టీసీఎస్ సీఈవోగా చివరి రోజు...బిగ్ అనౌన్స్మెంట్
ముంబై : దేశంలోనే అతిపెద్ద ఐటీ అగ్రగామిగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)కు ఇన్నిరోజులు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న నటరాజన్ చంద్రశేఖరన్ మంగళవారం తన పదవి నుంచి దిగిపోతున్నారు. ఈ కీలకమైన బాధ్యతల నుంచి వైదొలుగుతున్న సమయంలో ఓ బిగ్ అనౌన్స్‌మెంట్‌తో ఇన్వెస్టర్ల ముందుకు వెళ్లబోతున్నారు. షేర్ల బైబ్యాక్ ప్రకటనను నేడు చంద్రశేఖరన్ ప్రకటించనున్నారు. బైబ్యాక్ ప్రతిపాదనపై నేడు భేటీ అవుతున్న టీసీఎస్ బోర్డు, ఇందుకోసం ఎంతమొత్తాన్ని వెచ్చించాలి, ఎన్ని షేర్లను బైబ్యాక్ రూపంలో కొనుగోలు చేయాలన్న దానిపై చర్చించనుంది.
ఈ బిగ్ అనౌన్స్మెంట్ అనంతరం ఎన్. చంద్రశేఖరన్ తన బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోనున్నారు. ఆయన పదవి స్థానంలో రాజేష్ గోపినాథ్‌ను టీసీఎస్ బోర్డు నియమించింది. కాగా, టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన తర్వాత, గ్రూప్‌కు తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటా వ్యవహరించారు. అనంతరం టాటా సన్స్ కొత్త చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ ను నియమించారు. కుప్పలు తెప్పలుగా ఉన్న నగదు నిల్వలను ఇన్వెస్టర్లకు పంపిణీ చేసి వారిని శాంతింపజేయాలనే నేపథ్యంలో టీసీఎస్ బైబ్యాక్ ప్రతిపాదనను బోర్డు ముందుకు తీసుకొచ్చింది. మరోవైపు ఇన్ఫోసిస్ కూడా దీనికోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.