‘ఫైబర్‌గ్రిడ్’లో రూ.వేల కోట్ల దోపిడీ
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరిపించి, దోషుల నుంచి సొమ్ము రికవరీ చేయాలని మంగళవారం శానస సభలో అధికార వైఎస్సార్సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. గత టీడీపీ పాలకులు అస్మదీయ సంస్థలకు ఈ ప్రాజెక్టును కట్టబెట్టి, రూ.వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కేబుల్ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని తాము చెప్పిందే ప్రజలకు టీవీల ద్వారా చూపించాలంటూ నియంతృత్వ విధానానికి తెరలేపారని, గుత్తాధిపత్యం చలాయించాలని చూశారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు. నెలకు రూ.149కే టీవీ కనెక్షన్, ఇంటర్నెట్, ఫోన్ కనెక్షన్ ఇస్తామని ప్రచారం చేసిన టీడీపీ పాలకులు రూ.1,500 కూడా విలువ చేయని సెట్‌టాప్ బాక్సు పేరుతో రూ.4,000 చొప్పున వసూలు చేశారని ధ్వజమెత్తారు. ‘‘అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుచరులకు చెందిన 4 కంపెనీలకు ఫైబర్ నెట్వర్కు ప్రాజెక్టును అప్పగించారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. దుర్బుద్ధితో సొంత ప్రయోజనాల కోసం ఫైబర్‌గ్రిడ్‌ను వాడుకున్నారు. ఫైబర్‌గ్రిడ్ నిధులను అప్పటి మంత్రి నారా లోకేశ్ రక్తంలా పీల్చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపి, అవినీతిని నిగ్గు తేల్చాలి. రివర్స్ టెండరింగ్ విధానంలో ముందుకెళ్లాలి’’ అని జోగి రమేష్ డిమాండ్ చేశారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా చంద్రబాబు సర్కారు గుత్తాధిపత్యానికి తెరలేపిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. సెట్‌టాప్ బాక్సుల కొనుగోలుతోపాటు ఇతర వ్యవహారాలపైనా దర్యాప్తు జరపాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. గుంటూరు, నరసరావుపేటలో ‘కే’ (కోడెల) చానల్ అక్రమాలపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
అవినీతిపై దర్యాప్తు జరిపిస్తాం: మంత్రి గౌతంరెడ్డి
ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో ఎక్కువ ధరకు సెట్‌టాప్ బాక్సుల కొనుగోలు చేయడం వల్ల రూ.1,000 కోట్లు దుర్వినియోగమైన విషయం వాస్తవమేనని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అంగీకరించారు. ఈ ప్రాజెక్టులో అవినీతి అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించారు. కాగా, అవినీతి, నియంత పాలన కలిపితే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అభివర్ణించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ కేసులో నిందితుడైన వేమూరి రవికుమార్‌కు చెందిన సంస్థలకు ఈ ప్రాజెక్టు కట్టబెట్టారని విమర్శించారు. లక్షల సెట్‌టాప్ బాక్సుల కొనుగోలులో రూ.వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై విచారణ జరిపిస్తామని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని బుగ్గన చెప్పారు.
అన్న క్యాంటీన్ల నిర్మాణంలో అవినీతిపై విచారణ
మంత్రి బొత్స సత్యనారాయణ
టీడీపీ సర్కారు హయాంలో అన్న క్యాంటీన్ల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఎలాంటి ప్రణాళిక, ఆలోచన లేకుండా ఎన్నికల ముందు ఎక్కడ స్థలం దొరికితే అక్కడ ఈ క్యాంటీన్లు నిర్మించారని తెలిపారు. తెలంగాణలో అన్నపూర్ణ పేరుతో ఇదే తరహా క్యాంటీన్లు నిర్వహిస్తున్నారని, అక్కడ ఒక్కోదానికి రూ.1.50 లక్షలు వెచ్చిస్తే, ఏపీలో మాత్రం చంద్రబాబు సర్కారు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు ఖర్చు చేసిందని విమర్శించారు. అన్న క్యాంటీన్ల నిర్మాణంలో అవినీతిపై విచారణ జరిపిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.