మయన్మార్ (బర్మా) దేశం నుంచి శరణార్థుల రూపంలో మూడేళ్ల క్రితం బాలాపూర్ రాయల్ కాలనీకి వచ్చి నివాసం ఉంటున్న వారి వివరాలను పహాడీషరీఫ్ పోలీసులు సోమవారం సేకరించారు.
పహాడీషరీఫ్ (హైదరాబాద్) : మయన్మార్ (బర్మా) దేశం నుంచి శరణార్థుల రూపంలో మూడేళ్ల క్రితం బాలాపూర్ రాయల్ కాలనీకి వచ్చి నివాసం ఉంటున్న వారి వివరాలను పహాడీషరీఫ్ పోలీసులు సోమవారం సేకరించారు. కాలనీలోని నాలుగు క్యాంప్‌లతోపాటు ఒక్కో ఇంట్లో నివాసం ఉంటున్న బర్మా కుటుంబాల వివరాలను సేకరించారు. ఒక్కో వ్యక్తి ఫొటో, వేలి ముద్రలు, పూర్తి బయోడేటాలను తీసుకున్నారు. రాయల్ కాలనీలోనే 150 కుటుంబాలలో 533 మంది నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ సందర్భంగా డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ....శరణార్థులుగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పహాడీషరీఫ్, మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో 1450 మంది నివాసం ఉంటున్నారన్నారు. ప్రస్తుతం చాలామంది గుర్తింపు కార్డులు లేకుండా అక్రమంగా నివాసం ఉంటున్నారన్నారు. దీనికి తోడు ఒకరిద్దరికి ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు తేలిందన్నారు. ఈ నేపథ్యంలో వీరి పూర్తి వివరాలు సేకరించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ ఆదేశించారన్నారు. ఇక్కడ నివాసం ఉంటున్న వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడానికి యూఎన్‌హెచ్‌సీఆర్ కూడా సముఖత తెలిపిందని వెల్లడించారు.