‘కేబుల్ వార్’
అన్నాడీఎంకే, డీఎంకే మధ్య పరోక్షంగా సాగుతున్న కేబుల్‌వార్ మరోసారి తెరపైకి వచ్చింది. తమిళనాడు అరసు టీవీ ప్రసారాల్లో డిజిటల్ సౌకర్యానికి అనుమతి కోరుతూ ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం కేంద్రానికి లేఖ రాయడం ద్వారా డీఎంకేకు మరోసారి గురిపెట్టారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: డీఎంకే అధినేత కరుణానిధి సోదరి కుమారుడైన దయానిధి మారన్ యూపీఏ 1 ప్రభుత్వంలో కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. కరుణ పెద్దకుమారుడు అళగిరి నేతృత్వంలోని సుమంగళి కేబుల్ నెట్వర్క్ విషయంలో మారన్ కుటుంబంతో విభేదాలు పొడసూపాయి. దీనికి ఆగ్రహించిన కరుణానిధి మారన్ సోదరుల నేతృత్వంలోని సన్‌టీవీ గ్రూపును దెబ్బతీయాలని భావించారు. ఇందులో భాగం గా అన్నా అరివాలయంలోని సన్‌టీవీ నెట్‌వర్క్‌ను బయటకు పంపివేసి పోటీగా కలైంజర్ టీవీని ప్రారంభించారు.
అదేవిధంగా రాష్ట్రంలో తమిళనాడు అరసు టీవీ కార్పొరేషన్‌ను స్థాపిం చి తక్కువ చందాతో ఎక్కువ చానళ్లను ప్రసా రం చేసేలా పథకాన్ని రూపొందించారు. ఈ క్రమంలోనే కేబుల్ టీవీ ప్రసారాలకు డిజిటల్ సౌకర్యాన్ని కల్పించాలని 2008లో ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. దీంతో తమిళనాడులో డిజిటల్ సేవలకనుగుణంగా సెట్‌టాప్ బాక్సు లు, ఇతర వస్తు సామగ్రికి అప్పటి కరుణ ప్రభుత్వం రూ.50 కోట్లు ఖర్చుచేసింది. ఈ లోగా ఇరువర్గాల మధ్య అవగాహన కుదరడంతో అరసు టీవీ పథకాన్ని ఉద్దేశపూర్వకంగా అటకెక్కించారు.
2011లో అధికారంలోకి వచ్చిన జయలలిత అరసు టీవీ పథకాన్ని అమలుపై దృష్టి సారించారు. డీఎంకే నేతృత్వంలోని ప్రైవే టు చానళ్ల ప్రవాహానికి అరసు టీవీతో అడ్డుకట్ట వేస్తూ సెప్టెంబరు 2న అరసు కేబుల్ టీవీ ప్రసారాలను ప్రారంభించారు. రాష్ట్రంలో కేబుల్ సేవ ల కోసం వినియోగదారుల ద్వారా రూ.150 నుంచి రూ.250 వరకు వసూలు చేస్తూ 30 నుంచి 70 చానళ్లను మాత్రమే ప్రసారం చేసేవారు. అరసు టీవీ రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో రూ.70లకు 100 చానళ్లను అందజేస్తోంది. 24 వేల కేబుల్ టీవీ ఆపరేటర్ల ద్వారా 65 లక్షల చందాదారులు అరసు టీవీ సేవలను అందుకుంటున్నారు.
తక్కువ ధరతో ప్రసారాలను అందజేస్తుండడంతో అరసు టీవీ ప్రజాభిమానం చూరగొంది. ట్రాయ్ నిర్ణయం ప్రకా రం అరసు టీవీకి డిజిటల్ ప్రసారం హక్కును కల్పించాల్సిందిగా 2012లో జయ కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్ర ఎంపీలు, మంత్రులు అప్పటి ప్రధానిని నేరుగా కలిసి విన్నవించారు. యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న డీఎంకే సహజంగానే అమ్మ ప్రయత్నాలకు అడ్డుతగిలింది. రాష్ట్రంలోని ఇతర ప్రైవేటు టీవీ కంపెనీలకు, ఆపరేటర్లకు డిజిటల్ ప్రసారాల అనుమతులు మంజూరు చేసిన కేంద్రం అరసు టీవీకి మొండిచేయి చూపింది.
రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు టీవీలకు మేలు చేసేందుకే అర సు టీవీకి అనుమతి నిరాకరించారని భావిస్తున్నట్లు పరోక్షంగా కరుణ చానళ్లను ఉద్దేశించి సీఎం జయ అప్పట్లో వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో కేంద్రంలో యూపీ ఏ ప్రభుత్వం పతనమై ఎన్డీఏ ప్రభుత్వం రావ డం, రాష్ట్రంలో కరుణ నేతృత్వంలో ‘ఉదయ సూర్యుడు’ అస్తమించడంతో జయకు కలిసి వచ్చింది. అరసు టీవీకి డిజిటల్ ప్రసార సౌకర్యం కల్పించాలని కోరుతూ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు లేఖ రాశారు.
ఈ లేఖను అన్నాడీఎంకే ఎంపీలు శుక్రవారం స్వయంగా ఢిల్లీలో మంత్రిని కలిసి అమ్మ తరపున అందజేశారు. ఎన్డీఏ ప్రభుత్వంతో సఖ్యతగా మెలుగుతున్న జయలలిత డిజిటల్ ప్రసారాలు సాధిస్తారని ఆశించవచ్చు.