సావిత్రక్క కన్నీళ్లు పెడుతుంటే చూడలేకపోయా! | today film actress Savitri's birthday | Sakshi
Sakshi News home page

సావిత్రక్క కన్నీళ్లు పెడుతుంటే చూడలేకపోయా!

Published Fri, Dec 5 2014 10:30 PM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM

సావిత్రక్క కన్నీళ్లు పెడుతుంటే చూడలేకపోయా!

సావిత్రక్క కన్నీళ్లు పెడుతుంటే చూడలేకపోయా!

- విజయ నిర్మల
మహానటి సావిత్రి వీరాభిమానుల్లో ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల ఒకరు. సావిత్రి ప్రస్తావన వస్తే చాలు, విజయ నిర్మల పులకించిపోతారు. సావిత్రి గురించి చాలా విషయాలు విజయ నిర్మల ‘సాక్షి’కి చెప్పారు.
 
సందర్భం:
సావిత్రి జయంతి      

నన్ను ముద్దు చేసేవారు!
సావిత్రక్క అంటే చిన్నప్పట్నుంచీ నాకు ప్రాణం. ‘పాండురంగ మాహాత్మ్యం’ తర్వాత బాలనటిగా ఓ తమిళ చిత్రంలో చిన్న పాత్ర చేశాను. అందులో జెమినీ గణేశన్, సావిత్రి హీరో హీరోయిన్లు. వారిద్దరూ రైలులో వెళ్తుంటారు. నాది బిచ్చగత్తె పాత్ర. చిరిగిన గౌను వేసుకొని పాడుకుంటూ వస్తుంటా. ఆ సినిమా టైటిల్ గుర్తులేదు కానీ, అది ఓ విషాదగీతం. కథకు సింబాలిక్‌గా ఆ పాట సాహిత్యం ఉంటుంది. షాట్ గ్యాప్ వస్తే చాలు.. నన్ను దగ్గరకు తీసుకొని ముద్దు చేసేవారు సావిత్రక్క. నా పొట్ట గిల్లి.. ‘బాగా చేశావురా’ అని మెచ్చుకునేవారు. నా అభిమాన నటికి చేరువలో నేనుండటం, ఆమె మెప్పునే పొందగలగటం... ఆ క్షణాలు మరచిపోలేనివి. ఆ రోజు నుంచి ఆమెను ‘అక్క’ అనే పిలిచేదాన్ని.
 
మరపురాని అనుభవాలు...
‘విచిత్ర కుటుంబం’ సినిమా ద్వారా సావిత్రక్కకు తెరపై కూడా చెల్లెలిగా నటించే అవకాశం నాకు దక్కింది. అందులో నాది రౌడీరాణి లాంటి పాత్ర. ఎన్టీఆర్ గారేమో నా బావగారన్నమాట. ఓ సన్నివేశంలో ఆయన మారువేషంలో ఇంటికొస్తారు. మరదల్ని కాబట్టి ఆటపట్టిస్తూ... ‘ఏం పిల్లా..’ అంటూ వీపు మీద తడతారు. పాత్రలో లీనమైపోవడం వల్ల కావచ్చు... కాస్త గట్టిగా తట్టారు. అమాంతం కిందపడిపోయాను. ఆ సీన్‌లో కృష్ణగారు కూడా ఉంటారు. లొకేషన్ అంతా ఒకటే నవ్వులు. అప్పుడు సావిత్రక్కే నన్ను పైకి లేపారు. ‘అంత బలహీనంగా ఉంటే ఎలాగమ్మా... కాస్త తిను. నా లాగా ఉండాలి..’ అంటూ అనునయంగా బుజ్జగించారు. ఇలాంటి అనుభవాలు ఆమెతో చాలానే ఉన్నాయి.
 
నేను దర్శకత్వం వహించిన తొలి తెలుగు సినిమా ‘కవిత’లో నా తల్లి పాత్ర పోషించింది సావిత్రక్కే. ‘నేను డెరైక్ట్ చేస్తున్నాను’ అనగానే.. వెంటనే ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నారు. శివాజీ గణేశన్, ఎస్వీ రంగారావు లాంటి మహానటుల్నే డామినేట్ చేసే అభినయ సామర్థ్యం సావిత్రక్క సొంతం. అంతటి మహానటిని డెరైక్ట్ చేసే భాగ్యం ‘కవిత’ సినిమాతో నాకు దక్కింది. ఓ సారి ఇద్దరం అనుకోకుండా ఫ్లయిట్‌లో కలిశాం. ప్రయాణమంతా... కబుర్లే కబుర్లు, నవ్వులే నవ్వులు.

