- 70 ఎకరాల స్థలం ఉన్నా అభివృద్ధికి నోచుకోని వైనం
- ఉపయోగం లేని కొళాయిలు
- మూతపడ్డ మరుగుదొడ్లు
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: తిరుపతి మెయిన్ రైల్వేస్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న వెస్ట్ రైల్వేస్టేషన్ ఏళ్ల తరబడి సమస్యల కూత పెడుతోంది. ఈ స్టేషన్ పరిధిలో సుమారు 70 ఎకరాల రైల్వే స్థలం ఉన్నా వినియోగించుకోవడం లేదు. ఫలితంగా మెయిన్ రైల్వేస్టేషన్‌లో నిత్యం రద్దీతో ప్రయాణికులు, రైల్వే ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. తిరుపతి నుంచి బెంగళూరు, కేరళ, మైసూర్, వేలూరు, కోయంబ త్తూరు, ధర్మవరం, గుంతకల్, పాకాల మీదుగా సికిం ద్రాబాద్, మహారాష్ట్రలోని అమరావతికి రైళ్లన్నీ ఈ స్టేషన్ మీదుగా వెళ్తున్నాయి.
ఈ నేపథ్యంలో స్టేషన్ పరిధిలోని 70 ఎకరాల ఖాళీ స్థలంలో మరిన్ని ప్లాట్‌ఫారాలు నిర్మిస్తే ఎంతో సౌకర్యంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ స్థలాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే రైళ్ల రాకపోకల కోసం 3 ప్లాట్‌ఫారాలు, రైలు బండ్ల నిర్వహణ కోసం మరో 3 పిట్‌లైన్లను నిర్మించుకునే వెసలుబాటు ఉంటుందని స్థానిక ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. దీంతో నిత్యం వేలాది మంది ప్రయాణికులకు సేవలు అందించాల్సిన వెస్ట్ రైల్వేస్టేషన్ రాత్రి వేళల్లో అనామకులకు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిపోయింది.
రెండు లక్షల మంది..
80 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ స్టేషన్ పరిధిలో ఇప్పుడు సుమారు 2 లక్షల మందికి పైగా జనాభా ఉంటున్నారు. ముఖ్యంగా అన్ని యూనివర్సిటీలు, బాలాజీ కాలనీ, ఎల్‌బీనగర్, ముత్యాలరెడ్డిపల్లె, పేరూరు, రూరల్ మండలంలోని అనేక గ్రామాలకు చెందినవారంతా రైలు ప్రయాణం చేయాలంటే వెస్ట్ రైల్వేస్టేషన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ ఈ స్టేషన్‌లో ప్రస్తుతానికి ఒకటి రెండు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు మినహా మిగిలిన రైళ్లేవీ ఆగడం లేదు. ఆ కారణంగా ఈ స్టేషన్ పరిధిలోని లక్షలాది జనం మెయిన్ రైల్వేస్టేషన్‌కు వెళుతున్నారు. దీంతో అక్కడ రద్దీ పెరుగుతోంది.
ఉపయోగం లేని కొళాయిలు..
ఇక్కడ తాగునీటి కోసం ఏర్పాటు చేసిన కొళాయిలు పాడైపోయాయి. వాటికి నిర్మించిన సిమెంట్ దిమ్మెలు పగుళ్లు విడిచి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొళాయిల సింకుల్లో వ్యర్థాలు ఉన్నాయి. స్టేషన్‌లోని ప్లాట్‌ఫారానికి పడమటివైపు అమర్చిన ప్లాస్టిక్ సింథటిక్ ట్యాంకు కూడా దుస్థితికి చేరుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన మరుగుదొడ్లకు ఇనుప ఊచలు బిగించి మూతవేశారు. ఇక్కడ దుర్గంధం వెదజల్లుతోంది.
భద్రతపై అనుమానాలు
వెస్ట్ రైల్వేస్టేషన్ ఆలనాపాలనా గురించి ఓవైపు అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారులు పట్టించుకోకపోవడమే కాకుండా రైల్వేశాఖ పరిధిలోని రెండు విభాగాల భద్రతాధికారులు, సిబ్బంది సైతం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ కారణంగా స్టేషన్ భద్రతపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. తమిళనాడుకు చెందిన వేలాది మంది తిరుమల యాత్రికులు అలిపిరి మార్గంలో పాదయాత్రగా వెళ్లేందుకు ఈ స్టేషన్‌లో దిగుతుంటారు. అలాంటప్పుడు ఈ స్టేషన్‌లో కనీసం తనిఖీలు చేసేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా రైల్వే పోలీసులు ఉండడం లేదు. శ్రీవారి దయవల్ల ఇప్పటి వరకూ ఎలాంటి ప్రమాదాలు జరగలేదు... కానీ భద్రతా సిబ్బంది డొల్లతనాన్ని గమనించి ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే దిక్కెవరు? అని స్థానికులు ఆందోళనచెందుతున్నారు.
సమయపాలన లేని బుకింగ్ కౌంటర్లు
ఈ స్టేషన్‌లోని బుకింగ్ కౌంటర్లలో సిబ్బంది ఎప్పు డు అందుబాటులో ఉంటారో తెలియదు. టికెట్ల జారీ కోసం ప్రైవేటు ఏజెన్సీకి బాధ్యతలు ఇచ్చారు. నిర్వాహకులు రోజూ కొటాల నుంచి రావాల్సి ఉండడంతో సమయపాలన పాటించడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. దాంతో టికెట్ల రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కూడా రైల్వే కోల్పోతోంది. టికెట్లు ఇచ్చే వారు ఉండకపోవడంతో ఈ స్టేషన్ నుంచి ప్రయాణించే ప్రతి ఒక్కరూ టికెట్లు లేకనే రైళ్లలో ప్రయాణిస్తూ టీసీల ద్వారా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇకనైనా సంబంధిత రైల్వే ఉన్నతాధికారులు స్పందించి వెస్ట్ రైల్వేస్టేషన్‌లోని సమస్యలను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.