bull competition
-
కాంతి నింపిన సంక్రాంతి
భీమవరం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి/నెట్వర్క్: ఏ వీధి చూసినా రంగులద్దిన రంగవల్లులు.. వాటిపై గొబ్బెమ్మలు.. ప్రతి ఇంటి నుంచి కమ్మటి పిండివంటల వాసనలు.. యువతీయువకుల కేరింతలు.. సంస్కృతి, సంప్రదాయాలు గుర్తుచేస్తూ గోపూజలు.. కోడిపందేలు, ఎడ్లపందేలు.. గాలిపటాలు.. క్రీడాపోటీలు.. ముగ్గుల పోటీలు.. రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి పర్వదినం సందర్భంగా మూడురోజులు కనిపించిన దృశ్యాలివి. భోగి రోజైన శుక్రవారం మొదలైన కోడి పందాల జాతర కనుమ రోజైన ఆదివారం సా.5 గంటలతో పరిసమాప్తమైంది. బరుల వద్ద ఏకంగా బౌన్సర్లను రంగంలోకి దించారు. భీమడోలు మండలం గుండుగొలనులో పేకాట శిబిరం వద్దకు మఫ్టీలో వెళ్లిన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లపై పేకాట రాయుళ్లు దాడి చేయడంతో వారిపై కేసు నమోదు చేశారు. ఇక తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని పల్లంకుర్రులో నిర్వహించిన భారీ కోడి పందేల్లో ఇన్నోవా కారును బహుమతిగా పెట్టడం విశేషం. ‘పశ్చిమ’ంలోని కాళ్ల మండలం సీసలిలో నిర్వాహకులు రెండు బుల్లెట్లు సిద్ధంచేశారు. అలాగే, కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంప్రదాయ కోడి పందేల్లో గెలుపొందిన విజేతలకు బులెట్, స్కూటీలను బహుమతులుగా అందజేశారు. ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దలను స్మరించుకుని వారికి పిండివంటలు నివేదించారు. విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలో బొజ్జన్నకొండ వద్ద కనుమ సందర్భంగా జాతర కోలాహలంగా జరిగింది. ఇక్కడి బౌద్ధస్థూపం వద్ద జరిగిన బౌద్ధమేళాలో మయన్మార్ బౌద్ధ భిక్షువు వెనరబుల్ ఆయుపాల మహాథేరోజీ పాల్గొన్నారు. సింహాచలంపై మకరవేట ఉత్సవాన్ని నిర్వహించారు. విశాఖలో గాలిపటాలు ఎగురవేశారు. ఆలయాల్లో ఘనంగా గోపూజలు కనుమ పండుగ సందర్భంగా దేవదాయశాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలన్నింటిలోనూ ఆదివారం గోపూజ కార్యక్రమాలు నిర్వహించింది. దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ సతీ సమేతంగా విజయవాడ దుర్గగుడిలో గోపూజ చేశారు. అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంలో జరిగిన గోపూజలో ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తిరుపతి ఇస్కాన్ మందిరం వేదికగా సిద్ధరామేశ్వర, రాజరాజేశ్వరి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గోమాతలకు సీమంతాలు, గోదూడలకు నామకరణ ఉత్సవం నిర్వహించారు. గుడివాడలో జాతీయ ఎడ్ల పందేలు మంత్రి కొడాలి నాని సారథ్యంలో కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని లింగవరం రోడ్డులో జాతీయ స్థాయి ఎడ్ల పందేలు నిర్వహించారు. రసవత్తరంగా పందుల పందేలు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లిలో మూడురోజుల పాటు పందుల పందేలు రసవత్తరంగా సాగాయి. పితృదేవతల స్మరణ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సింహపురీయులు శనివారం పితృదేవతలను స్మరిస్తూ నెల్లూరులోని పవిత్ర పినాకిని తీరంలో ఉన్న సమాధుల తోట (బోడిగాడితోట)లో తమ పూర్వీకుల సమాధుల వద్ద పూజలు చేశారు. బహుమతులందజేసిన ఎమ్మెల్యే రోజా వైఎస్సార్ జిల్లా శెటిపల్లె గ్రామం తిమ్మక్కగారిపల్లెలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. సందడిలేని అతిథులు సంక్రాంతి కోడి పందేలను.. ఇక్కడి వారి ఆత్మీయ విందును రుచిచూసి మళ్లీ ఏడాది వరకు ఎదురుచూసే అతిథులు ఈసారి పెద్దగా ఇటువైపు కన్నెత్తి చూడలేదు. అంబరాన్నంటిన ప్రభల సంబరం అమలాపురం: సంక్రాంతి పండగ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కోనసీమ వ్యాప్తంగా ప్రభల తీర్థాలు వైభవంగా జరిగాయి. జిల్లాలో సంక్రాంతి నుంచి ముక్కనుమ వరకూ ప్రభల తీర్థాలు జరుగుతాయి. గత ఏడాది స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ మెప్పు పొందిన అంబాజీపేట మండలం జగ్గన్నతోట ప్రభల తీర్థం ఆదివారం నయనానందకరంగా సాగింది. ఏకాదశ రుద్రులను (11 ప్రభలను) పంటపొలాలు, కాలువలు దాటుతూ తరలించిన తీరు భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ముఖ్యంగా గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం ప్రభలు అప్పర్ కౌశిక కాలువను దాటి వచ్చే అపురూప దృశ్యాన్ని పెద్దసంఖ్యలో భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. మొత్తం 11 ప్రభలు జగ్గన్నతోటలో ఒకేచోట కొలువుదీరి భక్తులను పరవశింపజేశాయి. అంబాజీపేట మండలంలో వాకలగరువు సరిహద్దున జరిగిన తీర్థాల్లో వాకలగరువు ప్రభ 47 అడుగులు, తొండవరం ప్రభ 46 అడుగుల ఎత్తున రూపుదిద్దుకుని భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 60 గ్రామాల్లో ప్రభల తీర్థాలు కనులపండువగా జరిగాయి. జగ్గన్నతోట ప్రభల తీర్థానికి అప్పర్ కౌశిక కాలువను దాటి వస్తున్న గంగలకుర్రు అగ్రహారం ప్రభ రంగంపేటలో ఉత్సాహంగా జల్లికట్టు చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని ఎ.రంగంపేట గ్రామంలో నిర్వహించిన పశువుల పండుగ వేడుక అంబరాన్నటింది. పశువుల యజమానులు వాటి కొమ్ములకు పలకలను కట్టి పందేలకు సిద్ధం చేశారు. జిల్లాలోనే ఎడ్ల పందేలు (జల్లికట్టు)కు అత్యంత ప్రాధాన్యత ఉన్న గ్రామం రంగంపేట. జల్లికట్టును చూడటానికి జిల్లా నలుమూలల నుంచేగాక ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పౌరుషంతో పరుగులు తీస్తున్న కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు ఉత్సాహం చూపారు. ఎద్దులకు కట్టిన పలకలను సొంతం చేసుకునేందుకు పోటీపడ్డారు. -
ఆద్యంతం ఉత్కంఠభరితంగా..
సాక్షి, గన్నవరం: జాతీయస్థాయి ఎడ్లబండి లాగుడు, ఆవుల అందాల పోటీలను కృష్ణా జిల్లా గన్నవరంలో ఎన్టీఆర్ పశువైద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో మంగళవారం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు ఆళ్ల నాని, రంగనాథరాజు ప్రారంభించారు. నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వరంలో ఐదు రోజులు పాటు పోటీలు జరగనున్నాయి. తొలిరోజు పదిహేడు జతల ఒంగోలు జాతి బసవన్నలు కాలు దువ్వాయి. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈ పోటీల్లో తమ యజమానిని, ఊరిని ప్రథమస్థానంలో నిలిపేందుకు పోటీలు పడ్డాయి. ఈ పోటీలకు దేశం నలుమూలల నుంచి 150 జతల ఎడ్లు తరలి రానున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి ఎండ్లబండ లాగుడు పోటీలను తిలకించారు. ఈ పోటీలు 13 వ తేదీ వరుకు జరుగుతాయి. పోటీల్లో గెలుపొందిన ఎడ్ల జతలకు రూ.20 లక్షలకు పైగా నగదు బహుమతులు ఇవ్వనున్నారు. -
సంప్రదాయాలను కొనసాగిద్దాం
–రాష్ట్రస్థాయి బలప్రదర్శనలో ఎమ్మెల్యే –కర్నూలు ఎడ్లకు ప్రథమ స్థానం ఎమ్మిగనూరు: మన సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించాలని, అందులో భాగమే ఎడ్ల బండలాగుడు ప్రదర్శన అని ఎమ్మెల్యే డాక్టర్ బి.జయ నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. శ్రీ నీలకంఠేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి జ్ఞాపకార్థం రాష్ట్రస్థాయి వృషభాల బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నారు. మూడో రోజు సబ్‌జూనియర్ సైజు ఎడ్ల పోటీలను మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. సబ్‌జూనియర్ సైజ్ ఎడ్ల పోటీల్లో మొత్తం 7జట్లు పాల్గొన్నాయి. హోరాహోరీగా సాగిన ఈపోటీల్లో కర్నూలు వీఆర్ నగర్‌కు చెందిన గీతామృత చౌదరి ఎడ్లు 20 నిమిషాల్లో రాతిబండ (16ఘనపుటడుగుల)ను 3172 అడుగుల దూరంలాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. ఉయ్యాలవాడ మండలం తడమలదిన్నెకు చెందిన పేరెడ్డి సుబ్బారెడ్డి ఎడ్లు 3020 అడుగులు లాగి ద్వితీయ స్థానం, వెల్దుర్తి మండలం బాపురానికి చెందిన నడిపి సోమిరెడ్డి వృషభాలు 2908 అడుగులతో తృతీయ స్థానం, అనంతపురం జిల్లా తాడిచెర్లకు చెందిన బీమిరెడ్డి లవకుమార్ ఎడ్లు 2752.8అడుగులు లాగి నాలుగో స్థానం, బెళగల్ మండలం పోల్కల్కు చెందిన మహేంద్రనాయుడు ఎడ్లు 2532.3అడుగులు లాగి ఐదో స్థానం పొందాయి. బుధవారం విజేత ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వాహకులు కొండయ్యచౌదరి, హరిప్రసాద్‌రెడ్డి, మిఠాయి నరసింహులు, రాందాస్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముగతి ఈరన్నగౌడ్, పల్లెపాడు రామిరెడ్డి, రైస్‌మిల్ నారాయణరెడ్డి, కౌన్సిలర్లు స్వామిగౌడ్, రామకృష్ణ, పరశురాముడు, రంగన్న,జయన్న తదితరులు పాల్గొన్నారు. నేడు సీనియర్ కేటగిరి పోటీలు రాష్ట్రస్థాయి ఒంగోలు ఎడ్ల బలప్రదర్శనలో భాగంగా బుధవారం సీనియర్ కేటగిరి సైజు ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో గెలుపొందిన ఎడ్ల జతకు మొదటి బహుమతిగా రూ.60,000,ద్వితీయ బహుమతిగా రూ.50,000, తృతీయ బహుమతిగా రూ.35,000 , నాలుగో బహుమతిగా రూ.25,000,ఐదవ బహుమతిగా రూ.15,000 ఇస్తామని పోటీల నిర్వాహకులు బీవీ రైతు సంఘం కన్వీనర్లు కొండయ్యచౌదరి, మిఠాయి నరసింహులు, హరిప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.