సాక్షి, సిటీబ్యూరో: ఎవరి సమస్యలు వారివే. ఏ వర్గం ఆకాంక్షాలు ఆ వర్గానివే. ఏళ్ల తరబడి అభివృద్ధి, సంక్షేమం కోసం ఎదురు చూసిన వివిధ వర్గాల ప్రజలు ఎన్నికల వేళ మా మొర వినండి అంటూ రాజకీయ పార్టీలను కోరుతున్నాయి. మేనిఫెస్టోల కంటే తమ ఎజెండాకే ప్రాధాన్యతివ్వాలని కోరుతున్నారు. ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలకు అనుసంధానమై పని చేస్తున్న డ్రైవర్ భాగస్వాములు, ట్యాక్సీలు, ట్రెవెల్స్ రంగంలో వాహనాలు నడిపే డ్రైవర్లు తమ సమస్యల పరిష్కారానికి సంఘటితమవుతున్నారు. డ్రైవర్ల సంక్షేమాన్ని గురించి పట్టించుకొనే రాజకీయ పార్టీలకే పట్టం కడుతామని స్పష్టం చేస్తున్నారు. వివిధ కేటగిరీలలో పని చేసే సుమారు 4.2 లక్షల మంది డ్రైవర్లు ఐక్య కార్యాచరణగా ఏర్పడ్డారు. తమ ఎజెండాను రాజకీయ పార్టీల ముందు ఉంచారు.
సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి
తెలంగాణలోని డ్రైవర్లందరి కోసం వెంటనే ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలనేది ప్రధాన డిమాండ్. అనేక సంవత్సరాలుగా ఎలాంటి భద్రత లేకుండా రాత్రిబంవళ్లు విధులు నిర్వహిస్తున్న డ్రైవర్ల కోసం సహాయ నిధిని ఏర్పాటు చేయాలి. కుటుంబ అవసరాల కోసం ఈ నిధి నుంచి ఆర్ధిక సహాయం అందజేసేలా చర్యలు తీసుకోవాలి. మరోవైపు ఇప్పుడు ఉన్న ప్రమాద బీమా సదుపాయాన్ని పటిష్టంగా అమలు చేయాలి. కొంతకాలం కార్మిక శాఖ దీనిని అమలు చేసింది. ఇటీవల రవాణాశాఖకు బదిలీ చేశారు. అయితే ఈ చట్టం అమలులో అధికారులు, బీమా సంస్థలు తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయనేది డ్రైవర్ల ప్రధాన ఆరోపణ. ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల బీమాను కనీసం రూ.10 లక్షలకు పెంచాలని డ్రైవర్లు కోరుతున్నారు. ప్రమాదవశాత్తు డ్రైవర్లు మరణించినప్పుడు ఆ కుటుంబం వీధిన పడకుండా తక్షణమే బీమా మొత్తం అందేవిధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసే డ్రైవర్ల సంక్షేమ బోర్డు ద్వారా దీనిని అందజేయాలి. ఈ బోర్డులో డ్రైవర్ల సంఘాలకు సైతం ప్రాతినిధ్యం కల్పించాలి.
ప్రభుత్వ వాహనాల అద్దెలు పెంచాలి
లక్షలాది మంది నిరుద్యోగులు కారు డ్రైవర్లుగా ఉపాధి అవకాశాలను వెదుక్కొంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 1.6 లక్షల కార్లు వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికార్లకు హైర్ (అద్దె ప్రాతిపదికన) పద్ధతిలో సేవలందజేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వాహనాలకు నెలకు రూ.34 వేల చొప్పున ప్రభుత్వం అద్దె చెల్లిస్తోంది. దీనిని రూ.40 వేలకు పెంచాలనేది డ్రైవర్ల ఎజెండాలోని మరో ప్రధాన డిమాండ్. ఎలాంటి జాప్యానికి తావు లేకుండా ప్రతి నెలా అద్దె చెల్లించాలని, సంవత్సరానికి ఒక నెల హైర్ చార్జెస్ బోనస్‌గా ఇవ్వాలని కోరుతున్నారు.
ఇంకా ఏం కోరుతున్నారంటే
♦ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా క్యాబ్ చార్జీలు పెంచాలి
♦ క్యాబ్ సంస్థల్లో ప్రతి డ్రైవర్లకు బిజినెస్ గ్యారెంటీ ఇవ్వాలి.8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి.
♦ ప్రయాణికుల ఫిర్యాదుల ఆధారంగా డ్రైవర్లను వేధించడం మానుకోవాలి.
♦ విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్ల రక్షణ బాధ్యత పూర్తిగా ఆయా క్యాబ్ సంస్థలకే ఉండాలి.
మొబైల్ యాప్‌రూపొందించాలి..
ఓలా, ఉబెర్ వంటి సంస్థలు రవాణా రంగంలో పెను మార్పులు తెచ్చాయి. అప్పటి వరకు ఉన్న రవాణా సదుపాయాల ముఖచిత్రం సమూలంగా మారిపోయింది. వేలాది మంది డ్రైవర్లను భాగస్వాములుగా చేర్చుకున్నారు. మొదట్లో ఈ సంస్థల నుంచి ఎక్కువ మొత్తంలోనే ఆదాయాన్ని సంపాదించినప్పటికీ గత మూడేళ్లుగా సంక్షోభం పెరిగింది. భారీ సంఖ్యలో డ్రైవర్లను నియమించడం, ఓలా, ఉబెర్ సంస్థలు స్వయంగా వాహనాలను కొనుగోలు చేసి లీజుకు ఇవ్వడంతో అనారోగ్యకరమైన పోటీ నెలకొంది. బుకింగ్‌లు భారీగా తగ్గాయి. దీంతో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. గతంలో నెలకు రూ.60 వేల నుంచి రూ.75 వేల వరకు సంపాదించిన డ్రైవర్లకు ఇప్పుడు రాత్రింబవళ్లు కష్టపడినా నెలకు రూ.30 వేలు లభించడం లేదు. దీంతో కారు నెలసరి వాయిదాలు, ఇంటి అద్దెలు చెల్లించి కుటుంబాన్ని పోషించుకోవడం అసాధ్యంగా మారింది. ‘‘ క్యాబ్ సంస్థలు తమతో జూదమాడుతున్నాయి. డ్రైవర్ల మధ్య పోటీని పెంచి దారుణంగా దోచుకుంటున్నాయి. 24 గంటలు కష్టపడినా అప్పులు తీర్చలేకపోతున్నాం. అందుకే ఈ బడా సంస్థల నుంచి మాకు విముక్తి కల్పించాలి..’’ అని తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే స్వయంగా ఒక మొబైల్ యాప్‌ను రూపొందించి డ్రైవర్లకు న్యాయం చేయాలి. వారి శ్రమ ఫలితం వారికే దక్కేవిధంగా చర్యలు తీసుకోవాలనేది మరో ప్రధానమైన డిమాండ్.
గెలుపోటములు నిర్ణయిస్తాం
ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలకు మా సమస్యలను విన్నవించాం. క్యాబ్ సంస్థల దోపిడీ నుంచి కాపాడాలని వేడుకున్నాం. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. డ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉండే రాజకీయ పార్టీలకే ఓటు వేయాలని నిర్ణయించుకున్నాం. రాజకీయ పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసే సంఖ్యాబలం డ్రైవర్లకు ఉంది. – షేక్ సలావుద్దీన్, తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల జేఏసీ
Comments
Please login to add a commentAdd a comment