అది జరిగిన కొన్నేళ్లకు ముంబయ్‌లో అవార్డు ఫంక్షన్ అయితే... బయలు దేరాను. అనుకోకుండా అదే వేడుకకు సావిత్రక్క కూడా బయలుదేరారు. సేమ్ ఫ్లయిట్. తొలి విమాన ప్రయాణంలో ఉన్నంత జోష్... ఈ దఫా ఆమెలో కనిపించలేదు. దిగాలుగా, నీరసంగా కనిపించారు. ఇంటిపై ఇన్‌కమ్‌టాక్స్ దాడులు, దాంపత్య జీవితంలో ఒడుదొడుకులు - ఇవన్నీ ఆమెను క్రుంగదీశాయి. నాతో కన్నీటి పర్యంతం అయ్యారామె. ఆమె కన్నీరు పెడుతుంటే తట్టుకోలేకపోయాను. ముంబయ్‌లో ఇద్దరం ఒకే హోటల్లో దిగాం. కానీ, అవార్డు వేడుకకు ఆమె రాలేదు. ఆమె తరఫున నేనే అవార్డు అందుకున్నాను.
 
నా పార్వతిని సావిత్రక్క చూడలేదు!
సమయపాలన అంటే సావిత్రక్క తర్వాతే ఎవరైనా! చెప్పిన టైమ్‌కి లొకేషన్లో ఉండేవారు. నిర్మాత బాగు కోరుకునే కథానాయిక ఆమె. సావిత్రక్క కరెక్ట్ టైమ్‌కి వస్తారనే భయంతో మేము కూడా కరెక్ట్ టైమ్‌కి వచ్చేవాళ్లం. తర్వాత్తర్వాత నాక్కూడా అది అలవాటైపోయింది. నా జీవితంలో నేను చేసిన పెద్ద ఎచీవ్‌మెంట్ ‘దేవదాసు’లో పార్వతి పాత్ర. అది అక్కయ్య అనితర సాధ్యంగా పోషించిన పాత్ర. ఆ పాత్రలో ఆమెను చూశాక... మరొకర్ని ప్రేక్షకులు అంగీకరించరు. కానీ... ధైర్యం చేశాను. ఆ విషయం నేరుగా ఆమెకే చెప్పాను. ‘డెరైక్షన్ కూడా నేనే’ అని చెప్పాను. అప్పుడు నన్ను ఆమె నిరుత్సాహపరచలేదు. ‘నువ్వు చేయగలవురా! నీలో ఆ సామర్థ్యం ఉంది’ అని ప్రోత్సహించారు.
 
అయితే... నా పార్వతి పాత్రను సావిత్రక్క చూడలేదు. ఎందుకంటే... అప్పటికే ఆమె ఆరోగ్యం క్షీణదశకు చేరుకుంది. నిజంగా అది నా దురదృష్టం. ఆ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం... దేవదాసు చనిపోయాడని తెలియగానే.. పార్వతి పరుగుపరుగున వస్తూ... ఆమాంతం మెట్లపై నుంచి దొర్లుకుంటూ కింద పడిపోతుంది. ఆ సన్నివేశంలో సావిత్రక్క అభినయం ఎప్పటికీ మరచిపోలేం. ఆ స్థాయిలో చేయలేకపోయినా గొప్పగా చేయాలి, ‘విజయ నిర్మల బాగా చేసింది’ అనిపించుకోవాలనే కసితో... నటన పరంగా నాపై ఆమె ప్రభావం పడనీయకుండా... నా స్టయిల్‌లో ఆ సన్నివేశం చేశాను. దర్శకుడు ఎల్వీ ప్రసాద్ గారైతే పార్వతిగా నా అభినయం చూసి, ‘నీ అభిమానిని అయిపోయానమ్మాయి’ అన్నారు.
 
అలాంటి మహానటిని చూడలేదు!
సావిత్రక్క నటించిన చిత్రాల్లో ‘దేవదాసు’ అంటే నాకు ప్రాణం. ఇక ‘మిస్సమ్మ’ విషయానికొస్తే... అదో కొత్త కోణం. ఆ తర్వాత కూడా సాంఘికాల్లో నటిగా ఎన్నో ప్రయోగాలు చేశారామె. పౌరాణికాల విషయానికొస్తే ‘మాయాబజార్’, ‘నర్తనశాల’, ‘పాండవ వనవాసం’... ఇలా చెప్పు కుంటే చాలానే ఉన్నాయి. పౌరాణిక పాత్రల్లో సావిత్రక్క డైలాగ్ డెలివరీ అద్భుతం. అసలు అలాంటి మహానటిని మరొకరిని నేను చూడలేదు.
 
