అగస్టా దెబ్బకు మరో వికెట్ పడింది!!
అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్లు కొనాలని ఏ ముహూర్తంలో నిర్ణయించారో గానీ.. ఆ ఒప్పందం వరుసపెట్టి గవర్నర్లను బలిగొంటూనే ఉంది. నిన్న కాక మొన్న సీబీఐ ప్రశ్నించడంతో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ రాజీనామా చేయగా.. తాజాగా గోవా గవర్నర్ బీవీ వాంఛూ కూడా తన పదవిని వదులుకున్నారు.
వీవీఐపీల కోసం 12 అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్లను కొనుగోలు చేసే ఒప్పందంలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో.. ఆ కేసును సీబీఐ విచారణకు చేపట్టింది. ఈ కేసులో వాంఛూను సాక్షిగా సీబీఐ విచారించింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన వాంఛూ కాంగ్రెస్ అగ్రనేతల కుటుంబానికి సన్నిహితునిగా పేరొందారు. అప్పట్లో ఆయన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)కి అధినేతగా ఉండేవారు.ఇది ప్రధాని, మాజీ ప్రధానులు, వారి కుటుంబాలకు భద్రత కల్పిస్తుంది. ఈ హోదాలో వాంఛూ కూడా హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో భాగం పంచుకున్నారు.