ఉగ్రవాదుల నుంచి పేలుడు పదార్థాల స్వాధీనం
వేలూరు(తమిళనాడు), న్యూస్‌లైన్: చెన్నై, పుత్తూరులలో అరెస్టు చేసిన ఉగ్రవాదుల నుంచి పది కిలోల పేలుడు పదార్థాలను, వాటికి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సీబీసీఐడీ ఎస్పీ అన్బు చెప్పారు. తమిళనాడుకు చెందిన బీజేపీ నేత, హిందూ మున్నని రాష్ట్ర కార్యదర్శి హత్యలతో పాటు బీజేపీ అగ్రనేత అద్వానీ పర్యటనలో పైపు బాంబు వేసిన సంఘటనలో ప్రధాన నిందితులుగా ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను రెండు రోజుల కిందట అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
పోలీసుల కాల్పుల్లో గాయపడిన ఉగ్రవాది బన్నీ ఇస్మాయిల్ చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఫక్రుద్దీన్, బిలాల్ మాలిక్‌లను పోలీసులు వేలూరు సెంట్రల్ జైలులో విచారిస్తున్నారు. హిందూ మున్నని నేత వెల్లయప్పన్, బీజేపీ రాష్ట్ర నేత డాక్టర్ అరవిందరెడ్డి హత్యలకు సంబంధించి వేలూరులో ఈ ఉగ్రవాదులకు ఎవరైనా సాయం చేశారా, వారితో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే దానిపై విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఇదిలా ఉండగా, బెంగళూరులోని బీజేపీ కార్యాలయంపై బాంబు దాడి కేసుకు సంబంధించి ఆదివారం రాత్రి బెంగళూరు సీబీసీఐడీ పోలీసులు వేలూరు వచ్చి ఫక్రుద్దీన్‌ను విచారించినట్లు సమాచారం. కాగా, బిలాల్ మాలిక్‌ను పదకొండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ జడ్జి శివకుమార్ సోమవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.