విద్యుదాఘాతంతో ఎనిమిది గేదెల మృతి
⇒ ఒక ఆవూ.. రెండు నక్కల మృత్యువాత
⇒ కరెంట్ తీగ తెగిపడడంతో ప్రమాదం
⇒ శామీర్పేట్ మండలం ఉద్దమర్రి శివారులో ఘటన
శామీర్పేట్: విద్యుత్ తీగ తెగిపడటంతో కరెంట్షాక్కు గురై ఎనిమిది గేదెలు, ఒక ఆవుతో పాటు రెండు నక్కలు మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన శామీర్పేట్ మండలం ఉద్దమర్రి గ్రామ శివారులో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్దమర్రి గ్రామానికి చెందిన ఒట్టెల ఆంజనేయులు వ్యవసాయంతో పాటు పాడి గేదెలు పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో ఆయన సోమవారం ఉదయం గ్రామ శివారులో ఉన్న బావి వద్ద కట్టేసిన జీవాలను నీరుతాగేందుకు తీసుకెళ్తున్నాడు. బావి సమీపంలో(నల్లగొండ జిల్లా బండకాడిపల్లె రెవెన్యూ పరిధి)లో ఓ విద్యుత్ స్తంభం నుంచి ప్రమాదవశాత్తు తెగిపడిన విద్యుత్ తీగ తెగిపడింది. దీంతో ఆంజనేయులుకు చెందిన గేదెలు కిందపడిన విద్యుత్ తీగపైనుంచి నడుచుకుంటూ వెళ్లాయి. అప్పటికే తీగకు కరెంట్ సరఫరా ఉండడంతో గేదెలు విద్యుదాఘాతానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో 8 గేదెలతోపాటు ఒక ఆవు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. దీంతోపాటు అప్పటికే రెండు నక్కలు కూడా విద్యుదాఘాతానికి గురై చనిపోయాయి. ఆంజనేయులు విషయం గమనించి తన కుటుంబీకులతో పాటు విద్యుత్ అధికారులకు సమాచారం అందించి కరెంట్సరఫరాను నిలిపివేయించాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే మూగజీవాలు మృత్యువాత పడ్డాయని, తాను రూ. 10 లక్షలు నష్టపోయానని లబోదిబోమన్నాడు. ట్రాన్స్కో అధికారులు స్పందించి తనకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆయన కోరాడు.