burra narasimha
-
షాడో ఎమ్మెల్యే అరాచకాలతోనే.. ఇలా చేస్తున్నాం!
సాక్షి, నల్గొండ: కోదాడ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న కోదాడ ఎంపీపీ, ఆమెను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే అరాచకాలను తట్టుకోలేక విధిలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ను వీడుతున్నామని కోదాడ మాజీ మార్కెట్ చైర్పర్సన్ బుర్రా సుధారాణి, పలువురు సర్పంచ్‌లు ప్రకటించారు. ఆదివారం కోదాడలో ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కోదాడలో మట్టి వ్యాపారుల నుంచి నెలకు రూ.8లక్షల నుంచి రూ.10 లక్షలు వసూలు చేస్తున్న షాడో ఎమ్మెల్యేతో పట్టణంలో వందల మంది ఇళ్లను కట్టుకోలేక నెలల తరబడి ఇబ్బందులు పడ్డారన్నారు. వీరి అక్రమాలతో ప్రజలు తమను నిలదీస్తున్నారని, దీనిని తట్టుకోలేక తామే బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని తెలిపారు. సమావేశంలో అనంతగిరి ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు, లక్కారం, బొజ్జగూడెం సర్పంచ్‌లు భూపతి, వెంకటేశ్వర్లు, మాజీ సింగిల్ విండో చైర్మన్ బుర్రా నర్సింహారెడ్డి, కత్రం నాగేందర్‌రెడ్డి, గునుకుల స్వరూప పాల్గొన్నారు. -
సావిత్రక్క కన్నీళ్లు పెడుతుంటే చూడలేకపోయా!
- విజయ నిర్మల మహానటి సావిత్రి వీరాభిమానుల్లో ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల ఒకరు. సావిత్రి ప్రస్తావన వస్తే చాలు, విజయ నిర్మల పులకించిపోతారు. సావిత్రి గురించి చాలా విషయాలు విజయ నిర్మల ‘సాక్షి’కి చెప్పారు. సందర్భం: సావిత్రి జయంతి నన్ను ముద్దు చేసేవారు! సావిత్రక్క అంటే చిన్నప్పట్నుంచీ నాకు ప్రాణం. ‘పాండురంగ మాహాత్మ్యం’ తర్వాత బాలనటిగా ఓ తమిళ చిత్రంలో చిన్న పాత్ర చేశాను. అందులో జెమినీ గణేశన్, సావిత్రి హీరో హీరోయిన్లు. వారిద్దరూ రైలులో వెళ్తుంటారు. నాది బిచ్చగత్తె పాత్ర. చిరిగిన గౌను వేసుకొని పాడుకుంటూ వస్తుంటా. ఆ సినిమా టైటిల్ గుర్తులేదు కానీ, అది ఓ విషాదగీతం. కథకు సింబాలిక్‌గా ఆ పాట సాహిత్యం ఉంటుంది. షాట్ గ్యాప్ వస్తే చాలు.. నన్ను దగ్గరకు తీసుకొని ముద్దు చేసేవారు సావిత్రక్క. నా పొట్ట గిల్లి.. ‘బాగా చేశావురా’ అని మెచ్చుకునేవారు. నా అభిమాన నటికి చేరువలో నేనుండటం, ఆమె మెప్పునే పొందగలగటం... ఆ క్షణాలు మరచిపోలేనివి. ఆ రోజు నుంచి ఆమెను ‘అక్క’ అనే పిలిచేదాన్ని. మరపురాని అనుభవాలు... ‘విచిత్ర కుటుంబం’ సినిమా ద్వారా సావిత్రక్కకు తెరపై కూడా చెల్లెలిగా నటించే అవకాశం నాకు దక్కింది. అందులో నాది రౌడీరాణి లాంటి పాత్ర. ఎన్టీఆర్ గారేమో నా బావగారన్నమాట. ఓ సన్నివేశంలో ఆయన మారువేషంలో ఇంటికొస్తారు. మరదల్ని కాబట్టి ఆటపట్టిస్తూ... ‘ఏం పిల్లా..’ అంటూ వీపు మీద తడతారు. పాత్రలో లీనమైపోవడం వల్ల కావచ్చు... కాస్త గట్టిగా తట్టారు. అమాంతం కిందపడిపోయాను. ఆ సీన్లో కృష్ణగారు కూడా ఉంటారు. లొకేషన్ అంతా ఒకటే నవ్వులు. అప్పుడు సావిత్రక్కే నన్ను పైకి లేపారు. ‘అంత బలహీనంగా ఉంటే ఎలాగమ్మా... కాస్త తిను. నా లాగా ఉండాలి..’ అంటూ అనునయంగా బుజ్జగించారు. ఇలాంటి అనుభవాలు ఆమెతో చాలానే ఉన్నాయి. నేను దర్శకత్వం వహించిన తొలి తెలుగు సినిమా ‘కవిత’లో నా తల్లి పాత్ర పోషించింది సావిత్రక్కే. ‘నేను డెరైక్ట్ చేస్తున్నాను’ అనగానే.. వెంటనే ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నారు. శివాజీ గణేశన్, ఎస్వీ రంగారావు లాంటి మహానటుల్నే డామినేట్ చేసే అభినయ సామర్థ్యం సావిత్రక్క సొంతం. అంతటి మహానటిని డెరైక్ట్ చేసే భాగ్యం ‘కవిత’ సినిమాతో నాకు దక్కింది. ఓ సారి ఇద్దరం అనుకోకుండా ఫ్లయిట్లో కలిశాం. ప్రయాణమంతా... కబుర్లే కబుర్లు, నవ్వులే నవ్వులు. అది జరిగిన కొన్నేళ్లకు ముంబయ్‌లో అవార్డు ఫంక్షన్ అయితే... బయలు దేరాను. అనుకోకుండా అదే వేడుకకు సావిత్రక్క కూడా బయలుదేరారు. సేమ్ ఫ్లయిట్. తొలి విమాన ప్రయాణంలో ఉన్నంత జోష్... ఈ దఫా ఆమెలో కనిపించలేదు. దిగాలుగా, నీరసంగా కనిపించారు. ఇంటిపై ఇన్‌కమ్‌టాక్స్ దాడులు, దాంపత్య జీవితంలో ఒడుదొడుకులు - ఇవన్నీ ఆమెను క్రుంగదీశాయి. నాతో కన్నీటి పర్యంతం అయ్యారామె. ఆమె కన్నీరు పెడుతుంటే తట్టుకోలేకపోయాను. ముంబయ్‌లో ఇద్దరం ఒకే హోటల్లో దిగాం. కానీ, అవార్డు వేడుకకు ఆమె రాలేదు. ఆమె తరఫున నేనే అవార్డు అందుకున్నాను. నా పార్వతిని సావిత్రక్క చూడలేదు! సమయపాలన అంటే సావిత్రక్క తర్వాతే ఎవరైనా! చెప్పిన టైమ్‌కి లొకేషన్లో ఉండేవారు. నిర్మాత బాగు కోరుకునే కథానాయిక ఆమె. సావిత్రక్క కరెక్ట్ టైమ్‌కి వస్తారనే భయంతో మేము కూడా కరెక్ట్ టైమ్‌కి వచ్చేవాళ్లం. తర్వాత్తర్వాత నాక్కూడా అది అలవాటైపోయింది. నా జీవితంలో నేను చేసిన పెద్ద ఎచీవ్మెంట్ ‘దేవదాసు’లో పార్వతి పాత్ర. అది అక్కయ్య అనితర సాధ్యంగా పోషించిన పాత్ర. ఆ పాత్రలో ఆమెను చూశాక... మరొకర్ని ప్రేక్షకులు అంగీకరించరు. కానీ... ధైర్యం చేశాను. ఆ విషయం నేరుగా ఆమెకే చెప్పాను. ‘డెరైక్షన్ కూడా నేనే’ అని చెప్పాను. అప్పుడు నన్ను ఆమె నిరుత్సాహపరచలేదు. ‘నువ్వు చేయగలవురా! నీలో ఆ సామర్థ్యం ఉంది’ అని ప్రోత్సహించారు. అయితే... నా పార్వతి పాత్రను సావిత్రక్క చూడలేదు. ఎందుకంటే... అప్పటికే ఆమె ఆరోగ్యం క్షీణదశకు చేరుకుంది. నిజంగా అది నా దురదృష్టం. ఆ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం... దేవదాసు చనిపోయాడని తెలియగానే.. పార్వతి పరుగుపరుగున వస్తూ... ఆమాంతం