But
-
‘బట్’ అనే మాట ఉంది చూశారూ.. బహు కంత్రీది.. కానీ!
మనిషి మనసులోని భావాలను తెలుసుకోవడానికి భాషే మార్గం. ఆ భాషను సక్రమంగా, తెలివిగా ఉపయోగించేవాళ్లు, ఉపయోగించగలిగేవాళ్లు ఉన్నత స్థానాలకు చేరతారు. ఉపయోగించలేని వాళ్లు మామూలు మనుషులుగా మిగిలిపోతారు. భాషలో కొన్ని వేల, లక్షల పదాలుంటాయి. వాటిలో ఒక ప్రమాదకరమైన పదం ‘కానీ’. అదేంటీ... ‘కానీ’ అనే పదం ఎలా ప్రమాదకరం? అనే డౌట్ మీకు రావచ్చు. ' ఇంట్రస్టింగ్ కథనం మీకోసం.... ‘‘కానీ’’ ఒక కంత్రీ పదం.../ మీరు తెలివైనవారు, కానీ... ♦ మీ డ్రెస్ బాగుంది, కానీ (but)... ♦ మీరు బాగా పాడుతున్నారు, కానీ (but)... ♦ మీ హెయిర్ స్టైల్ బాగుంది, కానీ (but)... ♦ ఒక ఫ్రెండ్ గా మీరంటే చాలా ఇష్టం... కానీ (but)... ♦ మీ సెన్స్ ఆఫ్ హ్యూమరంటే ఇష్టం.. కానీ (but)... ♦ చంపడం, చంపించడం తప్పే... కానీ (but)... ఇలా ఎవరైనా మీతో మాట్లాడినప్పుడు మీరెలా ఫీలవుతారు? ఆ సమయంలో మీ మనసులో ఏమనిపిస్తుంది? ఈ విషయంపై మీరెప్పుడూ పెద్దగా ఆలోచించి ఉండరు. కానీ ఆ ‘కానీ’ అనే ఒక్క పదం ఆ వ్యక్తి ఇంటెన్షన్ ను పట్టిస్తుంది. అతను లేదా ఆమె నిజంగా ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పకనే చెప్పేస్తుంది. ‘కానీ’ ఒక లాండ్ మైన్... ‘కానీ’' అనే పదం ఒక లాంగ్వేజ్ ల్యాండ్ మైన్ లాంటిది. ఎందుకంటే... ఈ పదం దానికి ముందు ఉన్న వాక్యాన్ని తిరస్కరిస్తుంది. ఆ వాక్యంలో అతి ముఖ్యమైన విషయం ఆ తర్వాత వస్తుందనీ, దాన్ని అంగీకరించాలనీ చెప్తుంది. ఉదాహరణకు... ‘‘మీ డ్రెస్ బాగుంది, కానీ రెడ్ అయితే ఇంకా బాగుండేది..’’ అని ఎవరైనా చెప్పారంటే, మీ మనసు డ్రెస్ బాగుందనే విషయాన్ని తిరస్కరిస్తుంది, రెడ్ అయితే బాగుంటుందనే విషయాన్నే అంగీకరిస్తుంది. అంటే... మీ డ్రెస్ బాగుంది అని చెప్పడం అబద్ధమన్నమాట. ఆ మాట చెప్పలేక, బాగుందని చెప్పి, 'కానీ' అని సన్నాయి నొక్కులు నొక్కుతారన్నమాట. అలా తమకు కావాల్సిన, తమకు నచ్చిన అభిప్రాయాన్ని మీ మనసుపై రుద్దుతారన్నమాట. మీరు, మీ మనసు ఆ మోసాన్ని గ్రహించలేరు. అలా 'కానీ' అనే ఈ చిన్న పదం దుర్వినియోగమవుతుంది. ఎవరెలా వాడతారంటే... అనుభవజ్ఞులైన కార్పొరేట్ మేనేజర్లు గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చినప్పటికీ, ఆపై 'కానీ' జోడించడం ద్వారా ప్రభావాన్ని దెబ్బతీస్తారు. ♦ మొత్తం మీద మీ పనితీరు బాగుంది, కానీ మీరు టైం పాటించాలి. ♦ మీరు ఆ ప్రాజెక్ట్ బాగా హేండిల్ చేశారు, కానీ కొంచెం స్పీడ్ పెంచాలి. కపుల్స్ తమ జీవిత భాగస్వాములను ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పి, ఆపై 'కానీ' అనడంతో మొత్తం నాశనం చేస్తారు. ♦ ఇలా నీతో ఉండటం చాలా బాగుంది, కానీ నువ్వు శుభ్రంగా కనిపించాలి. ♦ నువ్వన్నా, నీ మాటలన్నా నాకు చాలా ఇష్టం, కానీ చాలా ఎక్కువ మాట్లాడతావు. తల్లిదండ్రులు