పాల్మాకుల స్ట్రాంగ్‌రూమ్ పరిసరాల్లో భద్రతా సిబ్బందితో సైబరాబాద్ సీపీ సజ్జనార్
సాక్షి,సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తం చేసిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)ను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందన్న పుకార్లు గ్రేటర్‌లో గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి నేతలు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద రేయింబవళ్లు కాపలా కాస్తున్నారు. తమతో పాటు కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరులతో నిద్రాహారాలు మాని అక్కడే ఉంటున్నారు. తాము అక్కడ లేకపోతే తమ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 చోట్ల ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో రెండింటి వద్ద భద్రతా సిబ్బందితో పాటు కాంగ్రెస్ కూటమి తరఫున పోటీచేసిన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యలు, ముఖ్య అనుచరులు మకాం వేశారు. వాస్తవానికి అక్కడ పోలీస్, పారా మిలటరీ బలగాలు, సీసీ కెమెరాలతో రక్షణ ఏర్పాట్లు చేసినా.. అభ్యర్థులు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించుకుంటున్నారు.
పాల్మాకుల స్ట్రాంగ్ రూమ్ వద్ద ఇలా..
శంషాబాద్ మండలంలోని పాల్మాకులలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా.. ఇక్కడ రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎనిమిది నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రత, నిఘా ఏర్పాట్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎన్నికల సంఘం అనుమతితో ‘కూటమి’ బృందాలు శనివారం సాయంత్రం నుంచి కాపలా కాస్తున్నాయి. ఆయా నియోజకవర్గాలతో పాటు స్థానికంగా ఉన్న నాయకులు రాత్రి, పగలు ఇక్కడే ఉండి స్ట్రాంగ్ రూమ్‌లు ఉన్న ప్రధాన కేంద్రం చుట్టూ పహారా తిరుగుతున్నారు.
భోగారం కేంద్రానికి కూటమి నేతలు
మేడ్చల్ జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల ఈవీఎంలను కీసర మండలం భోగారంలోని హోలిమేరీ ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరించారు. అయితే ఆదివారం ఉప్పల్, కుత్బుల్లా పూర్, కూకట్‌పల్లి ప్రజాకూటమి అభ్యర్థులైన తూళ్ల వీరేందర్‌గౌడ్, కూన శ్రీశైలంగౌడ్, సుహాసిని ఆ కేంద్రాన్ని పరిశీలించారు. ఈవీఎంల భద్రతపై రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న రూమర్స్‌తో తమంతా ఆందోళన చెందామని, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత ఎలా ఉందో తెలుసుకునేందుకు స్వయంగా వచ్చామన్నారు.
పాస్ ఉన్నవారికి మాత్రమే అనుమతి
కౌంటింగ్ జరిగే మంగళవారం పాస్ హోల్డర్స్‌కి మాత్రమే స్ట్రాంగ్ రూమ్‌ల్లోకి అనుమతి ఉంటుంది. మొదటి అంచలో వాహనాలు తనిఖీ ఉంటుందని పోలీసులు చెప్పారు. రెండో అంచలో 500 మీటర్ల వరకు కేంద్రం చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసి భద్రతా బలగాలు మోహరించాయి. మూడో అంచెలో సీసీ కెమెరా>లు, కేంద్ర భద్రతా బలగాలు, పోలీసులు నిఘా ఉంది. కౌంటింగ్ రోజున మద్యం దుకాణాలు మూసివేయాలని ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన పోలీసు ఉన్నతాధికారులు అదే రోజు ఎలాంటి సభలు, ర్యాలీలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ‘కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 7 గంటల లోపు కేంద్రాలకు చేరుకోవాలి. వీరికి సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ పాసులు ఇస్తారు. సెల్‌ఫోన్లు కేంద్రాల్లోకి అనుమతించరు. ఆయా కేంద్రాల వద్ద రెండు కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించాం. ప్రత్యేకంగా వెయ్యి మంది పోలీసులు భద్రతా విధుల్లో ఉంటారు’ అని ఆయా ప్రాంతాల్లోని స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేసిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, రాచకొండ సీపీ మహేష్ భగవత్ శనివారం తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్ల వాహనాల పార్కింగ్‌ను బెంగళూరు జాతీయ రహదారి పక్కన వెంగమాంబ హోటల్ వద్ద ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి షటిల్ బస్సుల ద్వారా ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రానికి తీసుకెళ్తారు.
గ్రేటర్ జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాలు..
హైదరాబాద్: 15
పాల్మాకుల(రంగారెడ్డి): 01
భోగారం(మేడ్చల్) 01
కేంద్రాల వద్ద భారీ పోలీస్ భద్రత
సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలోని మూడు ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల(స్ట్రాంగ్‌రూమ్స్) వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మూడంచెల భారీ భద్రత కల్పించారు. కేంద్ర సాయుధ బలగాలు, ఇద్దరు డీసీపీ స్థాయి అధికారులు, పోలీసులు డేగ కళ్లతో పహారా కాస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పాల్మాకులలోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ భవనంలోని స్ట్రాంగ్‌రూమ్‌ల్లో ఓట్లను లెక్కించనున్నారు. అలాగే రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కీసరలోని హోలిమేరీ కాలేజ్, భువనగిరిలోని ఆరోరా ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఈ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేయనున్నారు.
రేపు కౌంటింగ్ నేపథ్యంలో మద్యం అమ్మకాలు బంద్
అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నగరంలోని 15 కేంద్రాల్లో మంగళవారం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా 144 సెక్షన్ విధిస్తూ కొత్వాల్ అంజనీకుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 6 నుంచి బుధవారం ఉదయం 6 వరకు ఇది అమలులో ఉంటుందన్నారు. ఈమేరకు అనుమతి లేకుండా ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడ కూడదు. అలాగే మంగళవారం ఉదయం 6 నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు నగర వ్యాప్తంగా మద్యం విక్రయాలను నిషేధించారు. కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లతో పాటు మిలటరీ క్యాంటీన్లకూ ఇది వర్తిస్తుందని ప్రకటించారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని కొత్వాల్ స్పష్టం చేశారు. నగరంలో బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడం పైనా ఆంక్షలు విధించారు. డీజేలతో పాటు పరిమితికి మించి శబ్దం చేసే వాటిని వాడటాన్ని కూడా నిషేధించారు. వీటిని అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment