cab industry
-
నైట్‌లో ముంబయి మొదటిస్థానం.. వీకెండ్లో..
ట్యాక్సీ సర్వీసులను అందించే ఉబర్ సంస్థ 2023లో చేసిన పర్యటనలకు సంబంధించి ఆసక్తికర విషయాలను విడుదల చేసింది. ఈ ఏడాది దిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) బెంగళూరు, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, పుణెల్లో ఎక్కువ మంది రైడ్ బుక్ చేసినట్లు సంస్థ వెల్లడించింది. రాత్రి సమయంలో వచ్చిన బుకింగ్‌ల విషయానికొస్తే.. ముంబయి మొదటిస్థానంలో నిలిచింది. వీకెండ్లో మాత్రం కోల్‌కతాలోని ప్రజలు ఎక్కువగా బుక్ చేసుకున్నారు. 2023 సంవత్సరానికిగాను ఉబర్ రైడ్స్ రికార్డు స్థాయిలో 6800 కోట్ల కిలోమీటర్లలో సేవలందించిందని తెలిపింది. ఇది దేశంలోని మొత్తం రోడ్ నెట్‌వర్క్‌లో వెయ్యి రెట్లు అని కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: టెస్లా యూనిట్‌కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..? ఉబెర్ వెల్లడించిన ఆసక్తికరమైన విషయాలు రైడ్స్‌లో ఎక్కువ భాగం సాయంత్రం 6-7 గంటల మధ్య షెడ్యూల్ చేస్తున్నవే. శనివారం ఉబెర్ ఫేవరెట్ డే. ఆ రోజే అధికంగా బుకింగ్స్ వస్తున్నాయి. రైడ్ బుక్ చేసిన ట్రిప్‌ల సంఖ్య పరంగా దసరా, క్రిస్మస్ అత్యంత ప్రజాదరణ పొందిన రోజులు. ఒక్క డిసెంబర్లోనే అత్యధిక సంఖ్యలో రైడ్లు బుక్ అయినట్లు సంస్థ తెలిపింది. విమానాశ్రయాలకు అధిక సంఖ్యలో ఉబర్ ట్రిప్‌లు ఉదయం 4-5 గంటల మధ్య బుక్ అయ్యాయి. -
క్యాబ్... రివర్స్ గేర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్ పరిశ్రమను కరోనా వైరస్ కబళిస్తోంది. లాక్డౌన్ నేపథ్యంలో క్యాబ్ బుకింగ్స్ లేకపోవటం, ఉద్యోగుల వేతనాల చెల్లింపులు, డ్రైవర్లను ఆదుకోవటం, కార్ల నిర్వహణ వంటివి కంపెనీలకు పెను భారమవుతున్నాయి. లాక్డౌన్ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు గతంలో మాదిరి క్యాబ్స్ బుకింగ్స్ ఉండవన్నది పరిశ్రమ వర్గాల అంచనా. దీంతో నిర్వహణ భారాన్ని భరించలేమని, తాము కొనసాగటం కష్టమేనని హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తున్న క్యాబ్ అగ్రిగేట్ కంపెనీలు చెబుతున్నాయి. నిజానికిపుడు మొబిలిటీ అనేది రోజు వారి అవసరాల్లో భాగం. లాక్డౌన్ పూర్తయ్యాక పరిశ్రమ రికవరీ అయ్యే దశలో చాలా మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆ పరిస్థితులు తాము భరించలేని స్థాయిలో ఉంటాయని హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా సేవలందిస్తున్న ప్రైడో, టోరా, యూటూ, రైడ్‌ఈజీ వంటి క్యాబ్ అగ్రిగేట్ కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో ఆయా కంపెనీలకు సుమారు రూ.200 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. ఓలా, ఉబర్లు షేరింగ్ సర్వీస్‌ల్ని నిలిపేశాయి. హైదరాబాద్‌లో తమకున్న 15వేల లీజు వాహనాలను గోదాములకే పరిమితం చేసినట్లు ‘ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ నేషనల్ జనరల్ సెక్రటరీ షేక్ సలావుద్దీన్ చెప్పారు. లాక్డౌన్ ఉన్నన్ని