ఒకట్రెండు త్రైమాసికాలు సవాళ్లే
ముంబై: వ్యాపార ఒప్పందాల విషయంలో జాప్యం జరుగుతోందని మధ్య స్థాయి ఐటీ కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ తెలిపింది. రాబోయే ఒకట్రెండు త్రైమాసికాలు సవాళ్లు ఉంటాయని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సందీప్ కల్రా శుక్రవారం తెలిపారు. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, కోవిడ్ మహమ్మారి వంటి సవాళ్లను కంపెనీ చవిచూసిందని అన్నారు. ‘ప్రస్తుతం ఒప్పందాల ముగింపునకు ఎక్కువ సమయం పడుతోంది.
సగటు సమయం సుమారు మూడు నెలల నుండి 4–6 నెలలకు చేరింది. జూన్ త్రైమాసికంలో కొత్త ఒప్పందాల విలువ మార్చి త్రైమాసికంతో పోలిస్తే రూ.2,050 కోట్ల నుంచి రూ.1,943 కోట్లకు పడిపోయింది. అయితే ఒప్పందాల విషయమై పలు సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయి. కంపెనీ ఆదాయ వృద్ధి మార్చి త్రైమాసికంతో పోలిస్తే దాదాపు 3 శాతం క్షీణించి రూ.2,321 కోట్లకు పడిపోయింది.
నిర్ణీత సమయాల్లో మొత్తం 800 మంది ఫ్రెషర్లను బోర్డులోకి తీసుకురావడానికి కంపెనీ కట్టుబడి ఉంది. మార్చితో పోలిస్తే జూన్ క్వార్టరులో ప్రాఫిట్ మార్జిన్ 0.5 తగ్గి 14.9 శాతంగా ఉంది. నికరలాభం 8.1 శాతం ఎగసి రూ.229 కోట్లను తాకింది. కొత్తగా 240 మంది చేరికతో మొత్తం సిబ్బంది సంఖ్య జూన్ చివరినాటికి 23,130కి చేరింది. కోల్కత, కొచి్చలో నూతనంగా కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం’ అని సందీప్ వెల్లడించారు.