సాప్ట్ బ్యాంకు చేతికి యూకే చిప్ డిజైనర్
బ్రిటీష్ చిప్ డిజైనర్ ఏఆర్ఎమ్ హోల్డింగ్స్ ను జపనీస్ మల్టీనేషనల్ టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ ఆపరేషన్ల దిగ్గజం సాప్ట్ బ్యాంకు గ్రూప్ కార్పొరేషన్ కొనుగోలు చేయనుంది. దాదాపు 32 బిలియన్ డాలర్లకు (రెండు లక్షల కోట్లకు పైగా) ఈ డీల్ కుదిరినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఈ డీల్ కుదిరితే, యూరోపియన్ టెక్నాలజీలో ఇదే అదిపెద్ద డీల్ అని అధికార వర్గాలు చెబుతున్నాయి.. 2013లో వైర్ లెస్ ఆపరేటర్ స్ప్రింట్ నుంచి కంట్రోలింగ్ స్టేక్ ను 22 బిలియన్ డాలర్లకు(దాదాపు రూ.1,50,000కోట్లకు) సాప్ట్ బ్యాంకు కొనుగోలు చేసింది. అయితే ఈ డీల్ పై సాప్ట్ బ్యాంకు వెంటనే స్పందించలేదు. ఏఆర్ఎమ్ అధికారులు సైతం మార్కెట్ అవర్స్ లో దీన్ని ధృవీకరించలేదు.
ఏఆర్ఎమ్.. లండన్ లో అత్యంత విలువైన టెక్ కంపెనీ. మొబైల్ ప్రాసెసింగ్ లో ఎక్కువగా తన కార్యకలాపాలు సాగిస్తుంటోంది. శాంసంగ్, హ్యువాయ్, యాపిల్ వంటి స్మార్ట్ ఫోన్ సంస్థలు, తమ ఇన్ హోస్ డిజైన్డ్ మైక్రోచిప్స్ లో ఈ కంపెనీ ప్రాసెసర్ ను, గ్రాఫిక్స్ వాడుతుంటాయి.
సాప్ట్ బ్యాంకు తన ఆస్తులను అమ్ముతూ 14 బిలియన్ డాలర్లను(రూ.93,934 కోట్లకు పైగా) సమీకరించే యోచనలో ఉన్నట్టు గత కొన్ని వారాలుగా ప్రకటిస్తూ వస్తోంది. ఈ ఆస్తులో చైనీస్ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా షేర్లు కూడా ఉన్నట్టు తెలిపింది. అయితే ఇలా సమీకరించిన నగదును రుణసామర్థ్యాన్ని తగ్గించుకోవడానికి వాడతారని మార్కెట్ విశ్లేషకులు అంచనావేశారు. లేదా తన సొంత షేర్లను తిరిగి కొనుగోలు(బైబ్యాక్) చేయడానికి ఉపయోగిస్తుందని భావించారు. వీరి అంచనాలకు తారుమారుగా ఈ జపనీస్ దిగ్గజం, బ్రిటీష్ చిప్ డిజైనర్ ను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటన వెలువడింది.
ఈ డీల్ కింద ఒక్క ఏఆర్ఎమ్ షేరుకు సాప్ట్ బ్యాంకు 17 పౌండ్లను నగదు రూపంలో అందించనుందని ఫైనాన్సియల్ టైమ్స్ నివేదించింది. ఇది శుక్రవారం ట్రేడింగ్ కు 40శాతం ప్రీమియమని తెలిపింది. మరోవైపు సోమవారం జపాన్ మార్కెట్ కు సెలవు.