మెట్లపై నుంచి దొర్లుకుంటూ కింద పడిపోతుంది. ఆ సన్నివేశంలో సావిత్రక్క అభినయం ఎప్పటికీ మరచిపోలేం. ఆ స్థాయిలో చేయలేకపోయినా గొప్పగా చేయాలి, ‘విజయ నిర్మల బాగా చేసింది’ అనిపించుకోవాలనే కసితో... నటన పరంగా నాపై ఆమె ప్రభావం పడనీయకుండా... నా స్టయిల్లో ఆ సన్నివేశం చేశాను. దర్శకుడు ఎల్వీ ప్రసాద్ గారైతే పార్వతిగా నా అభినయం చూసి, ‘నీ అభిమానిని అయిపోయానమ్మాయి’ అన్నారు. అలాంటి మహానటిని చూడలేదు! సావిత్రక్క నటించిన చిత్రాల్లో ‘దేవదాసు’ అంటే నాకు ప్రాణం. ఇక ‘మిస్సమ్మ’ విషయానికొస్తే... అదో కొత్త కోణం. ఆ తర్వాత కూడా సాంఘికాల్లో నటిగా ఎన్నో ప్రయోగాలు చేశారామె. పౌరాణికాల విషయానికొస్తే ‘మాయాబజార్’, ‘నర్తనశాల’, ‘పాండవ వనవాసం’... ఇలా చెప్పు కుంటే చాలానే ఉన్నాయి. పౌరాణిక పాత్రల్లో సావిత్రక్క డైలాగ్ డెలివరీ అద్భుతం. అసలు అలాంటి మహానటిని మరొకరిని నేను చూడలేదు. అలాంటి సహకారం ఉండుంటేనా...! ఒక దర్శకురాలిగా చెబుతున్నా.. ‘చిన్నారి పాపలు’, ‘మాతృదేవత’ చిత్రాలను చాలా గొప్పగా తీశారు సావిత్రక్క. నటిగానే కాదు, దర్శకురాలిగా కూడా ఆమెలో లోపాలు ఎంచలేం. అయితే... సావిత్రక్కకు సరైన సహకారం లేదు. నాకు కృష్ణగారు కొండంత అండగా నిలిచారు కాబట్టే అన్ని చిత్రాలకు దర్శకత్వం చేయగలిగాను. అలాంటి సహకారం సావిత్రక్కకు కూడా ఉంటే.. గొప్ప సినిమాలు డెరైక్ట్ చేసేవారేమో! నిర్మాతగా కూడా ఆమెకు అన్నీ ఎదురుదెబ్బలే. ‘మూగమనసులు’ చిత్రాన్ని ‘ప్రాప్తం’గా తమిళంలో రీమేక్ చేస్తే... అది పరాజయం పాలైంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె వైభోగాన్ని మాటల్లో వర్ణించలేం! కెరీర్ చివరికి వచ్చేసరికి చిన్నా చితకా పాత్రలు చేశారు సావిత్రక్క. ‘నువ్వు ఇంకా గొప్ప పాత్రలు చేయగలవు అక్కా’ అని నేను ధైర్యం చెప్పబోతే.. ‘లేదురా.. ఇక నటించలేను’ అని తేల్చి చెప్పేశారు. ఎందుకంటే.. అప్పటికే ఆమె షుగర్ వ్యాధిగ్రస్థురాలయ్యారు. సావిత్రక్క ఎంతటి మహానటో.. అంతటి అమాయకురాలు. ప్రతి వారినీ గుడ్డిగా నమ్మేసేది. బోళా మనిషి. సున్నితమైన మనస్తత్వం. భావోద్వేగాలను అణచుకోలేని తత్వం. అతి మంచితనమే ఆమె జీవితాన్ని దెబ్బతీసింది. చివరకు అయినవారే మోసం చేశారు. ఆమె ఇంటి నిండా ఎప్పుడూ జనాలే! ఎంతమంది ఇంట్లో తింటున్నారో లెక్క ఉండేది కాదు. బీరువా తాళాలు కూడా అందుబాటులో ఉండేవి. అడిగినవారికి అడిగినంత ఇచ్చేసేది. స్టార్డమ్లో ఉండగా ఆమె వైభోగాన్ని మాటల్లో వర్ణించలేం. మద్రాస్‌లో సావిత్రక్క ఇల్లు.. ప్యాలెస్‌లా ఉండేది. కానీ, చివరి ఘడియల్లో తమ్ముడి వరసయ్యే వ్యక్తి ఇంట్లో తలదాచుకున్నారామె. బెంగళూరులో అనారోగ్యంతో కుప్పకూలిపోతే.. ఆమెను మద్రాసుకి తరలించారు. నేను షూటింగుల