రోజులు లీజు వాహనాల ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదని.. లాక్డౌన్ పూర్తయ్యాక ఎవరి నంబర్ ప్లేట్ వాహనాలను ఆయా డ్రైవర్లకే అందిస్తామని ఓలా ప్రతినిధి తెలిపారు. లాక్డౌన్ తర్వాత పరిస్థితేంటి? లాక్డౌన్ ఎత్తేసినా గతంలో మాదిరి పెద్ద సంఖ్యలో బుకింగ్స్ ఉండవని ఓలా మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఆనంద్ సుబ్రహ్మణ్యం అంచనా వేశారు. నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునేందుకు కొన్నాళ్ల పాటు కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్‌కే ప్రాధాన్యమిస్తాయని, వైరస్ భయంతో కస్టమర్లు గతంలో మాదిరి షాపింగ్ మాల్స్, థియేటర్లు వంటి చోట్లకు ఎక్కువ వెళ్లరని పేర్కొన్నారు. కార్ పూలింగ్, వ్యక్తిగత వాహనాల వాడకానికే ప్రాధాన్యమిస్తారని చెప్పారు. ఎయిర్పోర్ట్ పికప్, డ్రాప్ వాహనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని.. అందుకే ఓలా, ఉబర్ వంటివి సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసి ఆయా వాహనాల్ని పూర్తిగా శానిటైజ్ చేస్తే తప్ప కస్టమర్లలో నమ్మకాన్ని తీసుకురాలేమని సల్లావుద్దీన్ తెలిపారు. వేతనాలు, ఉద్యోగుల తగ్గింపు కూడా.. డ్రైవర్లు కాకుండా దేశవ్యాప్తంగా క్యాబ్ పరిశ్రమలో 15 వేల మంది ఉద్యోగులుంటారు. క్యాబ్స్ తిరగడం లేదు కనక వారి వేతనాల్లో 20 శాతం వరకు కోత పెట్టినట్లు తెలిసింది. దేశంలో 5 వేల మంది ఉద్యోగులున్న ఓ ప్రధాన క్యాబ్ కంపెనీ తమ ఉద్యోగుల వేతనాల్లో 15 శాతం కోత విధించింది. లాక్డౌన్ తర్వాత కూడా వ్యాపారం తగ్గుతుందన్న అంచనాతో ముందే అవి ఉద్యోగుల్ని తగ్గిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఓ క్యాబ్ కంపెనీలో 150 మంది ఉద్యోగులుండగా వారి సంఖ్యను సగానికి తగ్గించినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. తాత్కాలికంగా సేవలను నిలిపివేసే యోచనలో ఉన్నామని.. పరిశ్రమ మళ్లీ పుంజుకున్నాక.. రీబ్రాండ్‌తో మార్కెట్లోకి వస్తామని చెప్పారాయన. -
క్యాబ్.. లబోదిబో!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలో క్యాబ్ పరిశ్రమ సంక్షోభంలో పడింది. ప్రయాణికులతో నిండుగా కనిపించే క్యాబ్‌లు ఇప్పుడు బోసిపోతున్నాయి. రాష్ట్రంలో గత కొన్ని ఏళ్లుగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులే ఇందుకు కారణమని తెలుస్తోంది. 2007లో వచ్చిన మాంద్యం నుంచి గట్టెక్కుతున్న తరుణంలో.. విభజన, సమైక్య ఉద్యమ ఫలితంగా క్యాబ్ పరిశ్రమ వ్యాపారం సగానికి పడిపోయింది. రాష్ట్రంలో క్యాబ్, బస్ సర్వీసులకు హైదరాబాద్ అతి పెద్ద మార్కెట్. ఐటీ, ఔషధ, రసాయన కంపెనీలు వీటికి అతిపెద్ద ఆదాయ వనరు కావడమే ఇందుకు కారణం. అయితే కార్పొరేట్ సంస్థలు ఖర్చులను తగ్గించుకునేం దుకు పిక్ అప్‌లను తగ్గించివేశాయి. ఉద్యోగులను వారి ఇంటి వద్ద నుంచి తీసుకు వచ్చేబదులు పాయింట్ పిక్ అప్‌లను ఎంచుకుంటున్నాయి. అంటే వివిధ రూట్లలో బస్‌లను నడిపి, ఆ రూట్లో ఉన్న ఉద్యోగులను నిర్దిష్ట ప్రాంతం