స్వగ్రామంలో రియల్ హీరో...
మధ్యప్రదేశ్ః నటనలో తన ప్రతిభను ప్రదర్శించి, బాలీవుడ్ లో అభిమానుల మనసులు దోచుకుంటున్ననటుడు నవాజుద్దీన్ సిద్ధికి... సినిమాల్లోనే కాక నిజజీవితంలోనూ తనదైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. నటనతో అభిమానుల మనసులను దోచుకుంటూ... ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటూ... రీల్ లైఫ్ లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన.. తమ సొంత గ్రామం కోసం రియల్ హీరోగానూ మారాడు.
ఉత్తర ప్రదేశ్ ముజఫర్ నగర్ జిల్లాలోని చిన్న పట్టణమైన బుధానాలోని ఓ రైతు కుటుంబంలో జన్మించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి, తమ గ్రామంలోని రైతులకోసం వినూత్న పద్ధతిని అవలంబిస్తున్నాడు. పివోట్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా వాటర్ ఎఫిషియంట్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇటీవల అతని టూర్ లో భాగంగా కేన్స్ కు వెళ్ళిన సమయంలో సిద్ధికి అక్కడి ఫ్రెంచ్ రైతులను కలుసుకున్నాడు. వారు అవలంబించే సెంటర్ పివోట్ ఇరిగేషన్ సిస్టమ్ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. పైపులద్వారా నీరు పొలం మొత్తం తడిపే విధానాన్ని తన గ్రామంలో అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేశాడు. ఈ విధానంలో ఒక్కో పైపునుంచి విరజిమ్మే నీరు సుమారు ఎకరం పొలం వరకు తడుపుతుంది. ఈ సంప్రదాయ విధానంతో నీరు సగానికిపైగా పొదుపు అయ్యే అవకాశం ఉంది.
తన టూర్ లో తక్కువ నీటితోనే ఎక్కువ సాగుచేసే ఆధునిక పద్ధతులను తెలుసుకున్న సిద్ధికి.. ఆ విధానాన్ని వెంటనే స్వగ్రామంలో అమల్లోకి తెచ్చాడు. అందుకోసం ఓ శాంపిల్ మోడల్ ను షిప్ ద్వారా తమ గ్రామానికి తెప్పించారు. గ్రామస్థులు సైతం ఈ కొత్త పద్ధతిని సునాయాసంగా గ్రహించి అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ సాగుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బుధానా గ్రామంలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు సిద్ధికి ప్రవేశపెట్టిన ఈ సరి కొత్త పద్ధతిని వరంగా భావించిన రైతులు... పంటలు విరివిగా పండించేందుకు ముందుకొస్తున్నారు.