అప్పుడాయన నవ్విన నవ్వు ఇంకా గుర్తుంది!
‘‘నేను వ్యాఖ్యానం చేసిన పలు కార్యక్రమాలకు ఏయన్నార్ అతిథిగా వచ్చేవారు. అలా ఆయనతో కొంత పరిచయం ఏర్పడింది. అయితే, ఆ మహానటునితో బంధం బలపడింది మాత్రం ‘మట్టిమనుషులు’ సీరియల్ టైమ్‌లోనే. అందులో నేను ఆయనకు కూతురిగా చేశాను. ఆయనతో నటించడానికి భయపడుతుంటే, నాతో చనువుగా మాట్లాడి నాలోని భయాన్ని పోగొట్టారు. సెట్‌లో అక్కినేనిగారుంటే ఆ సందడే వేరు. నాపై పుత్రికావాత్సల్యాన్ని ప్రదర్శించేవారాయన. ‘తెలుగమ్మాయివి కాకపోయినా.. నీ తెలుగు చూస్తుంటే ముచ్చటేస్తుంది’ అనేవారు. అక్కినేని అన్నపూర్ణగారు కూడా నాపై ఎంతో అభిమానాన్ని చూపించేవారు. ‘నువ్వు ఫలానా ప్రోగ్రామ్‌లో... అలా చేశావ్, ఇలా చేశావ్’ అని నాకే గుర్తు చేసేవారామె. ఆ పుణ్యదంపతుల అభిమానాన్ని చూరగొనడం నా అదృష్టం.
84వ పుట్టినరోజు సందర్భంగా తొలిసారి అక్కినేనిగారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయనతో నేను అన్న తొలి మాట... ‘మీకు 84 ఏళ్లు అంటే నమ్మను’ అని. అప్పుడు ఆయన నవ్విన నవ్వు నాకింకా గుర్తుంది. ‘మా టీవీ’లో ప్రసారమైన ‘గుర్తుకొస్తున్నాయి’ కార్యక్రమం నా జీవితంలో మరచిపోలేనిది. 74 వారాల పాటు అక్కినేని జీవితాన్ని ఆవిష్కరించిన ఆ కార్యక్రమంలో ఆయన్ను ప్రశ్నలడిగే భాగ్యం నాకు దక్కింది.
నాగేశ్వరరావుగారికి పొగడ్తలంటే అస్సలు పడదు. మనుషుల్ని ఆయన చదివినట్లు ఎవరూ చదవలేరు. ఆయన జ్ఞాపకశక్తి అద్భుతం. శతాబ్దాల క్రితం జరిగిన విషయాలను కూడా నిన్ననో మొన్ననో జరిగినట్లు ఈజీగా చెప్పేసేవారు. ఏయన్నార్ ఒక్కో సినిమా ఒక్కో పాఠం. ఒక్కో మలుపు ఒక్కో సందేశం. అందులో నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి.యాదృచ్ఛికంగా ఏయన్నార్ చివరి ఇంటర్వ్యూ కూడా నేనే చేశాను. ఆయన పుట్టిన రోజు సందర్భంగా గత ఏడాది ఇదే రోజున ఆయన మనవళ్లు సుమంత్, సుశాంత్, నాగచైతన్యలతో కలిపి ఏయన్నార్‌తో చేసిన ఇంటర్వ్యూ అది. ఆ తర్వాత నెల రోజులకే ఆయనకు కేన్సర్ అన్న విషయం బయటపడింది. మళ్లీ పార్ధివ దేహాన్నే చూడగలిగాను. ఆయన భౌతికంగా లేరు కానీ.... తెలుగు సినిమా బతికున్నంత వరకూ సినిమాల రూపంలో ఎప్పుడూ మనముందే ఉంటారు’’.
సంభాషణ: బుర్రా నరసింహ