వారి 'BUTs' ను నిర్లక్ష్యంగా ఉపయోగించడం వల్ల పిల్లల్లో ప్రతికూల స్పందనల్ని ప్రేరేపిస్తారు. ♦ నీ చేతిరాత బాగుంది, కానీ ఇంకా మార్కులు రావాలి. ♦ నీ స్పెల్లింగ్ బాగుంది, కానీ చేతిరాత బాగోలేదు. ఇలా వారు మెచ్చుకుంటున్నా, ‘కానీ’ మొత్తం అర్థాన్ని మార్చేస్తుంది. మీ మనసు ఆ 'కానీ..' ముందు ఉన్న ప్రశంసను తిరస్కరించి, దాని తర్వాత ఉన్న నెగెటివ్ నే స్వీకరిస్తుంది. 'అయితే' అనే పదం కూడా దాదాపు ఇలాంటి ప్రతికూల ప్రభావాన్నే చూపిస్తుంది. మరేం చెయ్యాలి? 'కానీ'ని 'అలాగే' అనే పదంతో భర్తీ చేయండి! ఇలా ఒక వారం రోజులు మీరు ప్రయత్నిస్తే... 'కానీ' బారినుంచి తప్పించుకోవచ్చు. ♦ ‘‘ఉద్యోగంలో మీ పనితీరు చాలా బాగుంది, కానీ మీరు టీమ్ తో కలిసిపోవాలని కోరుకుంటున్నాను...’’ అనే వాక్యానికి బదులుగా ‘‘ఉద్యోగంలో మీ పనితీరు చాలా బాగుంది, అలాగే మీరు టీమ్ తో కలిసిపోవాలని ఉండాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పండి. ♦ ‘‘మీరు చెప్పే చాలా విషయాలతో అంగీకరిస్తున్నాను, కానీ ఈ ప్రత్యేకమైన విషయాన్ని పరిశీలించమని కోరుతున్నా’’ అని చెప్పడానికి బదులుగా ‘‘మీరు చెప్పే చాలా విషయాలతో అంగీకరిస్తున్నాను, అలాగే ఈ ప్రత్యేకమైన విషయాన్ని పరిశీలించమని కోరుతున్నా’’ అని చెప్పండి. అయితే ఈ 'అలాగే' వాడకంతో కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు దీన్ని ఎక్కువగా నొక్కిచెప్పినా, దానిని ఉపయోగించటానికి ముందు, తరువాత పాజ్ చేసినా, ఇది 'కానీ'లాంటి దుష్ప్రభావాన్నే చూపిస్తుంది. ‘కానీ’ ఉపయోగించాల్సిన పద్ధతి వాస్తవానికి, 'కానీ' అనే పదం ఎదుటి వ్యక్తి ఆలోచనను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుంటే దాన్ని ఉపయోగించడంలో తప్పేమీ లేదు. అందువల్ల నెగెటివ్ విషయం స్థానంలో పాజిటివ్ ప్రత్యామ్నాయాన్ని నొక్కి చెప్పేటప్పుడు ఉపయోగించండి. ఉదాహరణకు... ♦ ‘‘మనం ఈ ప్రాజెక్టులో కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటున్నాము, కానీ మనం విజయం సాధించగలమని నాకు తెలుసు.’’ ♦ ‘‘మనం పూర్తిగా ఫెయిలయ్యాం, కానీ మన తప్పుల నుండి నేర్చుకొని ముందుకు సాగాలి.’’ ఇలా చెప్పినప్పుడు మనసు ఆ వాక్యాల్లోని మొదటి భాగాన్నిన తిరస్కరించి, ‘కానీ’ తర్వాతి భాగాన్ని స్వీకరిస్తుంది. మీరు చెప్పాలనుకున్నది నేరుగా వారి మనసును చేరుతుంది. కాబట్టి మీ 'కానీ' ఎక్కడుందో, ఎలా ఉపయోగిస్తున్నారో గమనించుకోండి. 'కానీ' ఉపయోగం గురించి బాగా తెలుసుకోవడం ద్వారా, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించడం ద్వారా, 'అలాగే' తో భర్తీ చేయడం ద్వారా మీరు కోరుకున్న ఫలితాలు సాధించండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. -సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 -
‘వెస్ట్’లో సమస్యల కూత!