అలాంటి సహకారం ఉండుంటేనా...!
ఒక దర్శకురాలిగా చెబుతున్నా.. ‘చిన్నారి పాపలు’, ‘మాతృదేవత’ చిత్రాలను చాలా గొప్పగా తీశారు సావిత్రక్క. నటిగానే కాదు, దర్శకురాలిగా కూడా ఆమెలో లోపాలు ఎంచలేం. అయితే... సావిత్రక్కకు సరైన సహకారం లేదు. నాకు కృష్ణగారు కొండంత అండగా నిలిచారు కాబట్టే అన్ని చిత్రాలకు దర్శకత్వం చేయగలిగాను. అలాంటి సహకారం సావిత్రక్కకు కూడా ఉంటే.. గొప్ప సినిమాలు డెరైక్ట్ చేసేవారేమో! నిర్మాతగా కూడా ఆమెకు అన్నీ ఎదురుదెబ్బలే. ‘మూగమనసులు’ చిత్రాన్ని ‘ప్రాప్తం’గా తమిళంలో రీమేక్ చేస్తే... అది పరాజయం పాలైంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
 
ఆమె వైభోగాన్ని మాటల్లో వర్ణించలేం!
కెరీర్ చివరికి వచ్చేసరికి చిన్నా చితకా పాత్రలు చేశారు సావిత్రక్క. ‘నువ్వు ఇంకా గొప్ప పాత్రలు చేయగలవు అక్కా’ అని నేను ధైర్యం చెప్పబోతే.. ‘లేదురా.. ఇక నటించలేను’ అని తేల్చి చెప్పేశారు. ఎందుకంటే.. అప్పటికే ఆమె షుగర్ వ్యాధిగ్రస్థురాలయ్యారు.
 సావిత్రక్క ఎంతటి మహానటో.. అంతటి అమాయకురాలు. ప్రతి వారినీ గుడ్డిగా నమ్మేసేది. బోళా మనిషి. సున్నితమైన మనస్తత్వం. భావోద్వేగాలను అణచుకోలేని తత్వం. అతి మంచితనమే ఆమె జీవితాన్ని దెబ్బతీసింది. చివరకు అయినవారే మోసం చేశారు. ఆమె ఇంటి నిండా ఎప్పుడూ జనాలే! ఎంతమంది ఇంట్లో తింటున్నారో లెక్క ఉండేది కాదు. బీరువా తాళాలు కూడా అందుబాటులో ఉండేవి. అడిగినవారికి అడిగినంత ఇచ్చేసేది. స్టార్‌డమ్‌లో ఉండగా ఆమె వైభోగాన్ని మాటల్లో వర్ణించలేం.

మద్రాస్‌లో సావిత్రక్క ఇల్లు.. ప్యాలెస్‌లా ఉండేది. కానీ, చివరి ఘడియల్లో తమ్ముడి వరసయ్యే వ్యక్తి ఇంట్లో తలదాచుకున్నారామె. బెంగళూరులో అనారోగ్యంతో కుప్పకూలిపోతే.. ఆమెను మద్రాసుకి తరలించారు. నేను షూటింగుల ఒత్తిడి వల్ల వెళ్లలేకపోయాను. ఓ సారి వీలు కుదుర్చుకొని వెళ్లాను. ఆమెను ఆ స్థితిలో చూశాక నా హృదయం తల్లడిల్లిపోయింది. పక్కనే పాత ఫొటో ఉంచారు. మంచంపై మూడడుగుల అస్థిపంజరంలా సావిత్రక్క. అప్పటికే కోమా స్టేజ్‌లో ఉన్నారు. నాకు మాట పెగల్లేదు. గొంతు తడి ఆరిపోయింది. కూర్చోగలిగినంత సేపు కూర్చొని, కన్నీటిని దిగమింగుకొని వెళ్లిపోయాను. సినీ పరిశ్రమలో ఆమె అనుభవించినన్ని కష్టాలు ఏ నటీ అనుభవించలేదు. సావిత్రక్క జీవితం ఓ పాఠ్యాంశం. నటిగా ఎదగాలనుకునే ఏ స్త్రీ అయినా.. ఆమె స్థాయికి ఎదగాలని కోరుకోవాలి! వ్యక్తిగా ఆమెలా జీవితం ముగిసిపోకూడదని దేవుణ్ణి వేడుకోవాలి!
సంభాషణ:  బుర్రా నరసింహ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement