బీఆర్టీ హద్దులను చెరిపేస్తాం: షీలాదీక్షిత్
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే బస్ రోడ్ ట్రాన్సిట్(బీఆర్టీ) కారిడార్ హద్దులను చెరిపేస్తామని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ప్రకటించారు. దక్షిణ ఢిల్లీలో ఏర్పాటు చేసిన బీఆర్టీ కారిడార్ కారణంగా స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీని కారణంగా షీలా ప్రభుత్వం అనేకసార్లు విమర్శలపాలైంది కూడా. దీంతో ఈ కారిడార్ విషయమై బుధవారం షీలాదీక్షిత్ మాట్లాడుతూ...‘ఈ కారిడార్‌ను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించలేకపోయింది. అందుకు కారణం దీనికి సమాంతరంగా మరో 14 ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టడడమే. ఆశించిన ఫలి తాలను ఈ కారిడార్ ద్వారా రాబట్టలేకపోయాము. దీంతో ఈసారి అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ కారిడార్ హద్దులను చెరిపేస్తామ’న్నారు. 2008లో ప్రారంభించిన బీఆర్టీ కారిడార్‌పై బీజేపీ మొదటి నుంచి విమర్శలు చేస్తూనే ఉంది. తాము అధికారంలోకి వస్తే బీఆర్టీ కారిడార్‌ను రద్దు చేస్తామని అవకాశం దొరికిన ప్రతిచోటా ఆ పార్టీ నేతలు హామీలు ఇస్తూనే ఉన్నారు. దీంతో కమలనాథులకంటే ఓ అడుగు ముందుకేసి తామే బీఆర్టీ హద్దులన చెరిపేస్తామని చెప్పి బీజేపీకి చెక్ పెట్టారు షీలాదీక్షిత్.