కష్టపడి కాదు.. ఇష్టపడి చదవండి
వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ బీవీ పట్టాభిరామ్
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ప్రతి విద్యార్థి తాను ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే దిశగా సరైన ప్రణాళికతో సాధన చేయాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ బీవీ పట్టాభిరామ్ అన్నారు. కష్టపడి చదివేస్తున్నామనే భావాన్ని తొలగించుకుని, ఇష్టపడి చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. అలాగే నెగెటివ్ దృ క్పథాన్ని విడనాడి పాజిటివ్ దృ క్పథంతో ఆలోచించాలన్నారు. వ్యక్తిత్వ వికాసంపై ఆదికవి నన్నయ యూనివర్సిటీలో సోమవారం శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను కూడా భాగస్వాములను చేస్తూ, ప్రతిభ కనబర్చినవారికి ప్రోత్సాహక బహుమతులు కూడా అందజేశారు.
ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ, విద్యతోపాటు సరైన నైపుణ్యాలుంటే ఉద్యోగావకాశాలు వెతుక్కుంటూ వస్తాయన్నారు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకునే దిశగా నిరంతరం ప్రయత్నం చేయండి అంటూ ఏబీసీడీఈఎఫ్జీ వంటి టñ క్నిక్లను ఉదాహరణలతో వివరించారు. విజయం సాధించాలంటే ప్యాకేజ్ అవసరమంటూ ‘ప్యాకేజ్’లోని అక్షరాలను తెలియజేశారు. ఎవరిలాగానో ఉండాలనుకోవడం సరికాదన్నారు. ప్రతి మనిషిలోనూ ఏవో కొన్ని లోపాలు కూడా ఉంటాయన్నారు. లోపాలను గుర్తు చేసుకుంటూ కుంగిపోకుండా ఉన్న వాటితోనే ముందుకు వెళ్లాలనే దృ క్పథంతో పయనించాలన్నారు. నేడు ప్రపంచంలో గొప్పవాళ్లుగా చెప్పుకుంటున్న ఎంతోమంది ఒకప్పుడు సామాన్యులేనంటూ మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కలామ్‌ని ఉదహరించారు. విజయం సాధించాలంటే ప్లేస్‌ని వదిలేయాలన్నారు. అమెరికాలో 38 శాతం వైద్యులు, 36 శాతం నాసాలోని శాస్త్రవేత్తలు, 29 శాతం ఆచార్యులు భారతీయులేననే విషయాన్ని గ్రహించాలన్నారు. వీరందరినీ ఆదర్శంగా తీసుకుని విజయం వైపు పయనించాలన్నారు.
సుమారు మూడు గంటలపాటు జరిగిన ఈ శిక్షణా కార్యక్రమంలో స్వతహాగా మెజీషియన్ అయిన ఆయన మధ్యమధ్యలో కొన్ని మ్యాజిక్‌లు చేస్తూ విద్యార్థులను ఆద్యంతం ఆకట్టుకున్నారు. విద్యార్థులు ఆంగ్లం నేర్చుకోవడానికి భయపడవలసిన పని లేదని, డాక్టర్ పట్టాభిరామ్ ఉపన్యాసం వింటే కొండంత ధైర్యం వస్తుందని యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్‌ను దుశ్శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహుకరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎ.నరసింహరావు, ప్రిన్సిపాల్స్ డాక్టర్ కేఎస్ రమేష్, డాక్టర్ పి.సురేష్‌వర్మ, డాక్టర్ మట్టారెడ్డి, స్టూడెంట్ అఫైర్స్ డీన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.