విప్రో బైబ్యాక్ ప్రపోజల్.. షేర్లు రయ్రయ్
ముంబై: టెక్ దిగ్గజం విప్రో సోమవారం మార్కెట్లో రయ్రయ్మని పరుగులు పెట్టింది. సోమవారం ట్రేడింగ్లో 5 శాతం పైగా జంప్చేసిన కంపెనీ షేర్లు, 2015 జనవరి 19 తర్వాత అతిపెద్ద ఇంట్రాడే స్థాయిలను నమోదుచేశాయి. ఈ షేర్ల ఇంతలా దూసుకెళ్లడానికి ప్రధాన కారణం జూలై 20న నిర్వహించబోయే బోర్డు మీటింగ్లో కంపెనీ షేర్ బైబ్యాక్ ప్రతిపాదనను తీసుకురానున్నదని తెలియడమే. అయితే కంపెనీ ఎంత మొత్తంలో షేర్ల బైబ్యాక్ చేపట్టనుంది, ఏ ధరకు ఈ బైబ్యాక్ ఆఫర్ ప్రకటించనుంది అనేది ఇంకా స్పష్టంకాలేదు. కంపెనీ కూడా షేర్ల బైబ్యాక్ వివరాలను ప్రకటించలేదు. కానీ ఈ ఏడాది మొదట్లో వచ్చిన రిపోర్టుల ప్రకారం విప్రో బైబ్యాక్ సైజు రూ.2500 కోట్ల మేర ఉంటుందని తెలిసింది. కాగ, సోమవారం ట్రేడింగ్లో కంపెనీ షేర్లు రూ.273.9 వద్ద గరిష్టస్థాయిలను నమోదుచేసి 5.54 శాతం పైకి ఎగిశాయి.
2017 మార్చి వరకు కంపెనీ వద్ద నగదు, నగదుకు సంబంధించిన మొత్తం రూ.5,271 కోట్లు ఉన్నాయని తెలిసింది. విప్రో బీఎస్ఈకి సమర్పించిన నివేదికలో, ఈక్విటీ షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనపై 2017 జూలై 20న జరుగనున్న బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకోనున్నామని తెలిపింది. కంపెనీ బోర్డు మీటింగ్ జూలై 19, జూలై 20 తేదీల్లో జరుగనుంది. దీనిలో ప్రధాన అజెండా 2017-18కి సంబంధించి కంపెనీ తొలి క్వార్టర్ ఫలితాలను ప్రకటించడమే. అంతేకాక షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనపై కూడా కంపెనీ ఓ ప్రకటన చేయనుంది. 2017 జూన్లో విప్రో విజయవంతంగా 1:1 నిష్ఫత్తిలో బోనస్ షేర్ల ఇష్యూను ముగించింది. ఒకవేళ ప్రతిపాదించిన బైబ్యాక్ ఆమోదయోగ్యమైతే, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ బైబ్యాక్ ఆఫర్లలో విప్రో కూడా వచ్చి చేరనుంది. ఇన్ఫోసిస్ 13వేల కోట్ల మేర నగదును బైబ్యాక్, డివిడెండ్ రూపంలో ఇన్వెస్టర్లకు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.