ఒత్తిడి వల్ల వెళ్లలేకపోయాను. ఓ సారి వీలు కుదుర్చుకొని వెళ్లాను. ఆమెను ఆ స్థితిలో చూశాక నా హృదయం తల్లడిల్లిపోయింది. పక్కనే పాత ఫొటో ఉంచారు. మంచంపై మూడడుగుల అస్థిపంజరంలా సావిత్రక్క. అప్పటికే కోమా స్టేజ్‌లో ఉన్నారు. నాకు మాట పెగల్లేదు. గొంతు తడి ఆరిపోయింది. కూర్చోగలిగినంత సేపు కూర్చొని, కన్నీటిని దిగమింగుకొని వెళ్లిపోయాను. సినీ పరిశ్రమలో ఆమె అనుభవించినన్ని కష్టాలు ఏ నటీ అనుభవించలేదు. సావిత్రక్క జీవితం ఓ పాఠ్యాంశం. నటిగా ఎదగాలనుకునే ఏ స్త్రీ అయినా.. ఆమె స్థాయికి ఎదగాలని కోరుకోవాలి! వ్యక్తిగా ఆమెలా జీవితం ముగిసిపోకూడదని దేవుణ్ణి వేడుకోవాలి! సంభాషణ: బుర్రా నరసింహ -
అప్పుడాయన నవ్విన నవ్వు ఇంకా గుర్తుంది!
‘‘నేను వ్యాఖ్యానం చేసిన పలు కార్యక్రమాలకు ఏయన్నార్ అతిథిగా వచ్చేవారు. అలా ఆయనతో కొంత పరిచయం ఏర్పడింది. అయితే, ఆ మహానటునితో బంధం బలపడింది మాత్రం ‘మట్టిమనుషులు’ సీరియల్ టైమ్‌లోనే. అందులో నేను ఆయనకు కూతురిగా చేశాను. ఆయనతో నటించడానికి భయపడుతుంటే, నాతో చనువుగా మాట్లాడి నాలోని భయాన్ని పోగొట్టారు. సెట్లో అక్కినేనిగారుంటే ఆ సందడే వేరు. నాపై పుత్రికావాత్సల్యాన్ని ప్రదర్శించేవారాయన. ‘తెలుగమ్మాయివి కాకపోయినా.. నీ తెలుగు చూస్తుంటే ముచ్చటేస్తుంది’ అనేవారు. అక్కినేని అన్నపూర్ణగారు కూడా నాపై ఎంతో అభిమానాన్ని చూపించేవారు. ‘నువ్వు ఫలానా ప్రోగ్రామ్‌లో... అలా చేశావ్, ఇలా చేశావ్’ అని నాకే గుర్తు చేసేవారామె. ఆ పుణ్యదంపతుల అభిమానాన్ని చూరగొనడం నా అదృష్టం. 84వ పుట్టినరోజు సందర్భంగా తొలిసారి అక్కినేనిగారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయనతో నేను అన్న తొలి మాట... ‘మీకు 84 ఏళ్లు అంటే నమ్మను’ అని. అప్పుడు ఆయన నవ్విన నవ్వు నాకింకా గుర్తుంది. ‘మా టీవీ’లో ప్రసారమైన ‘గుర్తుకొస్తున్నాయి’ కార్యక్రమం నా జీవితంలో మరచిపోలేనిది. 74 వారాల పాటు అక్కినేని జీవితాన్ని ఆవిష్కరించిన ఆ కార్యక్రమంలో ఆయన్ను ప్రశ్నలడిగే భాగ్యం నాకు దక్కింది. నాగేశ్వరరావుగారికి పొగడ్తలంటే అస్సలు పడదు. మనుషుల్ని ఆయన చదివినట్లు ఎవరూ చదవలేరు. ఆయన జ్ఞాపకశక్తి అద్భుతం. శతాబ్దాల క్రితం జరిగిన విషయాలను కూడా నిన్ననో మొన్ననో జరిగినట్లు ఈజీగా చెప్పేసేవారు. ఏయన్నార్ ఒక్కో సినిమా ఒక్కో పాఠం. ఒక్కో మలుపు ఒక్కో సందేశం. అందులో నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి.యాదృచ్ఛికంగా ఏయన్నార్ చివరి ఇంటర్వ్యూ కూడా నేనే చేశాను. ఆయన పుట్టిన రోజు సందర్భంగా గత ఏడాది ఇదే రోజున ఆయన మనవళ్లు సుమంత్, సుశాంత్, నాగచైతన్యలతో కలిపి ఏయన్నార్‌తో చేసిన ఇంటర్వ్యూ అది. ఆ తర్వాత నెల రోజులకే ఆయనకు కేన్సర్ అన్న విషయం బయటపడింది. మళ్లీ పార్ధివ దేహాన్నే చూడగలిగాను. ఆయన భౌతికంగా లేరు కానీ.... తెలుగు సినిమా బతికున్నంత వరకూ సినిమాల రూపంలో ఎప్పుడూ మనముందే ఉంటారు’’. సంభాషణ: బుర్రా నరసింహ -
కోట శ్రీనివాసరావు బర్త్‌డే
ఇక్కడ సంతృప్తి వెతుక్కోవడం అమాయకత్వం..! విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్ కోట శ్రీనివాసరావు. 36 ఏళ్ల నట ప్రస్థానంలో ఆయన చేసిన వైవిధ్యమైన పాత్రలు ఎన్నో. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా కోటతో ‘సాక్షి’ జరిపిన సంభాషణ. ఆరోగ్యం ఎలా ఉంటోందండీ... బాగానే ఉంటుంది. అయితే... వయసు మీద పడుతోంది కదా... కీళ్ల నొప్పులు. ఇదివరకు చేసినంత ఉత్సాహంగా సినిమాలు చేయకపోవడానికి కారణం అదేనా? కొంతవరకు కరెక్టే. అయినా... ఈ వయసులో నాకు పరుగెత్తే వేషాలు ఇవ్వరు కదా. ఇప్పుడు స్టార్లుగా చలామణీ అవుతున్న కుర్రహీరోలకు తాతయ్యగానో, లేక బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లాంటి సీనియర్లకు బాబాయిగానో, తండ్రిగానో వేషాలు ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఓ అరడజను సినిమాలు చేతిలో ఉన్నాయి. అయితే... వాటి పేర్లు మాత్రం అడక్కండి. ఎందుకంటే... నాకు గుర్తుండవు. మీ స్థాయికి తగ్గ పాత్రలు ఇప్పుడు వస్తున్నాయంటారా? నాకు తెలిసి ఈ తరంలో నాకు దక్కిన అదృష్టం ఎవరికీ దక్కలేదు. నా 36 ఏళ్ల సినీ ప్రస్థానంలో చెప్పుకోదగ్గ ఎన్నో మంచి పాత్రలు పోషించాను. ఇక ఇప్పుడు చేస్తున్న పాత్రలు అంటారా! వాటి గురించి నేను ఎక్కువగా మాట్లాడలేను. ఎందుకంటే... కథల్ని ఎంచుకునే తీరు ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. నేటివిటీతో పనిలేదు. సంస్కృతి, సంప్రదాయాలతో నిమిత్తం లేదు. ప్రతి సినిమాలో ఒకే తరహా పాత్రలు. ఇలాంటి సందర్భంలో సంతృప్తి కోసం వెతుక్కోవడం అమాయకత్వం. అందుకే భుక్తి కోసం నటిస్తున్నా. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు కదా. ఇంకా చేయాల్సిన పాత్రలు ఏమైనా ఉన్నాయా? సమకాలీన సమాజం నుంచి రోజుకొక కొత్త పాత్ర పుట్టుకొస్తోంది. ఆ రకంగా చూస్తే చేయాల్సిన పాత్రలు కోకొల్లలు. ఇదివరకు పౌరాణికం, జానపదం, చారిత్రకం, సాంఘికం, కౌబాయ్ ఇలా అయిదు రకాల సినిమాలుండేవి. ఇప్పుడలా కాదు. సాధ్యమైనంతవరకూ అన్నీ సమకాలీన కథాంశాలే. ఇలాంటి సందర్భాల్లోనే నటునికి పరిశీలనాత్మక దృష్టి అవసరం. రోడ్డు మీదకెళ్లి నిలబడితే... రకరకాల పాత్రలు కనిపిస్తాయి. అంతెందుకు కాసేపు అసెంబ్లీని చూడండి.. మీకు భిన్నమైన మేనరిజాలు వినిపిస్తాయి. ఇవన్నీ కొత్త కొత్త పాత్రలే. నా దృష్టిలో ప్రపంచంలో పాత్రలకు కొరత లేదు. మహానటుడు ఎస్వీఆర్ కూడా అన్ని పాత్రలూ చేయలేదు. చేయగలిగినన్ని