మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్
మెదక్ : మెదక్ జిల్లా పుల్కల్ మండలం న్యూఉమ్నాపూర్లోని పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ వద్ద గురువారం అపశ్రుతి చోటు చేసుకుంది. సిబ్బంది శిక్షణ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ మిస్‌ఫైర్ అయ్యింది. ఆ సమయంలో న్యూఉమ్నాపూర్ గ్రామానికి చెందిన చంద్రకళ అనే మహిళ వ్యవసాయ పనుల నిమిత్తం నడుచుకుంటూ వెళుతుండగా ఆమె తలలోకి ఓ బుల్లెట్ దూసుకు వెళ్లింది.
దాంతో ఆమెను బంధువులు హుటాహుటీన చికిత్స నిమిత్తం సంగారెడ్డి గోకుల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చంద్రకళ తలలోని బుల్లెట్‌ను తొలగించారు. కాగా ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు.