మా మద్దతు శిల్పాకే
► ఆత్మీయ సమావేశంలో ప్రకటించిన ఆర్యవైశ్యులు
► వైఎస్ జగన్, శిల్పా సోదరులతో సహా ప్రముఖుల హాజరు
► వైశ్యులకు వైఎస్ఆర్ ఎంతో మేలు చేశారని ప్రశంసలు
► కార్పొరేషన్ ఏర్పాటు హామీపై జగన్‌కు అభినందనలు
సాక్షి బృందం, నంద్యాల : నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి తామంతా మద్దతునిస్తున్నట్లు నంద్యాల పట్టణ ఆర్యవైశ్యులు ప్రకటించారు. శనివారం నంద్యాల టౌన్ హోలులో నిర్వహించిన ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో వైశ్యులు ఈ మేరకు నిర్ణయించారు. దాల్మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు నెరవాటి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి, ఆయన సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ హయాంలో ఏ సమస్య వచ్చినా నేరుగా ఆయనకు చెప్పుకొని పరిష్కారం పొందేవాళ్లమని గుర్తు చేశారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించడం అభినందనీయమన్నారు. దీంతో నంద్యాలతో పాటు 13 జిల్లాల్లో ఉన్న ప్రతి ఆర్యవైశ్యుడూ సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. పీఏసీ సభ్యుడు గుబ్బా చంద్రశేఖర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ఎంతో మేలు చేశారని, అదే బాటలో అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించడం అభినందనీయమన్నారు.
పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ మాజీ సీఎం కె.రోశయ్య 2009 ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారని గుర్తు చేశారు. ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మూడేన్నరేళ్ల నుంచి తిరుగున్నా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించడం అభినందనీయమన్నారు. ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో కార్యక్రమం అనంతరం వైఎస్ జగన్‌ను పెద్ద పూల మాలలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అత్కూరి ఆంజనేయులు, కార్యదర్శి మిట్టపల్లి రమేష్, అధికార ప్రతినిధి రేపాల శ్రీనివాస్, సుబ్బ లక్ష్మయ్య, స్థానిక నాయకులు గంగిశెట్టి శ్రీధర్, మాఘం రఘు, అయ్యపుశెట్టి సుబ్రహ్మణ్యం, సుబ్బా రామయ్య, రమేష్, రాజేష్, మహేష్, వస్త్ర వ్యాపారస్తుల సంఘం నాయకులు మేడం సుబ్బలక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్యుల మేలు కోరే వ్యక్తిని
ఆర్యవైశ్యులంటే నాకెంతో అభిమానం. 1982 నుంచి నా వ్యాపార, రాజకీయ ఎదుగుదలకు సహకరించిన వారిలో ఆర్యవైశ్యులే ఎక్కువ. ఇప్పటి వరకు ఏ వ్యాపారస్తుడికీ చిన్న కీడు కూడా చేయలేదు. వారి నుంచి వచ్చిన విన్నపాల మేరకే, ఆర్యవైశ్యుల వ్యాపారం కోసం 29 ప్రాంతాల్లో ఉన్న శిల్పా దుకాణాలను తొలగించాం. ఎంతో మంది నిరుపేద ఆర్యవైశ్యులకు వడ్డీలేని రుణాలు, ఇళ్ల స్థలాలు అందించాం. అధికార పార్టీకి చెందిన నేతలు రూ.100 కోట్లు దోచుకున్నారు. నంద్యాల పట్టణంలో ఆళ్లగడ్డ రాజకీయాలకు తావు లేకుండా చేస్తాం. ఏడాది ఓపిక పడితే నంద్యాలకు మంచి వైభవం వస్తోంది. – శిల్పా మోహన్‌రెడ్డి
ఆర్యవైశ్యులకు అండగా మా కుటుంబం
వ్యాపారస్తులు, ఆర్యవైశ్యులకు మా కుటుంబం ఎప్పుడూ అండగా ఉం టోంది. ఏ ఇబ్బందులు వచ్చినా ఆదుకునేం దుకు ముందుంటాం. మధ్య వ్యక్తి లేకుండానే నేరుగా వచ్చి మాతో సమస్యలు చెప్పుకోవచ్చు.
– మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి