మాకు, టి-లాయర్లకు అవగాహన ఉంది: మోహన్‌రెడ్డి
తెలంగాణ న్యాయవాదులకు, తమకు స్పష్టమైన అవగాహన ఉందని సమైక్యాంధ్ర న్యాయవాదుల జేఏసీ నేత సి.వి.మోహన్‌రెడ్డి తెలిపారు. బుధవారం నాడు మానవహారం నిర్వహిస్తున్న విషయాన్ని తాము తెలంగాణ లాయర్ల జేఏసీకి కూడా చెప్పామని ఆయన వివరించారు. వారు చలో హైకోర్టు నిర్వహిస్తున్నందున ఒకరి కార్యక్రమాలను ఇంకొకరు అడ్డుకోకూడదని అనుకున్నామని, శాంతియుతంగా 20 నిమిషాలసేపు మానవహారం చేద్దామని నిర్ణయించుకున్నామని మోహన్‌రెడ్డి చెప్పారు.
హైకోర్టులో శాంతి భద్రతలను కాపాడాలని ప్రధాన న్యాయమూర్తి తమకు చెప్పారని, గొడవలు పడకుండా కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిందిగా సూచించారని ఆయన తెలిపారు. హైకోర్టు ప్రతిష్టలను కాపాడాలని చీఫ్ జస్టిస్ విజ్ఞప్తి చేశారన్నారు. ఈనెల 14వ తేదీన అనంతపురంలో సమావేశమై.. తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని సీవీ మోహన్‌రెడ్డి తెలిపారు.