వైద్య, ఆరోగ్య శాఖపై మంత్రి సమీక్ష
► వైద్య సేవల మెరుగుపై చర్చ
హైదరాబాద్: తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ బడ్జెట్ కేటాయింపులపై ఆ శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా వైద్యాధికారులు, ఆరోగ్యశాఖ రాష్ట్రస్థాయి వివిధ విభాగాల అధిపతులతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు.
వైద్య సేవల విస్తరణకు అనుగుణంగా బడ్జెట్ను రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు. నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు, అందుతున్న సేవలపై వస్తున్న విమర్శలు సహా వివిధ అంశాలపై చర్చించారు. ఉద్యోగుల ఆరోగ్య కార్డు అమలులో వైఫల్యంపైనా మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆరోగ్యశ్రీ రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, విమర్శలు రాకుండా ఆరోగ్యశ్రీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని లక్ష్మారెడ్డి సూచించారు. ఆ తర్వాత మంత్రి నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఆసుపత్రుల పనితీరు, రోగులకు అందుతున్న సేవలపై సమీక్షించారు. ఈ సమావేశానికి నిజామాబాద్ ఎంపీ కవిత సహా ఆ జిల్లా అధికారులు పలువురు హాజరయ్యారు.