నగర శివారు ప్రాంతంగా ఉన్న పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ నేరాలకు అడ్డాగా మారుతోంది. తమ శత్రువులను ఎక్కడో హత్య చేస్తున్న నిందితులు అర్ధరాత్రి వేళ మృతదేహాలను తీసుకొచ్చి స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతాలలో పడేసి చేతులు దులుపుకుంటున్నారు. ఉదయాన్నే ఆ మృతదేహాలను చూసి చచ్చిందెవరో.. చంపిందెవరో తేల్చడానికి పోలీసులు తలలు పట్టుకోవాల్సి వస్తుంది.
– పహాడీషరీఫ్
అధిక శాతం ఉత్తర భారతీయులే..
ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశ్చా తదితర ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రజలు జీవనోపాధి కోసం నగరానికి అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రస్తుతం వారంతా పహాడీషరీఫ్ ఠాణా పరిసరాలలో నివాసం ఉంటున్నారు. ఇలాంటి వారు హత్యకు గురవుతుండటం.. ఒక్కోసారి వీరే హత్యలు చేసి తమ స్వరాష్ట్రాలకు పారిపోతుండడంతో కేసుల దర్యాప్తు ముందుకు సాగని పరిస్థితి నెలకొంటోంది. వీరితో పాటు పాతబస్తీ నుంచి వచ్చి కూడా ఇక్కడ హత్యలు చేసిన ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. కాగా పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి నేరాల నివారణకు కృషి చేస్తామని ఎల్‌బీనగర్ డీసీపీ సన్‌ప్రతీత్‌సింగ్ వెల్లడించారు.
చదవండి: పహాడీషరీఫ్: 38 రోజుల్లో నాలుగు హత్యలు, హడలెత్తుతున్న స్థానికులు
► ముఖ్యంగా జల్‌పల్లి పెద్ద చెరువు పరిసరాలలోనే మృతదేహాలను పడేసేందుకు అనువైన స్థలంగా ఎంచుకుంటున్నారు. కొన్ని సార్లు ఇతర ప్రాంతాలలో హత్య చేసి ఇక్కడ పడేస్తుండగా.. మరికొన్ని సార్లు ఇక్కడ మద్యం పారీ్టలు చేసుకుంటూ పథకంలో భాగంగా హతమారుస్తున్నారు.
► ఇక్కడ జరుగుతున్న హత్యలను చూస్తున్న స్టేషన్ పరిధి ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలను పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయడంతో పాటు రాత్రి పూట గస్తీని ముమ్మరం చేయాలని కోరుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల హత్యలు నమోదైనప్పుడు వివరాలు తెలియని మృతుల కుటంబీకులు తమ వారు ఇలా దారుణ హత్యకు గురయ్యారన్న విషయాలు కూడా తెలియని పరిస్థితి నెలకొంటోంది.
చదవండి: స్నేహితురాలి వద్దకు వెళుతున్నానని...
ఎటూ తేలని హత్య కేసులు..
మచ్చుకు కొన్ని.
► మామిడిపల్లిలోని ఎస్‌ఎస్‌పీడీఎల్ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో ఉన్న గెస్ట్‌హౌజ్‌లో 2016 జూన్ 25వ తేదీనా ఉత్తరప్రదేశ్‌కు చెందిన రమాకాంత్ పాండే (40) దారుణంగా హత్యకు గురయ్యాడు. వెంచర్‌లోకి తాను తీసుకొచ్చిన ఓ యువతీ, యువకుడే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు భావించినప్పటికీ వారు ఇంకా దొరకలేదు. వీరి ఆచూకీ కోసం పోలీసులు బీహార్ వెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
► అదే విధంగా 2016 ఆగస్టు 13వ తేదీనా పహాడీషరీఫ్ – మామిడిపల్లి రహదారి పక్కన ఉన్న ఓ ప్రైవేట్ సంస్థ ఆవరణలో 25 ఏళ్ల గుర్తుతెలియని యువకుడిపై పెట్రోల్ పోసి తగులబెట్టి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. ఈ కేసులో మృతుడు ఎవరో కూడా ఇంకా తేలలేదు.
► 2020 ఏప్రిల్ నెలలో ఇదే సంస్థ ప్రాంగణంలో గుర్తు తెలియని మహిళ అస్థిపంజరం లభ్యమయ్యింది. ఈ కేసులోనూ ఎలాంటి పురోగతి లేకుండా పోయింది.
► 2014 నవంబర్ 15వ తేదీనా ఎర్రకుంట అలీ నగర్‌లో హత్యకు గురైన యువతి వివరాలు కూడా ఇంకా తెలియరాలేదు.
నెల వ్యవధిలో నాలుగు హత్యలు..
► 2021 ఆగస్టు 3వ తేదీనా జల్‌పల్లి కార్గో రోడ్డు పక్కన గుర్తుతెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నెల రోజుల కావస్తున్నా మృతుడు ఎవరో... హత్య చేసిందెవరో కూడా తెలియరాలేదు.
► ఆగస్టు 24వ తేదీనా ఇమాంగూడ సమీపంలో జంగయ్య అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
► ఆగస్టు 28వ తేదీనా రంగనాయకుల స్వామి ఆలయ పూజారీ కౌశిక్ శోభా శర్మ ఆలయ ప్రాంగణంలోనే గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
► జూలై 20వ తేదీనా తమిళనాడుకు చెందిన మురుగేశన్ జల్‌పల్లి శ్రీరాం కాలనీలో క్లీనర్ చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.
చెరువుకు పర్యాటకులు రావాలంటే భద్రతే ముఖ్యం..
జల్‌పల్లి పెద్ద చెరువును టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.9.5 కోట్లతో త్వరలోనే సుందరీకరణ పనులు చేయనుంది. పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చేలా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ ప్రాంతంలో ప్రజాభద్రత ఎంతో అవసరం ఉంది. రాక్ గార్డెన్ తెలపెట్టిన రాళ్లల్లోనే గతేడాది పాతబస్తీ యువకుడిని స్నేహితులు దారుణంగా హత్య చేశారు.
Comments
Please login to add a commentAdd a comment