cab drivers protests
-
మాతో జూదమాడుతున్నారు
సాక్షి, సిటీబ్యూరో: ఎవరి సమస్యలు వారివే. ఏ వర్గం ఆకాంక్షాలు ఆ వర్గానివే. ఏళ్ల తరబడి అభివృద్ధి, సంక్షేమం కోసం ఎదురు చూసిన వివిధ వర్గాల ప్రజలు ఎన్నికల వేళ మా మొర వినండి అంటూ రాజకీయ పార్టీలను కోరుతున్నాయి. మేనిఫెస్టోల కంటే తమ ఎజెండాకే ప్రాధాన్యతివ్వాలని కోరుతున్నారు. ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలకు అనుసంధానమై పని చేస్తున్న డ్రైవర్ భాగస్వాములు, ట్యాక్సీలు, ట్రెవెల్స్ రంగంలో వాహనాలు నడిపే డ్రైవర్లు తమ సమస్యల పరిష్కారానికి సంఘటితమవుతున్నారు. డ్రైవర్ల సంక్షేమాన్ని గురించి పట్టించుకొనే రాజకీయ పార్టీలకే పట్టం కడుతామని స్పష్టం చేస్తున్నారు. వివిధ కేటగిరీలలో పని చేసే సుమారు 4.2 లక్షల మంది డ్రైవర్లు ఐక్య కార్యాచరణగా ఏర్పడ్డారు. తమ ఎజెండాను రాజకీయ పార్టీల ముందు ఉంచారు. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి తెలంగాణలోని డ్రైవర్లందరి కోసం వెంటనే ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలనేది ప్రధాన డిమాండ్. అనేక సంవత్సరాలుగా ఎలాంటి భద్రత లేకుండా రాత్రిబంవళ్లు విధులు నిర్వహిస్తున్న డ్రైవర్ల కోసం సహాయ నిధిని ఏర్పాటు చేయాలి. కుటుంబ అవసరాల కోసం ఈ నిధి నుంచి ఆర్ధిక సహాయం అందజేసేలా చర్యలు తీసుకోవాలి. మరోవైపు ఇప్పుడు ఉన్న ప్రమాద బీమా సదుపాయాన్ని పటిష్టంగా అమలు చేయాలి. కొంతకాలం కార్మిక శాఖ దీనిని అమలు చేసింది. ఇటీవల రవాణాశాఖకు బదిలీ చేశారు. అయితే ఈ చట్టం అమలులో అధికారులు, బీమా సంస్థలు తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయనేది డ్రైవర్ల ప్రధాన ఆరోపణ. ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల బీమాను కనీసం రూ.10 లక్షలకు పెంచాలని డ్రైవర్లు కోరుతున్నారు. ప్రమాదవశాత్తు డ్రైవర్లు మరణించినప్పుడు ఆ కుటుంబం వీధిన పడకుండా తక్షణమే బీమా మొత్తం అందేవిధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసే డ్రైవర్ల సంక్షేమ బోర్డు ద్వారా దీనిని అందజేయాలి. ఈ బోర్డులో డ్రైవర్ల సంఘాలకు సైతం ప్రాతినిధ్యం కల్పించాలి. ప్రభుత్వ వాహనాల అద్దెలు పెంచాలి లక్షలాది మంది నిరుద్యోగులు కారు డ్రైవర్లుగా ఉపాధి అవకాశాలను వెదుక్కొంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 1.6 లక్షల కార్లు వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికార్లకు హైర్ (అద్దె ప్రాతిపదికన) పద్ధతిలో సేవలందజేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వాహనాలకు నెలకు రూ.34 వేల చొప్పున ప్రభుత్వం అద్దె చెల్లిస్తోంది. దీనిని రూ.40 వేలకు పెంచాలనేది డ్రైవర్ల ఎజెండాలోని మరో ప్రధాన డిమాండ్. ఎలాంటి జాప్యానికి తావు లేకుండా ప్రతి నెలా అద్దె చెల్లించాలని, సంవత్సరానికి ఒక నెల హైర్ చార్జెస్ బోనస్‌గా ఇవ్వాలని కోరుతున్నారు. ఇంకా ఏం కోరుతున్నారంటే ♦ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా క్యాబ్ చార్జీలు పెంచాలి ♦ క్యాబ్ సంస్థల్లో ప్రతి డ్రైవర్లకు బిజినెస్ గ్యారెంటీ ఇవ్వాలి.8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి. ♦ ప్రయాణికుల ఫిర్యాదుల ఆధారంగా డ్రైవర్లను వేధించడం మానుకోవాలి. ♦ విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్ల రక్షణ బాధ్యత పూర్తిగా ఆయా క్యాబ్ సంస్థలకే ఉండాలి. మొబైల్ యాప్రూపొందించాలి.. ఓలా, ఉబెర్ వంటి సంస్థలు రవాణా