bullet in body
-
ఆస్మాబేగం కేసులో బయటపడిన సంచలన విషయం
సాక్షి, హైదరాబాద్ : వెన్నుపూసలో బుల్లెట్ బయటపడిన ఆస్మాబేగం కేసులో మంగళవారం సంచలన విషయం బయటపడింది. వెన్నులోంచి తీసిన బుల్లెట్‌ను రెండేళ్ల క్రితం నాటు తుపాకీతో కాల్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ఆస్మాను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా నాటు వైద్యంతో వైద్యం చేయించి రక్తస్రావం, నొప్పి తగ్గించారని విచారణలో వెల్లడైంది. ఇది కాకుండా, పోలీసులు ఆస్మా సెల్‌ఫోన్‌ను సీజ్ చేసి కాల్ రికార్డ్స్ ద్వారా విచారణ జరుపుతుండగా మరో కోణం బయటపడింది. ఆస్మా తండ్రి నజీర్ మైలార్‌దేవ్‌పల్లిలోని కింగ్స్ ఫంక్షన్ హాల్లో వాచ్‌మెన్‌గా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఆ ఫంక్షన్ హాల్ యజమాని షనవాజ్ కొడుకు జుబేర్ ఓ పెళ్లి బరాత్‌లో కాల్పులు జరిపాడు. ఈ మేరకు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో జుబేర్‌పై కాల్పుల కేసు నమోదైంది. ఇప్పుడు ఆస్మాబేగం కేసుతో జుబేర్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ రెండింటికి ఏమైనా సంబంధముందా? అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు యువతి కుటుంబసభ్యులను విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, సర్జరీ అయిన మర్నాడే ఆస్మాబేగంను డిశ్చార్జి చేయడంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. చదవండి : అంతుచిక్కని తూటా రహస్యం! -
మహిళకు తెలియకుండానే శరీరంలో బుల్లెట్..
నరసన్నపేట (శ్రీకాకుళం): రైలు కోసం స్టేషన్లో ఎదురుచూస్తున్న ఓ మహిళ శరీరంలోకి ఆమెకు తెలియకుండానే బుల్లెట్ దిగింది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో బుధవారం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని డాక్టర్లు కనుగొని బుల్లెట్‌ను తొలగించడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం లచ్చన్నపేటకు చెందిన శ్రీకాకుళం సత్య(28) అనకాపల్లిలో ఉంటున్నారు. ఇటీవలే జన్మించిన తన కుమారుడిని స్వగ్రామం తీసుకువచ్చేందుకు బుధవారం విశాఖలోని మర్రిపాలెం రైల్వే స్టేషన్‌కు వచ్చారు. ఆ సమయంలో సత్యకు వెనక వైపు నుంచి వీపుకు ఏదో వస్తువు బలంగా తగిలింది. రాయి తగిలి ఉంటుందని సత్య కుటుంబ సభ్యులు బావించారు. గాయపడిన ఆమెకు స్థానికంగా స్వల్ప చికిత్స చేయించి ప్రైవేటు వాహనంలో నరసన్నపేటకు తీసుకువచ్చారు. ఇక్కడకు వచ్చే సరికి గాయం తీవ్రత పెరగడంతో స్థానిక వాత్సల్య ఆసుపత్రిలో చూపించారు. పరిశీలించిన వైద్యులు ఎక్స్‌రే తీయగా అది బుల్లెట్‌గా గమనించి వెంటనే ఆపరేషన్ చేసి తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు గొలివి మోహనరావు తెలిపారు. సత్య భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.