చేసి నిష్ర్కమించారు. నేనూ అంతే. తెలుగు నేలపై ఉన్న యాసలన్నీ అనర్గళంగా మాట్లాడేస్తారు. ఎలా నేర్చుకున్నారు? నాకు ప్రతిదీ అబ్జర్వ్ చేయడం అలవాటు. అలాగే యాసలన్నీ నేర్చుకున్నాను. రాయలసీమకు చెందిన పాత్ర చేశాననుకోండి. డబ్బింగ్ థియేటర్లో, రాయలసీమకు సంబంధించిన వాళ్లను పక్కన పెట్టుకొని డబ్బింగ్ చెబుతా. అలాగే తెలంగాణ... శ్రీకాకుళం... గోదావరి.. ఇలా అన్ని మాండలికాలే. కానీ, మీరలా మాట్లాడుతుంటే మా యాసను, భాషను గేలి చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయిగా? చూడండీ... ‘ఇది నా భుక్తి’ అనుకుంటే ఫర్లేదు. కానీ.. ‘ఇది నా బిజినెస్’ అనుకుంటేనే సమస్యలన్నీ. ఈ విషయంలో నటీనటులకు వచ్చిన భయమేం లేదు. కథను బట్టి, పాత్ర చిత్రణను బట్టి మా నటన ఉంటుంది. నా వరకు నేను మాట్లాడే ఏ యాస అయినా... వినోదభరితంగా ఉంటుంది తప్ప, అవమానకరంగా ఉండదు. మెగాఫోన్ పట్టుకోవాలని ఎప్పుడూ అనిపించలేదా? ఎవడు చేసే పని వాడు చేయాలి. అనవసరపు రిస్క్ ఎందుకు? నాకు తెలిసింది నటన. అంతే. మనవళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? వాళ్లు చిన్న పిల్లలు. ఒకడు ఏడు, ఇంకొకడు మూడు చదువుతున్నారు. రావుగోపాలరావు వారసుడు కోట అంటారు చాలామంది. మరి మీ వారసుడు ఎవరంటే? మీరే చెప్పండి? మేం చెప్పలేం సార్... నేనెలా చెప్పగలను. గోపాలరావుగారి తరహా పాత్రలు నేనూ చాలా చేశాను. కానీ.. నా తరహా పాత్రలు చేసి మెప్పించే నటులు కనిపించడం లేదే! అదే నా బాధ. రావుగోపాలరావుగారితో మీ అనుబంధం ఎలా ఉండేది? అయనతో ఓ పది సినిమాల దాకా పనిచేశాను. నేనంటే ఆయనకు ఎంతో అభిమానం. ‘నీ డైలాగ్ ఫైరింజన్ గంట మోతలా ఉంటుందయ్యా..’ అనేవారు. నిజానికి ఆయన డైలాగ్ ఓ అద్భుతం. నన్ను అలా మెచ్చుకోవడం గోపాలరావుగారి సంస్కారం. ఓ సందర్భంలో ‘నాగభూషణం, రావుగోపాలరావు కలిస్తే కోట’ అని కాంప్లిమెంట్ ఇచ్చారాయన. ‘మండలాధీశుడు’లో ఎన్టీఆర్ పాత్ర చేశారు కదా. అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అదో చేదు అనుభవం. కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. కొన్ని విమర్శలు ఎదురయ్యాయి. అయితే... ఎన్టీఆర్‌గారు మహానుభావుడు. ‘బాగా నటించారు బ్రదర్’ అని అభినందించారు. ఎన్టీఆర్ గారితో నటించలేకపోవడం నా జీవితంలో ఒకే ఒక్క లోటు. ‘మేజర్ చంద్రకాంత్’లో చేయాల్సింది. కానీ.. చివరి నిమిషంలో ఆ పాత్ర పరుచూరి గోపాలకృష్ణ చేశారు. మీరు చాలామందికి ఇష్టమైన నటుడు, మరి మీకు ఇష్టమైన నటుడు? ఎస్వీరంగారావు గారు. ఆయన పేద వేషాలేసినా... ఆయనలో రాజసం కనిపిస్తుంది. దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు జనాలు. తర్వాత తరానికి దొరికిన గొప్ప నట గ్రంథాలయం ఆయన.