కొత్త ఇంట్లో ఇంకుడుగుంత తప్పనిసరి!
గ్రేటర్‌తో పాటు అన్ని నగరాలు, పట్టణాల్లో అమలుకు రాష్ట్రప్రభుత్వ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మీరు కొత్త ఇంటిని నిర్మిస్తున్నారా? ప్లాట్ విస్తీర్ణం 100 చదరపు మీటర్లు, అంతకు మించి ఉంటుందా? అయితే.. మీరు నిర్మించుకునే ఇంట్లో ఇంకుడు గుంతను తప్పనిసరిగా నిర్మించుకోవాల్సిందే. 300 చదరపు మీటర్లకు మించిన ప్లాట్లలో ఇంటిని నిర్మిస్తేనే ఇంకుడుగుంతను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని అమలులో ఉన్న భవన నిర్మాణ నిబంధనలు పేర్కొంటున్నాయి. తాజాగా ప్లాట్ విస్తీర్ణం 100 చదరపు మీటర్లు, అంతకు మించినా ఇంకుడుగుంత నిర్మించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు భవన నిర్మాణ నియమావళి (జీవో 168)కి సవరణలు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్ ఈ నెల 12న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జీవోను పబ్లిక్ డొమైన్లో పెట్టకపోవడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీహెచ్ఎంసీతో పాటు ఇతర 73 నగర, పురపాలక సంస్థల పరిధిలో ఈ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గుంత లేకుంటే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వరు
ప్లాట్ విస్తీర్ణం 100-300 చదరపు మీటర్ల మధ్య ఉంటే కనీసం 1 మీటర్ ఁ1 మీటర్ వైశాల్యంలో ఇంకుడుగుంతను నిర్మించుకోవాల్సిందే. ప్లాట్ విస్తీర్ణం 300 మీటర్లకు మించితే జీవో 168లో నిర్దేశించిన వైశాల్యంతో ఇంకుడుగుంతలను నిర్మించాలని ప్రభుత్వం కోరింది. ఇంకుడుగుంత లేకుండా ఇళ్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయవద్దని ఆంక్షలు విధించింది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణ ప్రాంతాల్లో జనాభా శరవేగంగా పెరిగిపోతోంది. దీంతో భూగర్భ జలాల వినియోగం పెరిగిపోతుండగా.. వర్షపు నీటి సంరక్షణ చర్యలు లేక భూగర్భ జలాలు వృద్ధి కావడం లేదు. ఈ నేపథ్యంలో 100 చదరపు మీటర్లు, ఆపై విస్తీర్ణంలో నిర్మించే ఇళ్లలో ఇంకుడుగుంతను తప్పనిసరి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రతిపాదనలు సమర్పించగా.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.