శవాలే మొక్కలుగా పెరిగితే..
ఓ మనిషి చనిపోయాక ఆయన ఓ చిహ్నంగా కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శాశ్వతంగా గుర్తుండిపోవాలంటే ఏం చేయాలి? వాళ్లకో స్మారకం కట్టాలి. అందుకు ఎంతో ఖర్చవుతుంది. కానీ ఖర్చు లేకుండా చనిపోయిన వ్యక్తి ఓ చిహ్నంగా మారితే! ఇదే ఇటలీకి చెందిన డిజైనర్లు రాహుల్ బ్రెడ్జెల్, అన్నా సిటెల్లీలకు ఓ మంచి ఐడియాను ఇచ్చింది. వెంటనే వారు సేంద్రీయ పదార్థాలతో కోడి గుడ్డు ఆకారంలో ఉండే ఓ శవ పేటికను తయారు చేశారు.
ఈ పేటికలో మృతదేహాన్ని లేదా అంత్యక్రియల అనంతరం అస్థికలను పెట్టి, వాటిలో తమకిష్టమైన విత్తనం నాటి భూమిలో పాతిపెడితే కొంత కాలానికి ఆ పేటిక నుంచి భూమిపైకి విత్తు మొలకెత్తుతుంది. అది చెట్టై పెరుగుతుంది. అది చనిపోయిన వ్యక్తి జ్ఞాపక చిహ్నంగా శాశ్వతంగా మిగిలిపోతుంది. డిజైనర్లు ఇటలీ భాషలో ‘క్యాప్సులా ముండీ(ప్రపంచ క్యాప్సుల్)’గా పిలుస్తున్న ఈ శవపేటికను తయారు చేయడానికి సేంద్రియ పదార్థాలను ఉపయోగిస్తారు. మానవ అస్థికలు కూడా మొక్కలకు బలాన్ని ఇస్తాయి కనుక మనం నాటే విత్తనాలు చెట్లుగా మంచిగా ఎదుగుతాయని వారు చెబుతున్నారు.
సంప్రదాయంగా ప్రస్తుతం తయారుచేస్తున్న శవపేటికల వల్ల బోలడంతా సమయం, ఖర్చు వృధా అవుతుందని కూడా డిజైనర్లు చెబుతున్నారు. ఆ శవపేటికలు అంత త్వరగా మట్టిలో కలసిపోవు కనుక పర్యావరణానికి కూడా ముప్పేనని అమెరికాలోని టెన్నీస్ యూనివర్సిటీలో బయోసిస్టమ్స్ ఇంజనీరింగ్ అండ్ సాయిల్ సైన్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న జెన్నిఫర్ డెబ్రూయెన్ చెబుతున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు శ్మశానాలను పచ్చటి వనాలుగా మారుస్తున్న నేటి కాలంలో శవాలే చెట్లుగా పెరగడం ఇంకా మంచిదని డిజైనర్లు అంటున్నారు. తాము ప్రస్తుతం అస్థికలను పెట్టి విత్తును నాటే పేటికలనే తయారు చేశామని, ఇకముందు మృతదేహాలను పెట్టే పేటికలను ఇదే పద్ధతిలో తయారు చేస్తామని వారు చెబుతున్నారు.