నగలు దొంగిలించిన బస్సు మెకానిక్ అరెస్ట్
మలక్‌పేట (హైదరాబాద్) : బస్సు ప్రయాణికుని బ్యాగులోని ఆభరణాలను అపహరించిన ఓ మోకానిక్‌ను మలక్‌పేట పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. డీఎస్పీ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన సయ్యద్ హఫీజుల్లాహ(39) నగరంలోని అత్తాపూర్‌లో నివాసం ఉంటూ కార్వాన్ మొగల్ఖాన్లో ధనుంజయ ట్రావెల్స్‌లో బస్సు మోకానిక్‌గా పనిచేస్తున్నాడు. ధనుంజయ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లింది. అక్కడ మరమ్మతులకు గురికావటంతో హఫీజుల్లాహను అక్కడికి పంపించారు. అతడు బస్సును రిపేర్ చేసి అదే బస్సులో తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నాడు.
కాగా తిరుపతిలో హైదరాబాద్‌కు చెందిన రమేష్‌రెడ్డి ఆ బస్సు ఎక్కి తన బ్యాగును డ్రైవర్ వెనుక క్యాబిన్లో ఉంచాడు. అయితే, అక్కడే పడుకున్న మోకానిక్ హఫీజుల్లాహ ఆ బ్యాగులో ఉన్న 57 గ్రాముల బంగారు నగలు, 40 గ్రాముల వెండి పట్టీలను తస్కరించాడు. రమేష్‌రెడ్డి ఇంటికి చేరుకున్న తర్వాత బ్యాగులో నగలు కనిపించలేదు. ఈనెల 17వ తేదీన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం హఫీజుల్లాహ నుంచి నగలను స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించారు.