కడపలో విద్యార్థినుల మృతిపై నిష్పాక్షిక దర్యాప్తు
కడప : కడప నగరంలోని నారాయణ ప్రైవేట్ కళాశాలలో ఇద్దరు విద్యార్థినుల మృతి ఘటనపై విచారణాధికారులను నియమించినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ బి.వి. రమణకుమార్ వెల్లడించారు. ఈ కేసులో విచారణాధికారులుగా ప్రొద్దుటూరు డీఎస్పీ పూజితా నీలం, స్పెషల్ పోలీస్ బెటాలియన్ డీఎస్పీ సుధాకర్ వ్యవహరిస్తారని తెలిపారు. బుధవారం కడపలో రమణకుమార్ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
విద్యార్థినుల మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆయన వివరించారు. విద్యార్థినుల మృతదేహాలపై ఎటువంటి గాయాలు లేవని చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వస్తే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. విద్యార్థులు రక్తంతో రాసినట్లు చెప్పబడుతున్న లేఖను డీఎన్ఏ టెస్ట్‌కు పంపామని... అలాగే విద్యార్థినుల సూసైడ్ నోట్‌ను కూడా పరీక్షల కోసం ఫోరెన్సిక్ లేబ్‌కు పంపినట్లు చెప్పారు.
విద్యార్థినుల మృతిపై ఎవరైనా సమాచారం ఇవ్వాలంటే 9440796935 ఈ సెల్ నెంబర్‌కు ఫోన్ చేయవచ్చని సూచించారు. పోలీసుల విచారణపై ఎలాంటి అనుమానాలు అక్కరలేదని... ఈ కేసు నిష్పాక్షిక దర్యాప్తు చేస్తామని ఈ సందర్భంగా రమణకుమార్ తెలిపారు. మృతి చెందిన విద్యార్థినుల ఫ్రెండ్స్‌తో పాటు రూమ్మేట్స్, అధ్యాపకులు, కళాశాల యాజమాన్యం అందర్నీ విచారిస్తామని ఆయన వివరించారు.