నుంచి ఎక్కించుకుంటున్నాయి. గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్న కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులను ఎంఎంటీఎస్‌లో రమ్మంటున్నాయని గ్రేటర్ హైదరాబాద్ క్యాబ్స్, బస్ ఆపరేటర్ల సంఘం వ్యవస్థాపకుడు, ప్రధాన కార్యదర్శి సయ్యద్ నిజాముద్దీన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పన్ను కట్టాల్సిందే..: కార్పొరేట్ కంపెనీలు ఎక్కువ సీట్లున్న వాహనాలను డిమాండ్ చేస్తున్నాయి. 2006-07లో హైదరాబాద్‌లో 25 వేల ఇండికా కార్లు ఉంటే, ఇప్పుడు వీటి సంఖ్య 6 వేలకు తగ్గడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం 22-36 సీట్ల బస్‌లు 1,000కి పైమాటే. ఇన్నోవాలు 10 వేల దాకా ఉంటాయి. క్యాబ్ ఏజెన్సీల వద్ద 5 వేల లోగాన్ కార్లున్నాయి. వ్యాపారం బాగా జరిగిన సమయంలో ఇక్కడి ఆపరేటర్లు ఆడి, బీఎండబ్ల్యు, జాగ్వార్ వంటి ఖరీదైన కార్లను కూడా కొనుగోలు చేశారు. ఇటువంటివి నగరంలో 100 దాకా ఉంటాయి. క్యాబ్ ఏజెన్సీలు, పెద్ద బస్‌లను నిర్వహిస్తున్న ట్రావెల్ ఏజెన్సీలు రాష్ట్రంలో మూడు నెలలకోసారి సుమారు రూ.1,000 కోట్ల పన్ను కడుతున్నాయని సమాచారం. వాహనం తిరిగినా తిరగకపోయినా ట్యాక్స్ కట్టాల్సిందేనని మోతినగర్‌లోని రమ్య ట్రావెల్స్ యజమాని ఎన్.శ్రీనివాస్ చెప్పారు. 30% వ్యాపారులే... ఒకట్రెండు వాహనాలను కొని కార్పొరేట్ కంపెనీలకు అద్దెకు ఇచ్చేవారి పరిస్థితి మరీ దారుణం. కంపెనీల వ్యయ నియంత్రణతో వాహన యజమానులకు ఆదాయం తగ్గిపోయింది. ‘మూడేళ్ల క్రితం డీజిల్ ధర లీటరుకు రూ.33.50. ఇప్పుడది రూ.56.65. డ్రైవర్ వేతనం రూ.5,500 నుంచి రూ.10 వేలకు ఎగబాకింది. అయినా కార్పొరేట్ కంపెనీలు వాహనాకు చెల్లించే నెలవారీ అద్దె పెంచకపోగా తగ్గించాయి’ అని సయ్యద్ నిజాముద్దీన్ తెలిపారు. ఈ పరిశ్రమలో చిన్న వాహన యజమానుల్లో విజయవంతమైనవారు 30% మందే ఉంటారన్నారు. వందలాది మంది వాహనాలను అమ్ముకుని ఇతర వ్యాపకాలను చేసుకుంటున్నారని చెప్పారు. ఇక హైదరాబాద్‌లో రేడియో క్యాబ్ ఏజెన్సీల వద్ద 1,300 వాహనాలు ఉన్నాయి. వీటి వ్యాపారం రోజుకు రూ.30 లక్షలు. గడిచిన రెండు నెలల్లోనే వ్యాపారం 35% తగ్గిందని ఒక రేడియో క్యాబ్ ఏజెన్సీ ప్రతినిధి చెప్పారు. మిగిలేది పెద్ద ఆపరేటర్లేనా... క్యాబ్, బస్ ఆపరేటర్లలో పెద్ద సంస్థలే ప్రస్తుత పరిస్థితుల్లో నిలదొక్కుకుంటున్నాయి. క్లయింట్ల సంఖ్య ఎక్కువగా ఉండి, వాహనాలు నిరంతరం బిజీగా ఉంటేనే మంచి లాభాలు వస్తున్నాయి. లేదంటే రాబడికి బదులు ఖర్చే ఎక్కువగా ఉంటోంది. ఉదాహరణకు 22 సీటర్ల బస్‌కు కార్పొరేట్ కంపెనీలు నెలవారీ అద్దె రూ.55 వేలు చెల్లిస్తున్నాయి. ఇక బస్ యజమానికి అవుతున్న ఖర్చు చూస్తే.. నెలకు పన్నుల రూపంలో రూ.3 వేలు, డీజిల్ రూ.20 వేలు, డ్రైవర్‌కు రూ.10 వేలు, బీమా రూ.3 వేలు, నిర్వహణ వ్యయం రూ.4 వేలు, ఫైనాన్స్ సంస్థకు నెల వాయిదా రూ.32 వేలు అవుతోంది. దీంతో వ్యయం రూ.72 వేలకు చేరింది. వాహనాన్ని ఇతర కంపెనీలకు కూడా తిప్పగలిగితేనే అదనపు ఆదాయం వచ్చే పరిస్థితి.