత్యేక రైళ్లు, నూతన హంగులు ఒనగూరనున్నాయనే ఆశలపై రైల్వే మంత్రి నీళ్లు చల్లారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు ప్రత్యేక రైళ్లను ప్రకటించనున్నట్లు రైల్వే మంత్రి చేసిన ప్రకటనపై వేచి చూడాల్సిందే.
మళ్లీ హుళక్కే..
Published Fri, Feb 27 2015 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM
Advertisement