క్యాబ్.. లబోదిబో! | Unrest hit Cab industry in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

క్యాబ్.. లబోదిబో!

Published Tue, Sep 24 2013 3:29 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

క్యాబ్.. లబోదిబో! - Sakshi

క్యాబ్.. లబోదిబో!

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలో క్యాబ్ పరిశ్రమ సంక్షోభంలో పడింది. ప్రయాణికులతో నిండుగా కనిపించే క్యాబ్‌లు ఇప్పుడు బోసిపోతున్నాయి.  రాష్ట్రంలో గత కొన్ని ఏళ్లుగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులే ఇందుకు కారణమని తెలుస్తోంది. 2007లో వచ్చిన మాంద్యం నుంచి గట్టెక్కుతున్న తరుణంలో.. విభజన, సమైక్య ఉద్యమ ఫలితంగా క్యాబ్ పరిశ్రమ వ్యాపారం సగానికి పడిపోయింది.
 
 రాష్ట్రంలో క్యాబ్, బస్ సర్వీసులకు హైదరాబాద్ అతి పెద్ద మార్కెట్. ఐటీ, ఔషధ, రసాయన కంపెనీలు వీటికి అతిపెద్ద ఆదాయ వనరు కావడమే ఇందుకు కారణం. అయితే కార్పొరేట్ సంస్థలు ఖర్చులను తగ్గించుకునేం దుకు పిక్ అప్‌లను తగ్గించివేశాయి. ఉద్యోగులను వారి ఇంటి వద్ద నుంచి తీసుకు వచ్చేబదులు పాయింట్ పిక్ అప్‌లను ఎంచుకుంటున్నాయి. అంటే వివిధ రూట్లలో బస్‌లను నడిపి, ఆ రూట్లో ఉన్న ఉద్యోగులను నిర్దిష్ట ప్రాంతం నుంచి ఎక్కించుకుంటున్నాయి. గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్న కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులను ఎంఎంటీఎస్‌లో రమ్మంటున్నాయని గ్రేటర్ హైదరాబాద్ క్యాబ్స్, బస్ ఆపరేటర్ల సంఘం వ్యవస్థాపకుడు, ప్రధాన కార్యదర్శి సయ్యద్ నిజాముద్దీన్ సాక్షి  బిజినెస్ బ్యూరోకు తెలిపారు.
 
 పన్ను కట్టాల్సిందే..: కార్పొరేట్ కంపెనీలు ఎక్కువ సీట్లున్న వాహనాలను డిమాండ్ చేస్తున్నాయి. 2006-07లో హైదరాబాద్‌లో 25 వేల ఇండికా కార్లు ఉంటే, ఇప్పుడు వీటి సంఖ్య 6 వేలకు తగ్గడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం 22-36 సీట్ల బస్‌లు 1,000కి పైమాటే. ఇన్నోవాలు 10 వేల దాకా ఉంటాయి. క్యాబ్ ఏజెన్సీల వద్ద 5 వేల లోగాన్ కార్లున్నాయి.  వ్యాపారం బాగా జరిగిన సమయంలో ఇక్కడి ఆపరేటర్లు ఆడి, బీఎండబ్ల్యు, జాగ్వార్ వంటి ఖరీదైన కార్లను కూడా కొనుగోలు చేశారు. ఇటువంటివి నగరంలో 100 దాకా ఉంటాయి. క్యాబ్ ఏజెన్సీలు, పెద్ద బస్‌లను నిర్వహిస్తున్న ట్రావెల్ ఏజెన్సీలు రాష్ట్రంలో మూడు నెలలకోసారి సుమారు రూ.1,000 కోట్ల పన్ను కడుతున్నాయని సమాచారం. వాహనం తిరిగినా తిరగకపోయినా ట్యాక్స్ కట్టాల్సిందేనని మోతినగర్‌లోని రమ్య ట్రావెల్స్ యజమాని ఎన్.శ్రీనివాస్ చెప్పారు.  
 
 30% వ్యాపారులే...
 ఒకట్రెండు వాహనాలను కొని కార్పొరేట్ కంపెనీలకు అద్దెకు ఇచ్చేవారి పరిస్థితి మరీ దారుణం. కంపెనీల వ్యయ నియంత్రణతో వాహన యజమానులకు ఆదాయం తగ్గిపోయింది. ‘మూడేళ్ల క్రితం డీజిల్ ధర లీటరుకు రూ.33.50. ఇప్పుడది రూ.56.65. డ్రైవర్ వేతనం రూ.5,500 నుంచి రూ.10 వేలకు ఎగబాకింది. అయినా కార్పొరేట్ కంపెనీలు వాహనాకు చెల్లించే నెలవారీ అద్దె పెంచకపోగా తగ్గించాయి’ అని సయ్యద్ నిజాముద్దీన్ తెలిపారు. ఈ పరిశ్రమలో చిన్న వాహన యజమానుల్లో విజయవంతమైనవారు 30% మందే ఉంటారన్నారు. వందలాది మంది వాహనాలను అమ్ముకుని ఇతర వ్యాపకాలను చేసుకుంటున్నారని చెప్పారు. ఇక హైదరాబాద్‌లో రేడియో క్యాబ్ ఏజెన్సీల వద్ద 1,300 వాహనాలు ఉన్నాయి. వీటి వ్యాపారం రోజుకు రూ.30 లక్షలు. గడిచిన రెండు నెలల్లోనే వ్యాపారం 35% తగ్గిందని ఒక రేడియో క్యాబ్ ఏజెన్సీ ప్రతినిధి చెప్పారు.
 
 మిగిలేది పెద్ద ఆపరేటర్లేనా...
 క్యాబ్, బస్ ఆపరేటర్లలో పెద్ద సంస్థలే ప్రస్తుత పరిస్థితుల్లో నిలదొక్కుకుంటున్నాయి. క్లయింట్ల సంఖ్య ఎక్కువగా ఉండి, వాహనాలు నిరంతరం బిజీగా ఉంటేనే మంచి లాభాలు వస్తున్నాయి. లేదంటే రాబడికి బదులు ఖర్చే ఎక్కువగా ఉంటోంది. ఉదాహరణకు 22 సీటర్ల బస్‌కు కార్పొరేట్ కంపెనీలు నెలవారీ అద్దె రూ.55 వేలు చెల్లిస్తున్నాయి. ఇక బస్ యజమానికి అవుతున్న ఖర్చు చూస్తే.. నెలకు పన్నుల రూపంలో రూ.3 వేలు, డీజిల్ రూ.20 వేలు, డ్రైవర్‌కు రూ.10 వేలు, బీమా రూ.3 వేలు, నిర్వహణ వ్యయం రూ.4 వేలు, ఫైనాన్స్ సంస్థకు నెల వాయిదా రూ.32 వేలు అవుతోంది. దీంతో వ్యయం రూ.72 వేలకు చేరింది. వాహనాన్ని ఇతర కంపెనీలకు కూడా తిప్పగలిగితేనే అదనపు ఆదాయం వచ్చే పరిస్థితి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement