మహిళలు.. ‘ఫండ్’ రాణులు!
అన్ని రంగాల్లోనూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న మగువలు... స్టాక్ మార్కెట్లోనూ తగ్గేదేలే అంటూ ‘బుల్’ రైడ్ చేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల విలువైన మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో ఇన్వెస్టర్ల నిధులను పక్కాగా నిర్వహిస్తూ ఫండ్ మేనేజర్లుగా సత్తా చాటుతున్నారు. తాము ఇంటినే కాదు.. అవకాశమిస్తే, ఫండ్ హౌస్‌లను కూడా మగాళ్లకు దీటుగా చక్కబెట్టగలమని నిరూపించుకుంటున్నారు. మహిళల నిర్వహణలో ఉన్న ఫండ్ ఆస్తులు ‘ఇంతింతై.. అన్నట్లుగా ఏడాది వ్యవధిలో రెట్టింపై రూ.13.45 లక్షల కోట్లకు ఎగబాకడం విశేషం!! అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంఎఫ్ రంగంలో రాణిస్తున్న అతివలపై స్పెషల్ ఫోకస్... దేశంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ దూకుడు లాగే.. మహిళా ఫండ్ మేనేజర్లు కూడా జోరు పెంచారు. ఈ ఏడాది జనవరి నాటికి వారి సంఖ్య 49కి పెరిగింది. ఏడాది క్రితం ఉన్న 42 మందితో పోలిస్తే కొత్తగా ఏడుగురు జతయ్యారు. ఇదే కాలంలో మగ ఫండ్ మేనేజర్లు ఇద్దరు మాత్రమే పెరగడం గమనార్హం. ఇక మగువల నిర్వహణలో ఉన్న ఫండ్ ఆస్తులు కూడా రూ.13,45 లక్షల కోట్లకు ఎగిశాయి. గతేడాది జనవరితో పోలిస్తే రెట్టింపైంది. దేశంలో ఎంఎఫ్ సంస్థల నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు (ఏయూఎం) రూ.67.25 లక్షల కోట్లు కాగా, ఇందులో మహిళా ఫండ్ మేనేజర్లు/కో–ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తున్న అసెట్స్ విలువ 20 శాతానికి జంప్ చేసింది. అయితే, మొత్తం ఎంఎఫ్ ఫండ్ మేనేజర్లు 482 మందిలో మహిళల వాటా ఇంకా తక్కువగానే ఉన్నప్పటికీ, గత ఏడాది కాలంలో మగాళ్లతో పోలిస్తే మగువల సంఖ్య ఎక్కువగా పెరగడం ఈ రంగంలో వారి భవిష్యత్తుపై మరింత ఆశలు రేకెత్తిస్తోంది.25 ఎంఎఫ్‌లు... 339 స్కీమ్‌లు దేశవ్యాప్తంగా 25 మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో అతి వలు ఫండ్ మేనేజర్లుగా రాణిస్తున్నారు. మొత్తం 339 ఫండ్ స్కీమ్‌లను మేనేజ్ చేస్తున్నారు. కాగా, 6 ఫండ్ సంస్థల్లో ముగ్గురు కంటే ఎక్కువ మహిళా ఫండ్ మేనేజర్లు ఉండగా, 6 ఫండ్ హౌస్‌లలో ఇద్దరు చొప్పున, 13 సంస్థల్లో కనీసం ఒకరు ఉన్నారు. అన్నింటికంటే ఎక్కువగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్‌లో ఏడుగురు మహిళా ఫండ్ మేనేజర్లు రూ.2.27 లక్షల కోట్ల విలువైన 66 స్కీమ్‌లను నిర్వహిస్తున్నారు. భారత్‌లో అతిపెద్ద ఫండ్ హౌస్‌గా నిలుస్తున్న ఎస్బీఐ ఎంఎఫ్లోలో ఐదుగురు మగువలు రూ.1.88 లక్షల కోట్ల ఆస్తులను (14 స్కీమ్‌లు) మేనేజ్ చేస్తున్నారు. ఇక నిప్పన్ ఇండియా ఎంఎఫ్‌లో ఇద్దరు అతివలు రూ.1.53 లక్షల కోట్ల అసెట్లను (26 స్కీమ్‌లు) నిర్వహిస్తున్నారు.రూ.6.13 లక్షల కోట్లు ...తాజా గణాంకాల ప్రకారం దేశంలోని 49 మహిళా ఫండ్ మేనేజర్లలో టాప్–5 మగువలు మేనేజ్ చేస్తున్న ఫండ్ అసెట్స్ రూ.6.13 లక్షల కోట్లు (45.55 శాతం)గా ఉంది. ఇందులో ఎస్బీఐ ఎంఎఫ్‌కు చెందిన మాన్సి సజేజా రూ.1.41 లక్షల కోట్ల అసెట్లను నిర్వహిస్తూ.. భారత్‌లో నంబర్ వన్ మహిళా ఫండ్ మేనేజర్‌గా నిలిచారు. నిప్పన్ ఇండియా ఎంఎఫ్ కింజల్ దేశాయ్ (రూ.1.37 లక్షల కోట్ల అసెట్స్), యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కృష్ణా ఎన్ (రూ.1.34 లక్షల కోట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఫ్ అశ్విని షిండే 47 స్కీమ్‌లతో అత్యధిక స్కీమ్‌లను మేనేజ్ చేస్తున్న వారిలో టాప్‌లో ఉన్నారు. తర్వాత స్థానాల్లో మిరే అసెట్ ఇండియా ఎంఎఫ్ ఏక్తా గాలా (30 స్కీమ్‌లు), నిప్పన్ ఇండియా ఎంఎఫ్ కింజల్ దేశాయ్ (24 స్కీమ్‌లు) నిలిచారు. పురుషుల విషయానికొస్తే.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్‌కు చెందిన మనీష్ బాంతియా రూ.3.49 లక్షల కోట్ల అసెట్లను మేనేజ్ చేస్తూ.. దేశంలో టాప్ ఫండ్ మేనేజర్‌గా కొనసాగుతున్నారు.ఇన్వెస్టర్లుగానూ... ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు ట్రేడింగ్ చేస్తున్న అతివల సంఖ్య కూడా భారీగా పెరుగుతూ వస్తోంది. 2021 నుంచి చూస్తే ఏటా కొత్తగా 3 కోట్ల డీమ్యాట్ ఖాతాలు జతవగా.. ప్రతి నలుగురు ఇన్వెస్టర్లలో ఇప్పుడు 1 మహిళా ఇన్వెస్టర్ ఉండటం వారి జోరుకు నిదర్శనం. జనవరి నాటికి దేశంలో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 18.8 కోట్లకు చేరుకుంది. ఇందులో దాదాపు 23.9 శాతం మహిళలవే కావడం గమనార్హం. కాగా, మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోల (ఖాతాల) సంఖ్య 22.92 కోట్లకు చేరింది. 2021 మే నెలలో తొలిసారి 10 కోట్ల మైలురాయిని చేరగా.. నాలుగేళ్లలోనే దాదాపు 13 కోట్ల ఫోలియోలు కొత్తగా జతవ్వడం ఫండ్స్‌లోకి పెట్టుబడులు ఏ రేంజ్లో వచ్చి పడుతున్నాయనేందుకు నిదర్శనం. – సాక్షి, బిజినెస్ డెస్క్