
హైదరాబాద్: వినియోగదారులకు వినోదాన్ని అందించడానికి కృషి చేస్తున్న కేబుల్ వ్యవస్థపై జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ డిజిటల్ కేబుల్ ఆపరేటర్స్ ఫెడరేషన్ (టీడీసీఓఎఫ్) అధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వర్ డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీడీసీఓఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో జగదీశ్వర్ మాట్లాడుతూ.. 30 ఏళ్ల క్రితం నిర్మించుకున్న కేబుల్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ట్రాయ్ అనే కొత్త టారీఫ్‌ను తీసుకొచ్చారని ఆరోపించారు. దేశంలో 17 కోట్ల టీవీలు ఉంటే 10 కోట్ల బ్రాడ్‌కాస్ట్, 7 కోట్ల కేబుల్ చానెల్స్ ఉన్నాయని చెప్పారు.
ట్రాయ్ విధించిన రూ. 19 గరిష్ట రేటును రూ. 5 లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. 350 చానెళ్లకు కేవలం రూ.250 వసూలు చేస్తున్నామని, ట్రాయ్ కొత్త నిబంధన ప్రకారం రూ.1,000 భారం పడుతుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కేబుల్ ఆపరేటర్లు కీలక పాత్ర పోషించారని, సీఎం కేసీఆర్ తమ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బద్రినాథ్ యాదవ్, ఉపాధ్యక్షులు బంగారు ప్రకాశ్ పాల్గొన్నారు.