దిగమింగి దగా చేశాడు
ఆశాలపల్లి(సంగెం) : ఐకేపీ సీఏ నిర్లక్ష్యంతో గ్రామైక్య సంఘాల మహిళలను రూ. 50 లక్షలు నష్టపోయూరు. 48 సంఘాలకు రాయితీ వడ్డీ రాకుండా సీఏ ఇష్టానుసారంగా వ్యవహరించాడు. ఇలా ఒక్కో సంఘం రూ. లక్ష-1.8 లక్షలు నష్టపోయింది. నష్టాన్ని ఆలస్యంగా గుర్తించిన మహిళలు గురువారం ఆందోళనకు దిగారు. మండలంలోని ఆశాలపల్లిలో రెండు గ్రామైక్య సంఘాల్లో 48 సంఘాలకు చెందిన 580 మంది సభ్యులున్నారు.
వీరంతా క్రమం తప్పకుండా పొదుపులు, బ్యాంకు రుణాలకు వడ్డీ చెల్లిస్తున్నారు. కానీ మూడేళ్లలో ఒక్క సంఘానికీ వడ్డీ తిరిగిరాలేదు. ఇదే విషయూన్ని సీఏ బొల్లేబోయిన కుమారస్వామిని అడిగితే దాటవేస్తూ వచ్చాడు. మహిళలు వారింట్లో సమస్య చెప్పుకోగా గత నెల 22న ఏపీఎం ఝాన్సీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గ్రామంలో అధికారులు గురువారం బహిరంగ చర్చ చేపట్టారు. తమ పొదుపులు, రుణ వాయిదాలను బ్యాంకులో చెల్లిస్తానని సీఏ కుమారస్వామి తీసుకుని సొంతానికి వాడుకునేవాడని మహిళలు ఆరోపించారు.
అన్ని సంఘాల పుస్తకాలు తన వద్దే పెట్టుకునేవాడని, ఈ విషయం బయటపెట్టొద్దని బెదిరించేవాడని పేర్కొన్నారు. లింకేజీ కింద రూ. లక్ష రుణం మంజూరైతే రూ. వెయ్యిచొప్పున కమీషన్ తీసుకునేవాడని, అభయహస్తం బీమా సొమ్ము రూ. 30 వేలు మంజూరైతే రూ.4 వేల చొప్పున కోత విధించేవాడని ఆరోపించారు. ఆడిట్ కోసం రూ. 150, మొబైల్ బుక్కీపింగ్ ఇతరాల కోసం ఒక్కో సంఘం నుంచి నెలకు రూ.450ల చొప్పున వసూలు చేశాడని తెలిపారు.
ఇన్ని వసూళ్లకు పాల్పడి కూడా.. ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ రాయితీని దక్కనీయలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఏపై చర్య తీసుకుని తమకు న్యాయం చేయూలని కోరారు. సీఏ కుమారస్వామి, సీసీ కొమురయ్యపై పీడీకి నివేదిక ఇస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు. సర్పంచ్ గాజే మురళి, మాజీ సర్పంచ్ కిశోర్యాదవ్, మాజీ ఎంపీటీసీ సూరయ్య తదితరులు పాల్గొన్నారు.