70 ఎకరాల స్థలం ఉన్నా అభివృద్ధికి నోచుకోని వైనం ఉపయోగం లేని కొళాయిలు మూతపడ్డ మరుగుదొడ్లు తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: తిరుపతి మెయిన్ రైల్వేస్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న వెస్ట్ రైల్వేస్టేషన్ ఏళ్ల తరబడి సమస్యల కూత పెడుతోంది. ఈ స్టేషన్ పరిధిలో సుమారు 70 ఎకరాల రైల్వే స్థలం ఉన్నా వినియోగించుకోవడం లేదు. ఫలితంగా మెయిన్ రైల్వేస్టేషన్లో నిత్యం రద్దీతో ప్రయాణికులు, రైల్వే ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. తిరుపతి నుంచి బెంగళూరు, కేరళ, మైసూర్, వేలూరు, కోయంబ త్తూరు, ధర్మవరం, గుంతకల్, పాకాల మీదుగా సికిం ద్రాబాద్, మహారాష్ట్రలోని అమరావతికి రైళ్లన్నీ ఈ స్టేషన్ మీదుగా వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టేషన్ పరిధిలోని 70 ఎకరాల ఖాళీ స్థలంలో మరిన్ని ప్లాట్‌ఫారాలు నిర్మిస్తే ఎంతో సౌకర్యంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ స్థలాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే రైళ్ల రాకపోకల కోసం 3 ప్లాట్‌ఫారాలు, రైలు బండ్ల నిర్వహణ కోసం మరో 3 పిట్లైన్లను నిర్మించుకునే వెసలుబాటు ఉంటుందని స్థానిక ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. దీంతో నిత్యం వేలాది మంది ప్రయాణికులకు సేవలు అందించాల్సిన వెస్ట్ రైల్వేస్టేషన్ రాత్రి వేళల్లో అనామకులకు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిపోయింది. రెండు లక్షల మంది.. 80 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ స్టేషన్ పరిధిలో ఇప్పుడు సుమారు 2 లక్షల మందికి పైగా జనాభా ఉంటున్నారు. ముఖ్యంగా అన్ని యూనివర్సిటీలు, బాలాజీ కాలనీ, ఎల్బీనగర్, ముత్యాలరెడ్డిపల్లె, పేరూరు, రూరల్ మండలంలోని అనేక గ్రామాలకు చెందినవారంతా రైలు ప్రయాణం చేయాలంటే వెస్ట్ రైల్వేస్టేషన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ ఈ స్టేషన్లో ప్రస్తుతానికి ఒకటి రెండు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు మినహా మిగిలిన రైళ్లేవీ ఆగడం లేదు. ఆ కారణంగా ఈ స్టేషన్ పరిధిలోని లక్షలాది జనం మెయిన్ రైల్వేస్టేషన్‌కు వెళుతున్నారు. దీంతో అక్కడ రద్దీ పెరుగుతోంది. ఉపయోగం లేని కొళాయిలు.. ఇక్కడ తాగునీటి కోసం ఏర్పాటు చేసిన కొళాయిలు పాడైపోయాయి. వాటికి నిర్మించిన సిమెంట్ దిమ్మెలు పగుళ్లు విడిచి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొళాయిల సింకుల్లో వ్యర్థాలు ఉన్నాయి. స్టేషన్‌లోని ప్లాట్ఫారానికి పడమటివైపు అమర్చిన ప్లాస్టిక్ సింథటిక్ ట్యాంకు కూడా దుస్థితికి చేరుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన మరుగుదొడ్లకు ఇనుప ఊచలు బిగించి మూతవేశారు. ఇక్కడ దుర్గంధం వెదజల్లుతోంది. భద్రతపై అనుమానాలు వెస్ట్ రైల్వేస్టేషన్ ఆలనాపాలనా గురించి ఓవైపు అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారులు పట్టించుకోకపోవడమే కాకుండా రైల్వేశాఖ పరిధిలోని రెండు విభాగాల భద్రతాధికారులు, సిబ్బంది సైతం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ కారణంగా స్టేషన్ భద్రతపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. తమిళనాడుకు చెందిన వేలాది మంది తిరుమల యాత్రికులు అలిపిరి మార్గంలో పాదయాత్రగా వెళ్లేందుకు ఈ స్టేషన్లో దిగుతుంటారు. అలాంటప్పుడు ఈ స్టేషన్లో కనీసం తనిఖీలు చేసేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా రైల్వే పోలీసులు ఉండడం లేదు. శ్రీవారి దయవల్ల ఇప్పటి వరకూ ఎలాంటి ప్రమాదాలు జరగలేదు... కానీ భద్రతా సిబ్బంది డొల్లతనాన్ని గమనించి ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే దిక్కెవరు? అని స్థానికులు ఆందోళనచెందుతున్నారు. సమయపాలన