రంగంలో పెను మార్పులు తెచ్చాయి. అప్పటి వరకు ఉన్న రవాణా సదుపాయాల ముఖచిత్రం సమూలంగా మారిపోయింది. వేలాది మంది డ్రైవర్లను భాగస్వాములుగా చేర్చుకున్నారు. మొదట్లో ఈ సంస్థల నుంచి ఎక్కువ మొత్తంలోనే ఆదాయాన్ని సంపాదించినప్పటికీ గత మూడేళ్లుగా సంక్షోభం పెరిగింది. భారీ సంఖ్యలో డ్రైవర్లను నియమించడం, ఓలా, ఉబెర్ సంస్థలు స్వయంగా వాహనాలను కొనుగోలు చేసి లీజుకు ఇవ్వడంతో అనారోగ్యకరమైన పోటీ నెలకొంది. బుకింగ్‌లు భారీగా తగ్గాయి. దీంతో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. గతంలో నెలకు రూ.60 వేల నుంచి రూ.75 వేల వరకు సంపాదించిన డ్రైవర్లకు ఇప్పుడు రాత్రింబవళ్లు కష్టపడినా నెలకు రూ.30 వేలు లభించడం లేదు. దీంతో కారు నెలసరి వాయిదాలు, ఇంటి అద్దెలు చెల్లించి కుటుంబాన్ని పోషించుకోవడం అసాధ్యంగా మారింది. ‘‘ క్యాబ్ సంస్థలు తమతో జూదమాడుతున్నాయి. డ్రైవర్ల మధ్య పోటీని పెంచి దారుణంగా దోచుకుంటున్నాయి. 24 గంటలు కష్టపడినా అప్పులు తీర్చలేకపోతున్నాం. అందుకే ఈ బడా సంస్థల నుంచి మాకు విముక్తి కల్పించాలి..’’ అని తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే స్వయంగా ఒక మొబైల్ యాప్‌ను రూపొందించి డ్రైవర్లకు న్యాయం చేయాలి. వారి శ్రమ ఫలితం వారికే దక్కేవిధంగా చర్యలు తీసుకోవాలనేది మరో ప్రధానమైన డిమాండ్. గెలుపోటములు నిర్ణయిస్తాం ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలకు మా సమస్యలను విన్నవించాం. క్యాబ్ సంస్థల దోపిడీ నుంచి కాపాడాలని వేడుకున్నాం. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. డ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉండే రాజకీయ పార్టీలకే ఓటు వేయాలని నిర్ణయించుకున్నాం. రాజకీయ పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసే సంఖ్యాబలం డ్రైవర్లకు ఉంది. – షేక్ సలావుద్దీన్, తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల జేఏసీ -
క్యాబ్‌లకు బ్రేక్...
సాక్షి, హైదరాబాద్: ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్ల ఆందోళన కొనసాగుతోంది. శుక్రవారం రెండోరోజు కూడా పలు మార్గాల్లో సర్వీసులను నిలిపివేశారు. సికింద్రాబాద్, ఈసీఐఎల్, కుషాయిగూడ, హైటెక్‌సిటీ, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తదితర రూట్లలో ఓలా, ఉబెర్ సర్వీసులకు బ్రేక్ పడింది. దీంతో ప్రయాణికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్, తదితర ఐటీ కారి డార్లలోనూ క్యాబ్ సేవలు నిలిచి పోయాయి. దీంతో ఆ మార్గాల్లో పనిచేసే ఉద్యోగులు, ఐటీ నిపుణులు ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. ఓలా, ఉబెర్ సంస్థల్లో నెలకొన్న అనారోగ్యకరమైన పోటీ వాతా వరణం, రోజుకు 18 నుంచి 20 గంటలపాటు పని చేసినా రుణాలు చెల్లించలేని దుస్థితి, ఫైనాన్షియర్ల వేధింపులు, క్యాబ్‌డ్రైవర్ల ఆత్మహత్యల నేపథ్యంలో డ్రైవర్లు ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం వందలాది మంది క్యాబ్డ్రైవర్లు అసెంబ్లీ ముట్టడికి విఫలయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసి యేషన్ అధ్యక్షుడు శివతోపాటు పలువురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రత్యేక యాప్ కోసం డ్రైవర్ల డిమాండ్... ఓలా, ఉబెర్ క్యాబ్ సంస్థల్లో సుమారు 1.5 లక్షల క్యాబ్‌లున్నాయి. చాలా మంది డ్రైవర్లు రూ.లక్షల్లో అప్పు చేసి వాహనాలను కొనుగోలు చేశారు. మొదట్లో పెద్ద ఎత్తున ఆదాయం, ప్రోత్సాహకాలు లభించడంతో చాలామంది డ్రైవర్లు ఓలా, ఉబెర్‌లకు బారులు తీరారు. డ్రైవర్ల నుంచి అనూహ్యమైన స్పందన లభించడంతో సదరు సంస్థలు ప్రోత్సాహకాలకు కోత విధించి, కమీషన్లను పెంచుకున్నాయి. దీంతో గతంలో నెలకు రూ.50 నుంచి రూ.60 వేలు సంపాదించిన డ్రైవర్‌కు ఇప్పుడు రూ.25 వేలు కూడా లభించడం లేదు. దీంతో వాహన రుణాలు చెల్లించడం, భార్యా పిల్లలను పోషించుకోవడం కష్టంగా మారింది. దీంతో డ్రైవర్లు ‘ఓలా, ఉబెర్ క్యాబ్‌కు హఠావో, డ్రైవర్‌కు బచావో’అనే నినాదంతో ఆందోళనకు దిగారు. లక్షలాదిమంది డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వమే ఒక యాప్‌ను రూపొం దించాలని, డ్రైవర్లకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించాలని కోరుతున్నారు. -
స్తంభించిన ఓలా.. ఉబెర్
► రాజధానిలో క్యాబ్ డ్రైవర్ల ఆందోళన సాక్షి, హైదరాబాద్: తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ చేపట్టిన క్యాబ్‌ల బంద్‌తో శనివారం వేలాది వాహనాలు నిలిచిపోయాయి. ఓలా, ఉబెర్ క్యాబ్ సంస్థల వేధింపులకు వ్యతి రేకంగా పిలుపునిచ్చిన ఈ బంద్‌తో నూతన సంవత్సర వేడుకలకు ఆటంకం కలిగింది. అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లేవారు అవస్థలు పడ్డారు. ముఖ్యంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన రైల్వే స్టేషన్లతో పాటు, శంషాబాద్ విమానాశ్ర యం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. వారు ఆటోలు, బస్సులు, అరకొరగా నడిచిన ఇతర సంస్థల క్యాబ్ సర్వీసులను ఆశ్ర యించారు. గ్రేటర్ ఆర్టీసీ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి 50 అదనపు బస్సులు నడిపినా ఇబ్బందులు తప్పలేదు. ఆదివారం నుంచి మరిన్ని బస్సులు పెంచుతామని ఆర్టీసీ తెలిపింది. నగర వ్యాప్తంగా ధర్నాలు... తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతా ల్లో ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, మల్కాజిగిరి, ఈసీఐఎల్, సికింద్రా బాద్, ఉప్పల్, హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, కూకట్పల్లి, పాతబస్తీ తదితర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ క్యాబ్‌లను అడ్డు కున్నారు. పలుచోట్ల పోలీసులు ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా ఓలా, ఉబెర్‌లకు చెందిన సుమారు లక్ష క్యాబ్ సర్వీసుల్లో 60 శాతానికి పైగా నిలిచిపోయాయి. డిమాండ్లు పరిష్కరించే వరకూ ఆందోళన... తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఆందోళన విరమించబోమని, ఈ నెల 4 వరకు బంద్ పాటిస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు శివ తెలిపారు. ఓలా, ఉబెర్ సంస్థల దోపిడీకి నిరసనగా సుందరయ్య పార్కు వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. డ్రైవర్లకు కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించకుండా శ్రమ దోచు కుంటున్నారని సీఐటీయూ నాయకులు ఆరో పించారు. చాంద్రాయణగుట్ట, బాబానగర్ వద్ద ప్రధాన రహదారిపై క్యాబ్ డ్రైవర్లు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఉబెర్ అదనపు ఆకర్షణ... క్యాబ్‌ల బంద్ నేపథ్యంలో ఉబెర్ సంస్థ శనివారం డ్రైవర్లకు అదనపు వేతనాలను ప్రకటించింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకొని సర్వీసులు నడిపేందుకు ముందుకు వచ్చే డ్రైవర్లకు రూ.8 వేల వరకు చెల్లించనున్నట్లు వారికి ఎస్ఎంఎస్లు పంపింది.