Burma residents
-
అక్రమ గుర్తింపు కార్డులు: బర్మా శరణార్థుల అరెస్ట్
సాక్షి, పహాడీషరీఫ్: భారత పౌరసత్వానికి సంబంధించి అక్రమంగా గుర్తింపు కార్డులు కలిగి ఉన్న తొమ్మిది మంది బర్మా శరణార్థులను బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. ఎస్సై మక్బూల్ జానీ వివరాల ప్రకారం.. బర్మా దేశానికి చెందిన మహ్మద్ నూర్ అలియాస్ నూర్ మహ్మద్(52) తన కుటుంబంతో 2013లో బాలాపూర్ అల్ జాబ్రీ కాలనీకి వచ్చి నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఇతడు దళారులను ఆశ్రయించి ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, పాన్ కార్డులను సంపాదించాడు. సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు దాడులు చేసి నూర్ మహ్మద్‌తో పాటు భార్య షాన్జిద్దా(45), పిల్లలు మహ్మద్ జావెద్(22), నౌరీ అమీన్(17), ఫౌజియా(17), ఫయాజుల్ హసన్(13), నజిముల్ హసన్‌ను అరెస్ట్ చేశారు. వీరితో పాటు ఇదే కాలనీలో అక్రమంగా గుర్తింపు కార్డులు పొందిన మహ్మద్ హాశీం(17), అస్మా బేగం(22)లను కూడా అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి తొమ్మిది ఆధార్ కార్డులు, రెండు పాస్‌పోర్టులు, రెండు ఓటర్ గుర్తింపు కార్డులు, రెండు పాన్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. -
బర్మా దేశస్థుల వివరాలు సేకరించిన పోలీసులు
పహాడీషరీఫ్ (హైదరాబాద్) : మయన్మార్ (బర్మా) దేశం నుంచి శరణార్థుల రూపంలో మూడేళ్ల క్రితం బాలాపూర్ రాయల్ కాలనీకి వచ్చి నివాసం ఉంటున్న వారి వివరాలను పహాడీషరీఫ్ పోలీసులు సోమవారం సేకరించారు. కాలనీలోని నాలుగు క్యాంప్‌లతోపాటు ఒక్కో ఇంట్లో నివాసం ఉంటున్న బర్మా కుటుంబాల వివరాలను సేకరించారు. ఒక్కో వ్యక్తి ఫొటో, వేలి ముద్రలు, పూర్తి బయోడేటాలను తీసుకున్నారు. రాయల్ కాలనీలోనే 150 కుటుంబాలలో 533 మంది నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ....శరణార్థులుగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పహాడీషరీఫ్, మైలార్‌దేవ్‌పల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో 1450 మంది నివాసం ఉంటున్నారన్నారు. ప్రస్తుతం చాలామంది గుర్తింపు కార్డులు లేకుండా అక్రమంగా నివాసం ఉంటున్నారన్నారు. దీనికి తోడు ఒకరిద్దరికి ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు తేలిందన్నారు. ఈ నేపథ్యంలో వీరి పూర్తి వివరాలు సేకరించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ ఆదేశించారన్నారు. ఇక్కడ నివాసం ఉంటున్న వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడానికి యూఎన్‌హెచ్‌సీఆర్ కూడా సముఖత తెలిపిందని వెల్లడించారు.