లేని బుకింగ్ కౌంటర్లు ఈ స్టేషన్‌లోని బుకింగ్ కౌంటర్లలో సిబ్బంది ఎప్పు డు అందుబాటులో ఉంటారో తెలియదు. టికెట్ల జారీ కోసం ప్రైవేటు ఏజెన్సీకి బాధ్యతలు ఇచ్చారు. నిర్వాహకులు రోజూ కొటాల నుంచి రావాల్సి ఉండడంతో సమయపాలన పాటించడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. దాంతో టికెట్ల రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కూడా రైల్వే కోల్పోతోంది. టికెట్లు ఇచ్చే వారు ఉండకపోవడంతో ఈ స్టేషన్ నుంచి ప్రయాణించే ప్రతి ఒక్కరూ టికెట్లు లేకనే రైళ్లలో ప్రయాణిస్తూ టీసీల ద్వారా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇకనైనా సంబంధిత రైల్వే ఉన్నతాధికారులు స్పందించి వెస్ట్ రైల్వేస్టేషన్‌లోని సమస్యలను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
మహిళల స్వీయ చరిత్రలు.. సామాజిక దర్పణాలు
కేయూ క్యాంపస్, న్యూస్‌ైలైన్ : మహిళల స్వీయ చరిత్రలు..సామాజిక దర్పణాలని కేయూ వీసీ ప్రొఫెసర్ బి.వెంకటరత్నం అభివర్ణించారు. ‘భారత దేశంలో మహిళల స్వీయ చరిత్రలు’ అంశంపై కేయూ సెనేట్హాల్లో శనివారం రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఆంగ్ల విభాగం నిర్వహిస్తున్న ఈ సదస్సును వీసీ ప్రారంభించి మాట్లాడారు. మహిళల స్వీయరచనల్లో సామాజిక కట్టుబాట్లు, మానవ సంబంధాలు, కుటుంబ నేపథ్యం, ఆర్థిక ఒడిదుడుకులు కళ్లకు కట్టినట్లు ప్రతి బింబిస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తన తల్లి కుటుంబాన్ని నడిపిన నేపథ్యాన్ని, తన అనుభవాన్ని వివరించారు. హైదరాబాద్ ఇంగ్లిష్, ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ రిటైర్డు ప్రొఫెసర్ సుషిథారు కీలకోపన్యాసం చేశారు. 19వ శతాబ్దం లోనే భారతదేశంలో మహిళలు స్వీయచరిత్రలు రాసుకోవడం కొత్త సాహిత్య ప్రక్రియ అని వివరిం చారు. బుద్ధుడి కాలంలోనే మహిళలు తమ ఆలోచన విధానాన్ని తెలిపారని వివరించారు. సామాజిక కట్టుబాట్ల సంకెళ్లను తెంచుకుని తమ ఆలోచన విధానాన్ని వ్యక్తీకరించడం విప్లవాత్మక పరిణామమ న్నారు. ఈ దశలో కమలాదాస్, నయనతార సెహగల్, శోభాడే, మృణాల్ పాండే, బేబీ కాంబ్లే స్వీయ జీవిత చరిత్రలు నూతన ఆలోచనలు రేకెత్తించాయని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నల్లగొండ జిల్లా మహిళల పాత్ర కూడా ఎక్కువగా ఉందని వివరించారు. కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్.లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ఉన్నతవర్గాల మహిళల జీవిత చరిత్రలు ఎక్కువగా రాజకీయాల వంటి విషయాలతో కూడుకున్నాయని, దిగువ తరగతి మహిళల రచనల్లో ఎక్కువగా మానవ సంబంధాలు, కుటుంబ నేపథ్యం గోచరి స్తుందన్నారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రామస్వామి మాట్లాడుతూ మహిళల మానసిక సంఘర్షణ స్వీయ రచన ల్లో కనిపిస్తాయని అన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన కేయూ ఇంగ్లిష్ విభాగం అధిపతి ప్రొఫెసర్ కె.పురుషోత్తం మాట్లాడుతూ భారతదేశంలో కూడా స్వీయ చరిత్రలున్నాయని, వాటిని పరిశోధనల ద్వారా వెలికి తీయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా తమ విభాగంలో నలుగురు పరిశోధనలు కూడా చేస్తున్నారని, అందుకే ఇక్కడ సదస్సు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా కేయూ జర్నల్ ఆఫ్ ఇంగ్లిష్ స్టడీస్‌ను వీసీ వెంకటరత్నం, ప్రొఫెసర్ పురుషోత్తం రాసిన బ్లాక్లియస్ పుస్తకాన్ని వీసీ వెంకటరత్నం, సుషిథారు ఆవిష్కరించారు. సదస్సులో క్యాంపస్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కె.దామోదర్‌రావు, ఆర్ట్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.రాజగోపాలాచారి, ప్రొఫెసర్ ఎం.రాజేశ్వర్, ప్రొఫెసర్ పి.శైలజ, ప్రొఫెసర్ వి.శ్రీనివాస్ పాల్గొన్నారు.